బాహుబలి ఫీవర్ పాలిటిక్సుకూ పాకేసినట్లుంది.... నిరసనలకు, ఆందోళనలకు పెట్టింది పేరైన వామపక్షాలు ఈ కొత్త ట్రెండును అందుకున్నాయి. కేంద్రంలో అవినీతి మంత్రులను వెంటనే తొలగించాలని హైదరాబాదులో వామపక్షాలు సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్కు వరకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాహుబలి సినిమాలోని కాళకేయ వేషధారణలో వారు నిరసన తెలిపారు. సాధారణంగా నిరసనలు, ఆందోళనలు అంటే లైట్ గా తీసుకునే హైదరబాద్ ప్రజలు వామపక్షాల నిరసనలో ఈ నయా ట్రెండు కనిపించడంతో ఆసక్తిగా చూశారు.
ర్యాలీ సందర్భంగా సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్రం పూర్తిగా అవినీతి రొంపిలో కూరుకుపోయిందని అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు ఎంతో అవినీతికి పాల్పడ్డారని వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు కూడా అలాంటి బాటలోనే కొనసాగారని, వారు చేసిన అవినీతికి బాధ్యత వహించి వెంటనే రాజీనామాలు చేసి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
సాధారణంగా ఎర్రజెండాలు, దిష్టిబొమ్మల దహనాలు.... నినాదాలకే పరిమితమయ్యే ఇందిరాపార్కు నిరసనలకు భిన్నంగా ఈసారి బాహుబలి సినిమాలోని పాపులర్ పాత్ర కాళికేయను వాడుకోవడంతో ఆటుగా వెళ్తున్నవారంతా ఆగి మరీ చూశారు.