టీ కాంగ్రెస్ కు దానం మార్క్ షాక్?

Update: 2015-09-20 09:24 GMT
కొంతమంది నేతలకు అధికారం కావాలి. అది లేకపోతే ఏ మాత్రం తట్టుకోలేరు. పార్టీ అన్నా.. అధినాయకత్వం అన్నా విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నట్లుగా బిల్డప్ ఇచ్చే నేతలు.. పవర్ లెక్కలో ఏ మాత్రం తేడా వచ్చినా అస్సలు సహించలేరు. భరించలేరు. అలాంటి నేతల్లో తెలంగాణ ప్రాంతానికి.. హైదరాబాద్ కు చెందిన దానం నాగేందర్ ఒకరు. ఆయన పార్టీలో ఉండాలంటే అధికారం ఉండాలి. పవర్ లేకుంటే పార్టీని ఏమాత్రం పట్టించుకోని ఆయన.. తాజాగా వార్తల్లోకి వచ్చారు. తెలంగాణ అధికారపక్షం సంధించిన ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రానికి చిక్కుకున్న నేత ఆయనే.

నిజానికి పార్టీలు మారటం.. ఎలాంటి మొహామాటం లేకుండా మళ్లీ పార్టీలోకి వెళ్లటం లాంటివి దానంకు అలవాటే. ఆ విషయం ఎవరో చెప్పనక్కర్లేదు చరిత్రను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. సరిగ్గా పదకొండేళ్ల క్రితం జరిగిన ఒక ఘటన చూస్తే ఈ విషయం మరింత బాగా అర్థమవుతుంది.

2004 ఎన్నికల సమయంలో పార్టీ తనకు టిక్కెట్టు ఇవ్వకపోవటంతో అలిగిన దానం నాగేందర్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. నాగేందర్ గెలిచారు కానీ.. ఆయన పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఎమ్మెల్యే పదవి ఉండగానే ఏం బాగుంటుంది. చేతిలో పవర్ లేకుండా..? అందుకే ఆయన వెంటనే నాటి ముఖ్యమంత్రి వైఎస్ వద్దకు పరిగెత్తుకెళ్లారు.

నిజానికి దానంకు టిక్కెట్టు ఇప్పించేందుకు వైఎస్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో పార్టీ మీద అలిగి.. వేరే పార్టీలో చేరి గెలిచిన దానం.. వెనువెంటనే పార్టీ మారిపోయేందుకు సిద్ధమైపోయారు. తనకు విధేయుడైన దానంను పార్టీలో చేర్చుకోవటానికి వైఎస్ పెద్దగా ఆలోచించలేదు. పార్టీ మారే సమయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో దానం చెప్పిన మాటేమిటంటే.. పార్టీ మారిన నాటి నుంచి తన మనసు మనసులో లేదని.. కాంగ్రెస్ పార్టీలో తప్ప తనను తాను మరోపార్టీలో ఊహించుకోలేకపోతున్నానని.. చివరకు వేరే పార్టీ కండువా భుజానికి వేసుకోవటానికి మనసు ఒప్పుకోవటం లేదని భారీ కథనే వినిపించారు. ఆ తర్వాత మంత్రి కావటం.. రాష్ట్రాన్ని ఏలటం తెలిసిందే.

2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన ఆయన.. తర్వాతి పరిస్థితుల్ని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. పదేళ్లు అధికారం అనుభవించిన ఆయనకు.. ఇప్పుడు పదవి లేకుండా ఉండటం నచ్చటం లేదు. దీనికి తోడు తెలంగాణలో నానాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత బలోపేతం అవుతున్న నేపథ్యంలో పార్టీ మారాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించినట్లుగా చెబుతున్నారు.

అందుకే.. ఈ నెల 23న టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవటానికి సిద్ధం అయినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని.. పదవిలో వచ్చినందుకు చక్కటి పదవిని కేసీఆర్ ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. పార్టీలోకి దానం చేరిక మరింత లాభాన్ని కలిగిస్తుందన్న వాదన విపిస్తోంది. మొత్తంగా.. దానం మార్క్ దెబ్బ టీ కాంగ్రెస్ కు తప్పటం లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News