హోరాహోరీ సమరంలో అమెరికా చేతిలో చైనాకు తప్పని ఓటమి
రజతం, కాంస్యం కంటే ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన దేశం పతకాల పట్టికలో ముందు ఉంటుంది.
ఒకప్పుడు అమెరికా-సోవియట్ యూనియన్ (రష్యా) నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డాయి.. వాటి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కూడా జరిగింది. అది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా? అన్న భయాందోళనలూ నెలకొన్నాయి. కానీ, సోవియట్ పతనం అనంతరం అమెరికా ఏకైక అగ్ర రాజ్యంగా మిగిలింది. మళ్లీ దానిని ఢీకొట్టేందుకు రష్యాకు శక్తియుక్తులు సరిపోవడం లేదు. ఆ స్థానాన్ని భర్తీ చేస్తానంటూ చైనా దూసుకొచ్చింది. అమెరికా కొమ్ములు విరిచేలా కనిపించింది. అయితే.. డ్రాగన్ ఎంత పోరాడినా అమెరికా చేతిలో ఓటమి తప్పలేదు. చివరకు డ్రాగన్ తోక ముడిచింది.
పైన చెప్పుకొన్నదంతా యుద్ధరంగంలో కాదు.. క్రీడా యుద్ధంలో. నువ్వానేనా అన్నట్లు నిన్నటివరకు పారిస్ ఒలింపిక్స్ లో పోటీ పడ్డాయి అమెరికా-చైనా. దీంతో పతకాల సంఖ్యలో టాపర్ ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. చివరకు ఏం జరిగిందో అందరూ చూశారు. చైనాకు రెండో స్థానమే ఖాయమైంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
స్వర్ణాలు సమం.. అయినప్పటికీ
రజతం, కాంస్యం కంటే ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన దేశం పతకాల పట్టికలో ముందు ఉంటుంది. అంటే.. ఒక్క స్వర్ణం గెలిచినా.. పది రజతాలు/కాంస్యాల కంటే ఎక్కువేనన్నమాట. ఇక పారిస్ విషయానికి వస్తే.. అమెరికా, చైనా సమానంగా స్వర్ణాలు (40 చొప్పున) నెగ్గాయి. దీంతో ఏంచేశారంటే. ఓవరాల్ పతకాలను లెక్కలోకి తీసుకున్నారు. ఈ ప్రకారం చైనా అమెరికాకు చాలా దూరంలో ఉండిపోయింది. అమెరికా 40 స్వర్ణాలు, 44 రజతాలు, 42 కాంస్యాలు నెగ్గి.. మొత్తం 126 పతకాలు ఖాతాలో వేసుకుంది. అదే చైనా 27 రజతాలు, 24 కాంస్యాలకు తోడు 40 స్వర్ణాలతో మొత్తం 91 పతకాలతో సరిపెట్టుకుంది. దీంతో 35 పతకాలు ఎక్కువగా ఉన్న అమెరికా టేబుల్ టాపర్ అయింది.
ఓ దశలో దాటేస్తుందనుకుంటే..
చైనాకు పెట్టని కోట అయిన టేబుల్ టెన్నిస్ (టీటీ)లో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఓ దశలో 40 స్వర్ణాలతో అమెరికాను వెనక్కినెట్టింది. కానీ, శని, ఆదివారాల్లో పరిస్థితి మారిపోయింది. తమకు పట్టున్న అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్ లో అమెరికా దుమ్మురేపింది. స్వర్ణాల్లో చైనాను అందుకుంది. ఇలా అగ్ర స్థానం చేజారకుండా చూసుకుంది. శనివారం అర్ధరాత్రి 4×400 మీటర్ల రిలేలో, ఆదివారం బాస్కెట్ బాల్ లో పురుషులు, మహిళల జట్లు స్వర్ణాలు సాధించడంతో అమెరికా గట్టెక్కింది.
ఉత్కంఠను దాటేసి..
పారిస్ ఒలింపిక్స్ లో చిట్టచివరి ఈవెంట్ మహిళల బాస్కెట్ బాల్ ఫైనల్. దీనికిముందు బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణాలు నెగ్గిన చైనా స్కోరును 40కి పెంచుకుంది. అప్పటికి అమెరికా స్వర్ణాలు 39 మాత్రమే. దీంతో అమెరికా మహిళలు పోటీ పడుతున్న బాస్కెట్ బాల్ ఫైనల్ మీద అందరి దృష్టీ నిలిచింది. ఈ మ్యాచ్ లో ఫ్రాన్స్ తో పోటీ హోరాహోరీగా సాగింది ఫ్రాన్స్ గెలిచేలా కూడా కనిపించింది. అమెరికా అద్భుతంగా పోరాడి 67-66తో గెలిచి ఊపిరి పీల్చుకుంది. దీంతో స్వర్ణాల్లో చైనాను సమం చేసింది. మొత్తం పతకాల సంఖ్య కారణంగా టాప్ లో నిలిచింది. కాగా.. సొంతగడ్డపై 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్ లో మాత్రమే చైనా అమెరికాను దాటేసింది.