దుమ్మురేపిన తెలుగమ్మాయి.. అండర్19 ప్రపంచ కప్ లో రికార్డు సెంచరీ
మలేసియాలో జరుగుతున్న అండర్ 19 మహిళల ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా దూసుకెళ్తోంది..
52, 4, 27, 49, 40, 110.. ఎంతో నిలకడ ఉంటే తప్ప ఓ బ్యాటర్ ఇంతగా రాణించలేరు.. అలాంటి బ్యాటర్ ఎవరో కాదు. మన తెలుగమ్మాయే..
మలేసియాలో జరుగుతున్న అండర్ 19 మహిళల ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా దూసుకెళ్తోంది.. వరుసగా విజయాల మీద విజయాలు సాధిస్తోంది. బంగ్లాదేశ్, శ్రీలంక.. ఇలా ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థినీ ఓడిస్తోంది. తాజాగా స్కాట్లాండ్ నూ మట్టికరిపించింది. అయితే, ఈ మ్యాచ్ లో తెలుగమ్మాయి గొంగడి త్రిష హైలైట్ గా నిలిచింది.
టి20 ఫార్మాట్లో పురుషుల సీనియర్ క్రికెట్లో సెంచరీ చేయడమే కష్టం.. అమ్మాయిల్లో అయితే ఇంకా కష్టం. కానీ, త్రిష మాత్రం దానిని సాధ్యం చేసింది. స్కాట్లాండ్ తో మ్యాచ్ లో త్రిష కేవలం 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్ లతో 110 పరుగులు చేసింది. దీంతో అండర్-19 టీ20ల్లో తొలి శతకం బాదిన బ్యాటర్ గా ఆమె రికార్డు సృష్టించింది.
కాగా, సూపర్ సిక్స్ లో భాగంగా జరిగిన ఈ చివరి మ్యాచ్ లో టాస్ ఓడిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ కు దిగింది. 20 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసింది. త్రిష సెంచరీకి తోడు ఓపెనర్ కమలిని(51) అర్ధ సెంచరీ కొట్టింది. సానికా చల్కే (29 నాటౌట్) రాణించింది.
త్రిష.. ఓ త్రిష..
అండర్ 19 ప్రపంచ కప్ లో ప్రతి మ్యాచ్ లోనూ ఓపెనింగ్ బ్యాటర్ అయిన త్రిష ఆటతీరు ఆకట్టుకుంటోంది. టీమ్ ఇండియా ఇప్పటికే సెమీస్ చేరిందంటే ఆమె బ్యాటింగే కారణం. ఈ క్రమంలో స్కాట్లాండ్ పైనా చివరి మ్యాచ్ లోనూ చెలరేగింది. త్రిష - కమలిని తొలి వికెట్ కు 147 పరుగులు జోడించారు. సానికా-త్రిష రెండో వికెట్ కు 61 పరుగులు జోడించారు. అండర్ 19 వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా త్రిషనే కావడం గమనార్హం.