కోహ్లి రంజీ మ్యాచ్.. కాళ్లకు మొక్కులు.. 2 కిలోమీటర్ల క్యూ
ఇలాంటి సమయంలో దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో రైల్వేస్ తో మొదలైన మ్యాచ్ లో ఢిల్లీకి ఆడుతున్నాడు. దీంతో అతడిని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.
ఒకటీ రెండు కాదు.. దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలో దిగాడు.. అది కూడా సొంతగడ్డపై ఆడుతున్నాడు. అంతర్జాతీయ స్టార్ గా ఎదిగిన తమ లోకల్ బాయ్ తమ సిటీలోని గ్రౌండ్ లో కనిపిస్తే ఇంకేం..? అరుణ్ జైట్లీ మైదానంలో ఇప్పుడదే జరుగుతోంది..
కోహ్లి 2013 తర్వాత రంజీ మ్యాచ్ బరిలో దిగుతున్నాడంటేనే అభిమానుల్లో ఆశ్చర్యం.. పైగా కోహ్లి ఇప్పుడు ఫామ్ పరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో రైల్వేస్ తో మొదలైన మ్యాచ్ లో ఢిల్లీకి ఆడుతున్నాడు. దీంతో అతడిని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.
ఢిల్లీ క్రికెట్ డెవలప్ మెంట్ అసోసియేషన్ (డీడీసీఏ).. కోహ్లి ఉన్నందున రంజీ మ్యాచ్ ను చూసేందుకు 10వేల మందికి పైగా ప్రేక్షకులు వస్తారని ఊహించి ఏర్పాట్లు చేసింది. అయితే, అంతకుమించి అన్నట్లుగా అభిమానులు తరలివచ్చారు. స్టేడియం వద్ద రెండు కిలోమీటర్ల మేర బారులు కనిపించాయి. ఈ నేపథ్యంలో స్వల్ప తోపులాట జరిగింది. స్టేడియం 16వ గేట్ వద్ద అభిమానులు నెట్టుకుంటూ ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. కొందరు పడిపోయారు. బూట్లు, చెప్పులు వేరయ్యాయి. ముగ్గురు గాయపడినట్లు తెలుస్తోంది. అభిమానులను మైదానంలోకి పంపించేందుకు మూడు గేట్లను మాత్రమే తెరిచి ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ మెట్రో స్టేషన్ దగ్గరగా ఉండే గేట్ 16, గేట్ 17 వద్ద అభిమానులు ఉదయం నుంచే క్యూ కట్టారు. గంట అయినా.. గేట్లను తెరవలేదు. అభిమానులు ఆధార్ కార్డుతో రావాలని డీడీసీఏ కోరింది.. కానీ, ఫ్యాన్స్ తోసుకురావడంతో తనిఖీ చేసే పరిస్థితే లేకపోయింది.
రైల్వేస్ తో మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోహ్లి ఫీల్డింగ్ కు దిగాడు. ఎప్పటిలాగానే సహచరులను ఉత్సాహపరుస్తూ, మైదానంలో చురుగ్గా కదిలిన అతడికి వింత అనుభవం ఎదురైంది. ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కాడు. అతడిని పైకి లేపిన కోహ్లి ఇలా చేయొద్దని కోరాడు.