చాంపియన్స్ ట్రోఫీకి టీమ్ ఇండియా.. తెలుగు రాష్ట్రాలకు షాక్

నిన్నమొన్నటివరకు ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కగా ఇప్పుడు ఒక్కరికీ అవకాశం లేకుండా పోయింది.

Update: 2025-01-18 11:30 GMT

వారం ఆలస్యంగా.. చాంపియన్స్ ట్రోఫీకి టీమ్ ఇండియాను ప్రకటించిన బీసీసీఐ.. తెలుగు రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. నిన్నమొన్నటివరకు ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కగా ఇప్పుడు ఒక్కరికీ అవకాశం లేకుండా పోయింది. గాయాలు సమస్య కాకున్నా.. మనవాళ్లకు చోటు లేకపోవడం ఆశ్చర్యకరం.

యువ ఆల్ రౌండర్ కు నిరాశే.. ఇటీవలి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో అదరగొట్టిన విశాఖపట్టణం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని చాంపియన్స్ ట్రోఫీకి పరిగణనలోకి తీసుకుంటారని అనుకున్నా అదేమీ జరగలేదు. టి20ల్లోనూ రాణించడంతో నితీశ్ పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పేస్ బౌలింగ్ చేయగల ఆల్ రౌండర్ గా నితీశ్ ను భవిష్యత్ లో మంచి స్థానంలో చూస్తారని అనుకుంటుండగా బీసీసీఐ మాత్రం చాంపియన్స్ ట్రోఫీకి పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, నితీశ్ ను ఇది విస్మరించినట్లు కాదు. భవిష్యత్ లో అతడికి అవకాశాలు దక్కొచ్చు.

వీరం తిలకం.. టి20ల్లో దుమ్మురేపుతున్న హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మను కూడా చాంపియన్స్ ట్రోఫీకి తీసుకోలేదు. తిలక్ ను ఇప్పటికీ టి20 ఫార్మాట్ స్పెషలిస్ట్ గానే చూస్తున్నారని తెలుస్తోంది. అయితే, అతడికి మున్ముందు వన్డే జట్టులోకి అవకాశాలు దక్కొచ్చు. ఓపెనర్ గా యశస్వి జైశ్వాల్, మరో యువ బ్యాటర్ శుబ్ మన్ గిల్ కూడా ఉండడంతో తిలక్ కాస్త వేచి చూడక తప్పేలా లేదు.

అసలు షాక్ ఇదే..

ఐదారేళ్లుగా టీమ్ ఇండియాలో రెగ్యులర్ సభ్యుడు హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్. మూడు ఫార్మాట్లలోనూ సిరాజ్ ఆడుతున్నాడు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లోనూ రాణించాడు. అయితే, విపరీతమైన క్రికెట్ షెడ్యూల్ తో సిరాజ్ బాగా అలసిపోయినట్లు తెలుస్తోంది. అతడి బౌలింగ్ లో పదును కూడా తగ్గుతోంది. దీంతో చాంపియన్స్ ట్రోఫీకి తీసుకోలేదు. సిరాజ్ స్థానంలో ఎడమ చేతి పేసర్ అర్షదీప్ ను ఎంపిక చేశారు.

Tags:    

Similar News