చీఫ్ సెలక్టర్ కు కొత్త కార్యదర్శి అల్టిమేటం..టీమ్ ఇండియా ప్రక్షాళన

అసోంకు చెందిన దేవజిత్.. సౌరభ్ గంగూలీ సారథ్యంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. బీసీసీఐ కార్యదర్శిగా రానున్న ఆయన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కు స్పష్టమైన సందేశం ఇచ్చారట.

Update: 2025-01-07 22:30 GMT

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)లో అధ్యక్షుడు ఉన్నప్పటికీ కార్యదర్శిదే హవా. ఆయన ఏం చెబితే అదే చెల్లుతుంది. మొన్నటి వరకు కేంద్ర హోం శాంఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నారు. టీమ్ ఇండియా వ్యవహారాలను ఆయన నిశితంగా గమనించేవారు. జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు కావడంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీ అయింది. ఈ బాధ్యతల్లోకి వచ్చాడు దేవజిత్ సైకియా.

అసోంకు చెందిన దేవజిత్.. సౌరభ్ గంగూలీ సారథ్యంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. బీసీసీఐ కార్యదర్శిగా రానున్న ఆయన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కు స్పష్టమైన సందేశం ఇచ్చారట.

న్యూజిలాండ్ తో సొంతగడ్డపై మూడు, బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మూడు (మొత్తం 5) టెస్టులు ఓడిన టీమ్ ఇండియాలో ప్రక్షాళనకు ప్రణాళికలు వేయాలని దేవజిత్ సూచించారని సమాచారం. ఇది కూడా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితోనే మొదలుపెట్టాలని సైకియా తెలిపినట్లు చెబుతున్నారు.

జట్టు ప్రక్షాళనపై దేవజిత్.. సెలక్షన్ కమిటీకి గట్టి సందేశమే చేరవేశారట. ముఖ్యంగా అగార్కర్ కు ఆటగాళ్ల విషయంలో ఊగిసలాట వద్దని తేల్చిచెప్పారట.

12న సమావేశం.. ఏం తేల్చుతారో?

బీసీసీఐ వచ్చే ఆదివారం (12వ తేదీన) ప్రత్యేకంగా సమావేశం కానుంది. ప్రస్తుత పరిస్థితిపై చర్చించడమే ఎజెండాగా పెట్టుకుంది. జట్టు భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. అనుకోని కారణాలతో ప్రస్తుతం బీసీసీఐ బలహీనంగా కనిపిస్తోందని.. బలమైన సందేశం పంపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా చెడు సందేశం వెళ్లిందని, దేశంలో క్రికెట్ ను బీసీసీఐ ముందుకు నడపాల్సిన అవసరం ఉందని ఓ అధికారి పేర్కొన్నారు. కొత్త జట్టు తయారీ నేపథ్యంలో.. చీఫ్ సెలక్టర్ అగార్కర్ ను పిలిచి కఠిన సందేశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు.

కొత్త కెప్టెన్ ఖాయమేనా?

టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ గా ఉన్న రోహిత్ తాజా పర్యటనలో ఐదో టెస్టు ఆడలేదు. ఆ మ్యాచ్ సందర్భంగా అతడు తనకు రిటైర్మెంట్ ఆలోచన లేదని తెలిపాడు. కానీ, బీసీసీఐ మాత్రం కెప్టెన్ వెదుకులాటలో ఉందట. ఈ మేరకు సైకియా కఠిన నిర్ణయాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చాంపియన్స్‌ ట్రోఫీ ప్రాబుబుల్స్ జాబితాను ఆదివారం వరకు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్ భవితవ్యం వచ్చే ఆదివారంతో తేలనుంది.

Tags:    

Similar News