మేటి ఆల్ రౌండర్ ను బుజ్జగించి.. బతిమిలాడిన చాంపియన్ జట్టు

గత ఏడాది జూలైలో చివరి వన్డే ఆడిన 32 ఏళ్ల స్టోక్స్ .. వన్డేలకు వీడ్కోలు పలికాడు

Update: 2023-08-17 17:30 GMT

జట్టులో అత్యధికులు భారీ హిట్టర్లే.. 9వ స్థానం బ్యాటింగ్ లోతుంది.. స్పిన్, పేస్ రెండింటిలోనూ బౌలింగ్ పదునుంది. నేడో, రేపో వన్డేల్లో 500 స్కోరు కొట్టగల సత్తా ఉంది. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగుతుండడంతో పాటు చాలామంది ఆటగాళ్లకు అలవాటైన పిచ్ లపై ప్రపంచ కప్ ఆడనుంది. కానీ, అతడు లేకుంటే లోటని భావించింది. ఏడాది కిందటే రిటైరన అతడిని పట్టుబట్టి మరీ ఒప్పించింది. రిటైర్మెంట్ వెనక్కు తీసుకుని మళ్లీ బరిలో దిగేలా చేస్తోంది. ఔను ఇంగ్లండ్ మేటి ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్‌ వన్డే క్రికెట్‌ లో పునరాగమనం చేస్తున్నాడు.

గత ఏడాది జూలైలో చివరి వన్డే ఆడిన 32 ఏళ్ల స్టోక్స్ .. వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఇష్టం వచ్చినట్లుగా వాస్తవానికి ద్వైపాక్షిక సిరీస్ లను ఒప్పుకొంటున్న ఇంగ్లండ్ బోర్డు వైఖరికి నిరసనగానే స్టోక్స్ వన్డేలను వీడాడు. విచిత్రం ఏమంటే అతడు టెస్టు కెప్టెన్. అంతేకాదు టి20లు ఆడుతున్నాడు. 2019 ప్రపంచ కప్ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు. అలాంటివాడు మూడు ఫార్మాట్లూ ఆడలేనంటూ వన్డేల నుంచి తప్పుకున్నాడు.

ఎవరైనా ఆటగాడు ఒత్తిడి ఎక్కవైతే సంప్రదాయ ఫార్మాట్ టెస్టుల నుంచి వైదొలగుతాడు కానీ.. వన్డేలు అందులోనూ ఐదారేళ్లు ఆడగల సత్తా ఉన్నవాడు ఎందుకు వదిలేస్తాడు? అనేది ప్రశ్న. అయితే, బోర్డు వైఖరికి నిరసనగానే స్టోక్స్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. కాగా, సెప్టెంబరులో న్యూజిలాండ్‌ తో జరిగే నాలుగు వన్డేల సిరీస్‌ కు స్టోక్స్‌ ఇప్పుడు ఇంగ్లాండ్‌ జట్టుకు ఎంపికయ్యాడు.

అతడు చూపిన మార్గంలోనే..

స్పిన్ ఆల్ రౌండర్ మొయిన్‌ అలీ కొన్నేళ్ల కిందటే టెస్టులకు వీడ్కోలు పలికాడు. కాగా, ఇంగ్లండ్ కు యాషెస్ సిరీస్ అత్యంత ప్రతిష్ఠాత్మకం. ఇటీవల ముగిసిన ఈ సిరీస్ చాలా హోరాహోరీగా సాగింది. అయితే, మోయిన్ అలీ సేవలు అవసరం అని భావించిన స్టోక్స్‌.. అతడు రిటైర్మెంట్ వెనక్కు తీసుకునేలా ఒప్పించాడు. కెప్టెన్ కోరికను గౌరవించిన మోయిన్ అలీ మళ్లీ బరిలో దిగాడు. కాగా, ఇప్పుడిదే మంత్రాన్ని ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్ జోస్ బట్లర్ ఫాలో అయ్యాడు. స్టోక్స్‌ సేవలు వన్డే ప్రపంచ కప్‌లో ఎంతో అవసరమని భావించిన బట్లర్‌ , కోచ్‌ మాథ్యూ మ్యాట్‌.. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ అతడితో సంప్రదింపులు జరిపి ఒప్పించారు.

స్టోక్స్ అంటే అందుకే..

అందరూ స్టోక్సీ అంటూ ముద్దుగా పిలుచుకునే బెన్ స్టోక్స్ .. ఇంగ్లండ్ వన్డే ప్రపంచ కప్ కలను నెరవేర్చిన మొనగాడు. 2019లో ఇంగ్లండ్ సొంతగడ్డపై ప్రపంచ విజేతగా నిలిచిందంటే స్టోక్సే కారణం. 5 అర్ధ శతకాలు కొట్టాడు. ముఖ్యంగా ఫైనల్లో స్టోక్స్ ఇన్నింగ్స్ (84 నాటౌట్‌ ) చరిత్రాత్మకం. 242 పరుగుల లక్ష్యం ఛేదనలో 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ను స్టోక్స్ ఒంటి చేత్తో తిరిగి పోటీలో నిలిపాడు. మ్యాచ్‌ టై అయ్యేలా చేశాడు. సూపర్‌ ఓవర్లోనూ టై కాగా.. న్యూజిలాండ్‌ కన్నా ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ ను విజేతగా ప్రకటించారు. టెస్టుల్లోనూ గొప్ప ఇన్నింగ్స్ ఆడిన స్టోక్స్ మేటి ఆల్ రౌండర్ గా జట్టుకు విజయాలందించాడు.

ఓవైపు అంతర్జాతీయ మ్యాచ్‌ ల సంఖ్య బాగా పెరిగిపోగా.. మరోవైపు టీ20 లీగ్ లలో ఆడుతూ మూడు ఫార్మాట్లలో కొనసాగడం సవాలుగా మారింది. ఆటగాళ్లను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్న ఇంగ్లండ్‌ బోర్డు తీరును నిరసిస్తూ స్టోక్స్‌ వన్డేల నుంచి తప్పుకొన్నాడు. కానీ, అతడి సత్తా ఏమిటో తెలిసిన బోర్డు.. బతిమిలాడి.. బుజ్జగించి మళ్లీ జట్టులోకి తీసుకుంది. భారత్ లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో స్టోక్స్ మెరుపులు ఆస్వాదిద్దాం..

Tags:    

Similar News