అద్భుతం: చరిత్రను తిరగరాసేందుకు వచ్చేశాడు కుర్రాడు
హోరాహోరీగా సాగిన వింబుల్డన్ ఫైనల్
చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎంత వెలుగులు వెలిగినప్పటికి.. కొంతకాలానికి ఆ వెలుగుల ప్రభ మసకబారేలా చేసే శక్తి కాలానికి ఉంది. ఇప్పుడు అలాంటి టైం వచ్చేసింది. అసాధారణ ఆట తీరుతో టెన్నిస్ లో తిరుగులేని శక్తిగా మారిన జకోవిచ్ కు చెక్ పెట్టేసే కుర్రాడు వచ్చేశాడు. తన అద్భుత ఆట తీరుతో చరిత్రను క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో జకోవిచ్ కు సంబంధించి ఆనవాయితీలకు సైతం భరతవాక్యం పలికాడు. వింబుల్డన్ లో తొలి సెట్ గెలిచిన తర్వాత సదరు మ్యాచ్ లో ఓడిపోవటం అన్నది జకోవిచ్ కు లేదు. అలాంటి హిస్టరీని తన ఆట తీరుతో తుడిపేశాడు యువ సంచలనంగా మారిన స్పెయిన్ ఆటగాడు అల్కరాస్.
ఆదివారం హోరాహోరీగా సాగిన వింబుల్డన్ ఫైనల్ పోరులో రెండో సీడ్ జకోవిచ్ పై అద్భుత విజయాన్ని సాధించాడు. తొలి సెట్ ను ఓడిన అల్కరాస్.. తిరిగి పుంజుకొని కొత్త చరిత్రను క్రియేట్ చేశాడు. 4 గంటల 42 నిమిసాల పాటు సాగిన వీరి మధ్య పోరును చూసిన ప్రేక్షకులు.. టెన్నిస్ అభిమానులు ఇలాంటి మ్యాచ్ చూసి ఎన్నాళ్లైందన్న భావనకు గురయ్యారు. రెండు మద గజాల మధ్య పోరు జరిగితే ఎలా ఉంటుందో.. అలాంటి సన్నివేశమే ఆవిష్క్రతమైంది. మొదటి సెట్ ను కేవలం 34 నిమిషాల్లో ముగించి.. తన ఖాతాలో వేసుకున్న జకోవిచ్ మాంచి ఊపు మీద కనిపించారు.
సాధారణంగా తొలి సెట్ గెలిచిన వారికి ఒక సానుకూలత.. ఓడిన వారికి ఒక ప్రతికూలత ఉంటుంది. అందుకు భిన్నంగా అల్కరాస్ మాత్రం రెండో సెట్ నుంచి అనూహ్యంగా పుంజుకున్నాడు. తొలి సెట్ లో జకోవిచ్ ముందు తేలిపోయిన అతగాడు.. రెండో సెట్ నుంచి తన విశ్వరూపాన్నే చూపించాడన్నట్లుగా పోరు సాగింది. రెండో సెట్ లో స్కోర్ 2-2 సమమైంది. అక్కడి నుంచి ఇరువురు తమ సర్వీసుల్ని నిలబెట్టుకుంటూ పోటాపోటీగా ఆడిన ఆటలో ఎన్నో అద్భుత సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. టెన్నిస్ అభిమానులకు ఆట మజా ఏమిటో గుర్తు చేసేలా వారి మధ్య ఆట సాగింది.
రెండో సెట్ లోని ఏడో గేమ్ లో జకో కిందపడి మరీ బంతిని రిటర్న్ చేస్తే.. అందుకు ప్రతిగా అల్కరాస్ మరో వైపు బంతిని పంపి.. పాయింట్ సొంతం చేసుకున్నాడు. రెండో సెట్ ను సొంతం చేసుకోవటానికి తీవ్రంగా ఇరువురు ఆటగాళ్లు శ్రమించగా.. అల్కరాస్ సొంతమైంది. మూడో సెట్ లోనూ అల్కరాస్ అధిపత్యం ప్రదర్శించగా.. జకో వీరోచిత పోరాటమే చేశాడు. ఈ సెట్ లో సర్వీస్ నిలబెట్టుకోవటం కోసం జకో.. దాన్ని బ్రేక్ చేయటం కోసం అల్కరాస్ లు తీవ్రంగా పోరాడారు. ఈ కారణంగా సదరు గేమ్ ఏకంగా 26 నిమిషాల పాటు సాగటం గమనార్హం.
ఏడుసార్లు బ్రేక్ పాయింట్ తో పాటు 13 సార్లు 40-40 వద్ద పాయింట్లు సమంగా నిలిచాయి. అయితే.. చివరకు ఫోర్ హ్యాండ్ తప్పిదంతో జకో గేమ్ ను చేజార్చుకుంటే.. వరుసగా రెండు గేమ్ లు నెగ్గి అల్కరాస్ సెట్ ను సొంతం చేసుకున్నాడు. తొలిసెట్ ఓడిన అల్కరాస్.. వరస రెండు సెట్లు గెలవటంతో మ్యాచ్ ఏకపక్షంగా మారితే.. ఈ ఫైనల్ పోరును ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు.
మూడో సెట్ అనంతరం విరామం తీసుకున్న జకో.. మరోసారి కోర్టులో జూలు విదిల్చాడు. అల్కరాస్ జోరుకు కళ్లెం వేస్తూ.. నాలుగో సెట్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో.. రెండు సెట్లు జకో.. మరో రెండు సెట్లు అల్కరాస్ సొంతం చేసుకున్నారు. దీంతో.. మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది. నిర్ణయాత్మక ఐదో సెట్ కు మ్యాచ్ మళ్లింది. ప్రతి పాయింట్ కోసం ఇరువురు హోరాహోరీగా పోరాడారు. పాయింట్ పోతే ప్రాణం పోతుందా? అన్నట్లుగా ఇరువురు ఆటగాళ్లు ఆడారు. అలాంటి పరిస్థితుల్లో మూడో గేమ్ లో జకో సర్వీస్ ను అల్కరాస్ బ్రేక్ చేయటంతో మ్యాచ్ ను కీలక మలుపు తిప్పింది.
అనంతరం తన సర్వీస్ ను నిలబెట్టుకున్న అల్కరాస్ 3-1 అధిక్యతను ప్రదర్శించాడు. దీంతో కోపం పట్టలేని జకో తన రాకెట్ ను విరగొట్టాడు. ఆ తర్వాత జకో ప్రయత్నం చేసినా ఫలించలేదు. అల్కరాస్ తన పోరాటాన్ని ఆపకుండా కొనసాగించటంలో విజయం అతడివైపు మొగ్గింది. విన్నింగ్ షాట్ కొట్టినంతనే.. పట్టలేని ఆనందంతో కోర్టులోనే పడిపోయాడు. ఆటలో ఒకరు ఓడటం.. మరొకరు గెలవటం కామనే అయినా.. ఈ మ్యాచ్ ను మాత్రం టెన్నిస్ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోరనే చెప్పాలి. జకోకు చెక్ పెట్టే యువకెరటం.. అల్కరాస్ రూపంలో వచ్చిందని చెప్పక తప్పదు.