పగ్గాలొదిలిన దిగ్గజం.. ఐపీఎల్ ప్రారంభానికి ముందే సంచలనం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) శుక్రవారం నుంచి మొదలుకానుండగా గురువారం సంచలనం చోటుచేసుకుంది

Update: 2024-03-21 11:25 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరు..? కోల్ కతాకు రెండుసార్లు కప్ అందించిన గౌతమ్ గంభీరా..? ముంబైని ఐదుసార్లు చాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మనా..? రాయల్ చాలెంజర్స్ బెంగళూరును దీటుగా నిలిపిన విరాట్ కోహ్లినా?.. సగటు అభిమానిని ఈ ప్రశ్న అడిగితే అతడు చెప్పే సమాధానం మాత్రం వేరు.

లీగ్ మొదలుకు ముందు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) శుక్రవారం నుంచి మొదలుకానుండగా గురువారం సంచలనం చోటుచేసుకుంది. మొన్నటికి మొన్న ముంబై ఇండియన్స్ ఏకంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పక్కనపెట్టింది. గుజరాత్ నుంచి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి మరీ పగ్గాలు అప్పగించింది. ఇక ఐపీఎల్ 17వ సీజన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. మ్యాచ్ జరగడమే తరువాయి అనుకుంటుండగా..

ధోనీ కాదు రుతురాజ్..

లీగ్ లో అత్యంత విజయవంతమై జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే). దీనికి 2008 నుంచి సారథి మహేంద్ర సింగ్ ధోనీనే. మధ్యలో చెన్నై లీగ్ కు దూరమై పుణె పేరిట ఆడినా కెప్టెన్ మాత్రం ధోనీనే. మధ్యలో స్టీవ్ స్మిత్ కు పగ్గాలు అప్పగించినా అతడు తేలిపోయాడు. 13 సీజన్లలో సారథిగా అతడు చెన్నైకి ధోనీ 5 టైటిళ్లు అందించాడు. 10 సార్లు జట్టును ఫైనల్ చేర్చాడు. 226 మ్యాచ్ లలో 133 గెలిపించాడు. 91 మ్యాచ్ లలో ఆ జట్టు ఓడిపోయింది. చివరగా నిరుడు చాంపియన్ గా నిలిచింది ధోనీ నాయకత్వంలోనే. కాగా, అలాంటి ధోనీ గురువారం చెన్నై కెప్టెన్ గా తప్పుకొన్నాడు.

ముందే సంకేతం..

సంప్రదాయం ప్రకారం టీమ్ కెప్టెన్లు అందరూ లీగ్ ప్రారంభానికి ముందు ఫొటో సెషన్ లో పాల్గొంటారు. గురువారం ఇలాంటి సమయంలోనే అనూహ్య పరిణామం కనిపించింది ధోనీ ఈ ఫొటో సెషనలో పాల్గొనలేదు. కెప్టెన్ ధావన్ కాకుండా పంజాబ్ కింగ్స్ తరఫున వైస్ కెప్టెన్ జితేశ్ శర్మ ఫొటో షూట్ కు హాజరయ్యాడు. ఇదేమంత ఆసక్తికరం కాకున్నా.. ధోని బదులు చెన్నై కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ షూట్ కు హాజరయ్యాడు. దీంతోనే చెన్నై కెప్టెన్ గా ధోనీని తప్పించారా? అన్న అనుమానం వచ్చింది. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కాకుండా రుతురాజ్ కెప్టెన్ హోదాలో ఫొటో షూట్ లో పాల్గొనడమే మరో కీలక పరిణామం. 35 ఏళ్ల జడేజా కంటే 27 ఏళ్ల రుతురాజ్ లోనే చెన్నై భవిష్యత్ కెప్టెన్ ను చూస్తోందని స్పష్టం అవుతోంది. మరోవైపు జడేజా మూడేళ్ల కిందటనే కెప్టెన్ అయ్యాడు. కానీ, మధ్యలోనే జట్టును వదిలేశాడు. జట్టు వరుసగా ఓటములు పాలవడంతో పగ్గాలు వదిలేశాడు. అతడికి కెప్టెన్సీ ఇచ్చేందుకు ఇదే ప్రధాన అడ్డంకిగా మారిందని తెలుస్తోంది.

Tags:    

Similar News