వరల్డ్ రికార్డు.. ఓవర్‌లో 43 రన్స్.. కొట్టించుకున్నది అంతర్జాతీయ బౌలర్

ఓవర్ లో ఆరుకు ఆరు బంతులు సిక్స్ లుగా వెళ్తేనే 36 పరుగులు వస్తాయి.. కాస్త అటుఇటు అయితే రెండు, మూడు పరుగులు అదనంగా వస్తాయి

Update: 2024-06-26 17:08 GMT

ఓవర్ లో ఆరుకు ఆరు బంతులు సిక్స్ లుగా వెళ్తేనే 36 పరుగులు వస్తాయి.. కాస్త అటుఇటు అయితే రెండు, మూడు పరుగులు అదనంగా వస్తాయి. కానీ, ఒకే ఓవర్‌లో 43 పరుగులు ఇచ్చాడో పేసర్. అతడేమీ సాదాసీదా బౌలర్ కాదు.. అంతర్జాతీయ అనుభవం ఉన్నవాడు. అంతేకాదు.. ఇంగ్లండ్ వంటి పెద్ద టెస్టు జట్టుకు ప్రధాన పేసర్ కూడా.

43 బ్యాటర్ స్కోరు కాదు.. ఓవర్ స్కోరు

ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో అమెరికా పిచ్ లపై వంద పరుగులు కూడా చేయడం కష్టమైంది. కానీ, ఇంగ్లండ్ కౌంటీలో ఓ బ్యాట్స్ మన్ ఏకంగా ఒకే ఓవర్ లో 43 రన్స్‌ కొట్టాడు. ఇది ప్రపంచ రికార్డు కూడా. లీసెస్టర్‌ షైర్‌, సస్సెక్స్‌ మధ్య బుధవారం మ్యాచ్‌ జరిగింది. ఇందులో లీసెస్టర్ తరఫున 8వ నంబరు బ్యాటర్ గా వచ్చాడు లూయిస్‌ కింబర్‌. ససెక్స్ బౌలర్ ఓలీ రాబిన్సన్ 59వ ఓవర్‌ వేశాడు. అంతే.. కింబర్ సిక్స్‌ లతో చెలరేగాడు. ఓలీ బంతిపై పట్టు కోల్పోయాడు. మూడు నోబాల్స్‌ వేశాడు. కింబర్ మొత్తం రెండు సిక్స్‌ లు, 6 ఫోర్లు కొట్టాడు. కాగా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు దేశవాళీ ఛాంపియన్‌ షిప్‌ లో నోబాల్‌ కు రెండు పరుగులు అదనంగా ఇస్తారు. దీంతో ఓవర్ లో మొత్తం 43 పరుగులు ఒకే ఓవర్‌ లో వచ్చాయి.

కాగా.. కింబర్ వరుసగా 6, 6(nb),4,6,4,6(nb),4,6(nb)1 చేశాడు. కౌంటీ ఛాంపియన్‌ షిప్‌ 134 ఏళ్ల చరిత్రలో ఒకే ఓవర్‌ లో ఇన్ని పరుగులు కొట్టడం ఓ రికార్డు. ఇది ప్రపంచ రికార్డు కూడా.

భారత్ లో చివరి టెస్టు

కుడిచేతివాటం పేసర్ అయిన 30 ఏళ్ల ఓలీ రాబిన్సన్ ఇప్పటివరకు ఇంగ్లండ్ కు 20 టెస్టులాడి 76 వికెట్లు తీశాడు. ఇటీవల భారత్ లో పర్యటించిన ఇంగ్లండ్ జట్టులో సభ్యుడు కూడా. చివరగా రాంచీలో ఫిబ్రవరి 23 నుంచి జరిగిన టెస్టులో ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో అర్థ సెంచరీ చేశాడు. అయితే, ప్రధానంగా పేసర్ అయినప్పటికీ వికెట్లేమీ పడగొట్టలేకపోయాడు. ఇక రాబిన్సన్ ను ఒకే ఓవర్ లో 43 పరుగులు బాదేసిన బ్యాటర్ కింబర్ ఓ అనామకుడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో అతడు 127 బంతుల్లో 243 పరుగులు చేశాడు. 20 ఫోర్లు, 21 సిక్స్ లు కొట్టాడు.

Tags:    

Similar News