గుర్తు పెట్టుకోండి.. భావి టి20 విధ్వంసకులు వీరే.. రికార్డులు బద్దలే..

క్రిస్ గేల్ శకం ముగిసింది.. డివిలియర్స్ తరం అంతమైంది.. మెకల్లమ్ కాలం పోయింది.. బట్లర్ కెరీర్ ముగింపునకు వచ్చింది

Update: 2024-04-30 17:30 GMT

క్రిస్ గేల్ శకం ముగిసింది.. డివిలియర్స్ తరం అంతమైంది.. మెకల్లమ్ కాలం పోయింది.. బట్లర్ కెరీర్ ముగింపునకు వచ్చింది.. వార్నర్ రిటైరైపోతున్నాడు.. మన రోహిత్ శర్మ దూకుడు మరికొన్నాళ్లే.. టి20 విధ్వంసక బ్యాట్స్ మెన్ అయిన వీరంతా తప్పుకొంటే మున్ముందు ఆ ఫార్మాట్ బోరింగ్ గా మారదా? వీరి తర్వాత ఆ స్థాయిలో అలరించే ఆటగాళ్లెవరు? వచ్చారు.. ప్రతి తరంలోనూ టార్చ్ బేరర్ ఉన్నట్లే రాబోయే కాలానికి తామే మొనగాళ్లమని చాటుతున్నారు.

సింగిల్స్ చిరాకు.. తీస్తే ఆఖరి బంతికే

‘నాకు సింగిల్స్ తీయడం అంటే మహా చిరాకు.. తీస్తే గీస్తే అది ఓవర్ చివరి బంతికే’ ఇదీ ఆస్ట్రేలియా యువ సంచలనం జాక్ ఫ్రేజర్ మెక్ గర్క్ మాట. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతూ చెలరేగిపోతున్న ఈ ఆస్ట్రేలియా కుర్రాడి వయసు కేవలం 22. ఐదేళ్ల కిందట ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అక్కడ అదరగొట్టడంతో ఆస్ట్రేలియా టి20 బిగ్‌ బాష్‌ లో ఆడే చాన్స్ వచ్చింది. 2020 సీజన్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్ తరపున తొలిసారి బరిలో దిగాడు. నిరుడు ఆస్ట్రేలియా దేశీవాళీ వన్డే టోర్నీలో 29 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ఏడాది వెస్టిండీస్‌ తో వన్డే సిరీస్‌ లో ఆసీస్‌ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌-24 వేలంలో రూ.50 లక్షల కనీస ధరతో పేరు నమోదు చేసుకున్నాడు. గమనార్హం ఏమంటే.. ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనలేదు. ఇంగ్లండ్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో రూ.50 లక్షలకు ఢిల్లీ ‍క్యాపిటల్స్‌ తీసుకుంది. లక్నోతో మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. ఎదుర్కొన్న రెండో బంతినే అద్భుత సిక్స్‌గా మలిచాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌలర్లకు చుక్కలు చూపించాడు. చకచకా 55 పరుగులు చేశాడు. ఇక ముంబైతో మ్యాచ్ లో జేక్ ఫ్రేజర్ మరింత విధ్వంసమే చేశాడు.15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 27 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులు బాదాడు. 30 బంతుల్లో సెంచరీ కొట్టేసి రికార్డును అందుకుంటాడని భావిస్తుండగా ఔటై పోయాడు. కాగా, మంచి ఫీల్డర్ కూడా అయిన ఫ్రేజర్ ఇప్పుడు ఆస్ట్రేలియా టి20 ప్రపంచ కప్ నకు ఎంపికవడం ఖాయం. అదికూడా స్టీవ్ స్మిత్ స్థానానికి ఎసరు పెడుతూ..?

విధ్వంసానికి మారు పేరు విల్ జాక్స్

అఫ్ఘాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎనిమిదేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లోనూ తన నాలుగు ఓవర్ల కోటాలో 90 శాతం 30 పరుగుల లోపే ఇచ్చి ఉంటాడు. అలాంటి బౌలర్ ఒక బ్యాట్స్ మన్ చేతిలో ఊచకోతకు గురయ్యాడు. ఐదు బంతుల్లోనే 29 పరుగులు ఇచ్చుకున్నాడు. అతడే విల్ జాక్స్. ఈ సీజన్ లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎవరూ రాణించడం లేదు. బెంగళూరుకు ఆడుతున్న25 ఏళ్ల విల్ జాక్స్ మాత్రం ఆ లోటు ను పూడ్చాడు. మొన్న గుజరాత్ టైటాన్స్ పై తొలి 31 బంతుల్లో 50 పరుగులు చేసిన అతడు తర్వాత 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు జాక్స్. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ 13 బంతుల్లో 50 నుంచి 100 పరుగులకు చేరుకుని రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఆ రికార్డును జాక్స్ బ‌ద్ద‌లు కొట్టాడు. ఆదివారం సాయంత్రం 6:41 గంటలకు అర్ధ సెంచరీ పూర్తి చేసిన అతడు.. 6:47 కల్లా సెంచ‌రీకి చేరుకున్నాడు. అంటే 6 నిమిషాల్లో 50 నుంచి 100కు వచ్చాడు. బహుశా ఏ రేస్ బైక్ కూడా ఇంత వేగంగా స్పీడ్ గా అందుకోదేమో?

స్టన్నింగ్ స్టబ్స్

దక్షిణాఫ్రికాకు చెందిన ట్రిస్టన్ స్టబ్స్ కూడా మెరుపు వీరుడే. ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్న అతడు ఈ సీజన్ లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. రాజస్థాన్ పై 23 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. కోల్ కతాపై 32 బంతుల్లో 54, ముంబైపై 25 బంతుల్లోనే 71, 25 బంతుల్లోనే 48 పరుగులు బాదాడు. 23 ఏళ్ల స్టబ్స్ దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో సభ్యుడు కూడా.

కొసమెరుపు: విధ్వంసానికి మారుపేరుగా నిలుస్తున్న ఈ ముగ్గురూ విదేశీ ప్లేయర్లే. మరి ఇలాంటి వారిలో భారతీయ ఆటగాళ్లెవరూ లేరా? అంటే.. యశస్వి జైశ్వాల్, రిషభ్ పంత్ ఈ కోవకే చెందుతారు. ఇప్పటికైతే ఫ్రేజర్, జాక్స్ మాత్రం వీరికంటే దూకుడుగాళ్లు అని చెప్పాలి.

Tags:    

Similar News