భారత క్రికెట్ హెడ్ కోచ్ అతడే.. 42 ఏళ్లకే పెద్ద బాధ్యత.. చరిత్రలో చిన్న వయస్కుడు!
టీమిండియా మాజీ ఓపెనర్, ప్రపంచ కప్ ఫైనల్స్ వీరుడు గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా రావడం ఖాయమైంది.
బిషన్ సింగ్ బేదీ నుంచి కపిల్ దేవ్ వరకు.. చందూబోర్డె నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు ఎందరో దిగ్గజాలు భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ లుగా, కోచ్ లుగా పనిచేశారు. వీరిలో కొందరు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించకున్నా.. కోచింగ్ లో మాత్రం తమదైన ముద్ర వేశారు. జాన్ రైట్, కిర్ స్టెన్ వంటి విదేశీ కోచ్ లు భారత జట్టు భాగ్యరేఖను మార్చారు. గ్రెగ్ చాపెల్ వంటి వారు మొత్తం వ్యవస్థనే దెబ్బతీశారు. అయితే, వీరంతా రిటైరైన రెండు, మూడు దశాబ్దాల తర్వాత భారత కోచ్ లుగా వచ్చారు. కానీ.. ఓ క్రికెటర్ మాత్రం కేవలం 42 ఏళ్లకే ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన భారత క్రికెట్ జట్టు కోచ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.
కలిసి ఆడినవారికే కోచింగ్..
టీమిండియా మాజీ ఓపెనర్, ప్రపంచ కప్ ఫైనల్స్ వీరుడు గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా రావడం ఖాయమైంది. ఇప్పటికే అతడు ఇంటర్వ్యూలకు హాజరై తన ప్లాన్స్ ఏమిటో చెప్పాడు. అయితే, ఇది జరిగి 20 రోజులు అవుతున్నా బోర్డు నుంచి ప్రకటన మాత్రం రాలేదు. కానీ, గంభీరే భారత్ కోచ్ కాబోతున్నట్లు స్పష్టం చేసేలా ఓ ఘటన జరిగింది. గంభీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్. అంతకుముందు అతడు లక్నో సూపర్ జెయింట్స్ కు మెంటార్. ఈ ఏడాది కోల్ కతాకు తిరిగి రావడమే కాక టైటిల్ కొట్టేలా చేశాడు. అయితే టీమిండియాకు కోచ్ వస్తే కోల్ కతా మెంటార్ బాధ్యతల నుంచి తప్పుకోవాలి. గంభీర్ అదే పనిచేసినట్లున్నాడు. గత శుక్రవారం గంభీర్ కు ఈడెన్ గార్డెన్స్ లో ఫేర్ వెల్ నిర్వహించారు. అంటే అతడే భారత కాబోయే కోచ్ అని తేలిపోయింది.
కాగా, ఇటీవలి టి20 ప్రపంచ కప్ తో దిగ్గజ ఆటగాడు ద్రవిడ్ కోచింగ్ పిరియడ్ ముగిసింది. ఈ నెల 28 నుంచి భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్తుంది. ప్రస్తుతం జింబాబ్వేలో ఉన్న భారత జట్టుకు హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. శ్రీలంక టూర్ కు ముందు గంభీర్ ను కోచ్ గా ప్రకటించనున్నారు. దీంతో 42 ఏళ్ల అతి చిన్న వయసుకే భారత జట్టుకు హెడ్ కోచ్ అయిన ఘనతను అతడు అందుకోనున్నాడు. కాగా, 37 టి20లు, 147 వన్డేలు, 58 టెస్టుల్లో భారత జట్టుకు గంభీర్ ప్రాతినిధ్యం వహించాడు. 2013 తర్వాత వన్డేల్లో, 2012 అనంతరం టి20ల్లో, 2016 తర్వాత టెస్టు జట్టులో అతడికి చోటు దక్కలేదు. దీంతో 2018లో గంభీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ లో కోల్ కతా 2012, 2014 సీజన్లలో కెప్టెన్ గా విజయపథంలో నడిపించాడు.