గుజరాత్ వర్సెస్ పంజాబ్... మోడీ స్టేడియంలో లెక్కలు ఇవే!
పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై అద్భుతమైన విజయంతో సీజన్ ను ప్రారంభించినప్పటికీ... రెండు వరుస పరాజయాలతో కొనసాగుతోంది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా 17వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోతోంది. దీనికోసం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం సిద్ధమైంది. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్ లలోనూ రెండు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో గుజరాత్ ఉండగా... ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ఒక్కటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది పంజాబ్.
పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై అద్భుతమైన విజయంతో సీజన్ ను ప్రారంభించినప్పటికీ... రెండు వరుస పరాజయాలతో కొనసాగుతోంది. ఈ క్రమంలో తమ చివరి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్ పై 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అనుభవజ్ఞుడైన మోహిత్ శర్మ మూడు వికెట్లు తీయగలిగాడు. ఇక ఈ సీజన్ లో టైటాన్స్ తరఫున మూడు ఆటల్లో ఏ ఆటగాడు కూడా భారీ స్కోరు నమోదు చేయలేదు.
ఇక గుజరాత్ టీం లో ఇప్పటివరకూ కాస్త బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వారి వివరాలు పరిశీలించినట్లయితే... సాయి సుదర్శన్ 3 మ్యాచ్ లలో 127 పరుగులు చేయగా.. డేవిడ్ మిల్లర్ 3 మ్యాచ్ లలో 77, శుభ్ మన్ గిల్ 3 మ్యాచ్ లలో 75 పరుగులు చేశారు. ఇక బౌలర్ ల విషయాలనికొస్తే... మూడు మ్యాచ్ లలో మోహిత్ శర్మ 6 వికెట్లు పడగొట్టగా.. రషిద్ ఖాన్ 3 మ్యాచ్ లలో మూడు వికెట్లు దక్కించుకున్నాడు.
ఇక పంజాబ్ విషయనికొస్తే... ఇక్కడ కూడా మూడేసి మ్యాచ్ లు ఆడిన ఆ టీం టాప్ ప్లేయర్స్ లో శిఖర్ ధావన్ 137 పరుగులు చేయగా.. శాం కరన్ 86, లివింగ్ స్టన్ 83 పరుగులు చేశారు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే... రబాడా మూడు మ్యాచ్ లలోనూ 4 వికెట్లు, శాం కరన్ 4 వికెట్లు దక్కించుకున్నారు.
హెడ్-టు-హెడ్ రికార్డ్ లు:
గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటి వరకు మూడు ఐపీఎల్ మ్యాచ్ లలో తలపడ్డాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ జట్టు రెండు మ్యాచ్ లు గెలవగా.. పంజాబ్ జట్టు ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. ఇక ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ అత్యధిక స్కోరు 190 కాగా.. గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ అత్యధిక స్కోరు 189గా ఉంది.
పిచ్ రిపోర్ట్:
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయినప్పటికీ... విస్తృత బౌండరీలను క్లియర్ చేయడానికి బ్యాటర్లకు పిచ్ చాలా మద్దతునిస్తుంది. ఇదే సమయంలో... ఇక్కడి నల్లటి నేలతో ఉన్న పిచ్ లపై పేసర్ లు ప్రయోజనం పొందుతారని చెబుతుంటారు. ఇక ఈ మైదానంలో ఇప్పటివరకూ 29 మ్యాచ్ లు జరగగా.. అందులో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచిన మ్యాచ్ లు 14 కాగా.. రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టు 15 మ్యాచ్ లలో గెలిచింది.
ఇదే సమయంలో.. ఇక్కడ ఇప్పటివరకూ టాస్ గెలిచిన టీం లు 13 మ్యాచ్ లలో విజయం సాధించగా.. టాస్ ఓడిన టీం లు 16 సార్లు గెలిచాయి.
ఇక ఐపీఎల్ హిస్టరీలో ఈ స్టేడియంలో ముంబై ఇండియన్స్ పై 2023లో గుజరాత్ టైటాన్స్ చేసిన 233 పరుగులు అత్యధిక స్కోరు కాగా... సన్ రైజర్స్ హైదరాబాద్ పై 2014లో రాజస్థాన్ రాయల్స్ చేసిన 102 పరుగులు అత్యల్ప స్కోరుగా ఉంది. ఇదే క్రమంలో ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ 172 పరుగులుగా ఉంది.
ఇక ఇక్కడ గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ కు మంచి రికార్డ్ ఉంది. ఈ మైదానంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లలో టాప్ స్కోరర్ గా శుభ్ మన్ గిల్ ఉన్నాడు. 2023లో ముంబై ఇండియన్స్ పై గిల్ చేసిన 129 పరుగులు ఇక్కడ టాప్ స్కొర్ కాగా... అదే ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ పై 101 పరుగులు చేసిన టాప్ 3 రికార్డ్ కూడా గిల్ ఖాతాలోనే ఉంది!