ఐసీసీ చీఫ్ గా భారతీయుడు.. దుబాయ్ నుంచి కార్యాలయం భారత్ కు మార్పు?
భారత క్రికెట్ లో దిగ్గజాలుగా నిలిచిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, మేటి ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా ఇకపై టి20ల్లో కనిపించరు
భారత క్రికెట్ లో దిగ్గజాలుగా నిలిచిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, మేటి ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా ఇకపై టి20ల్లో కనిపించరు.. హెడ్ కోచ్ గా దిగ్గజ బ్యాట్స్ మన్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. హెడ్ కోచ్ గా మేటి ఓపెనర్ అయిన గౌతమ్ గంభీర్ త్వరలో కోచ్ గా బాధ్యతలు చేపట్టే చాన్సుంది. ఈ లెక్కన టీమ్ ఇండియా రూపు రేఖలు త్వరలో మారనున్నాయి. వచ్చే మూడేళ్లలో గంభీర్ కోచింగ్ సారథ్యంలో కొత్త తరం ఆటగాళ్లు జట్టులోకి రానున్నారు. ఇక మరో కీలక పరిణామం కూడా చోటుచేసుకోనుంది.
అప్పట్లో ఆ ఇద్దరు
1989లో మొదలైంది ఐసీసీ. తొలి అధ్యక్షుడిగా ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కొలిన్ కౌడ్రీ పనిచేశారు. నాలుగేళ్ల పాటు ఆయన పదవిలో ఉన్నారు. ఆ తర్వాత వెస్టిండీస్ కు చెందిన క్లైడ్ వాల్కట్ 2000 సంవత్సరం వరకు పనిచేశారు. 1997 నుంచి 2000 వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్ తదితర దేశాల వారు పీఠంపై కూర్చన్నాక.. తిరిగి 2010లో భారత్ కు ఐసీసీ చీఫ్ పదవి దక్కింది. దీనిని సీనియర్ రాజకీయవేత్త, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ చేపట్టారు. 2012 వరకు ఆయన బాధ్యతల్లో కొనసాగారు. ప్రస్తుతం న్యూజిలాండ్ కు చెందిన గ్రెగ్ బార్క్లే ఐసీసీ చైర్మన్ గా ఉన్నారు. వచ్చే నవంబరుతో ఈయన పదవీ కాలం పూర్తి కానుంది.
మనోడే ఈసారి..
భారత కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు, ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా.. తదుపరి ఐసీసీ అధ్యక్షుడు కావాలని యోచిస్తున్నారు. నవంబరులో జరిగే ఎన్నికల్లో ఆయన గనుక బరిలో దిగితే ఎదురులేకుండా గెలుస్తారని భావిస్తున్నారు. అంతేకాదు.. ఐసీసీ చైర్మన్ గా సమూల మార్పులు చేపట్టాలని జై షా భావిస్తున్నారట. జై షా ప్రస్తుత వయసు 37 మాత్రమే. ఒకవేళ ఆయన గనుక ఐసీసీ చీఫ్ అయితే ఆ పదవి చేపట్టిన అతి చిన్న వయసు వారు అవుతారు. 2009లోనే జై షా గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అయ్యారు. 2019 బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నారు. అసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా ఈయనే. కాగా, బార్క్‌లే ఐసీసీ చైర్మన్ అయినది జై షా మద్దతుతోనే. ఆయన మళ్లీ ఎన్నికయ్యే చాన్సుంది. కానీ.. జై షా ఆసక్తి చూపుతున్నారు. ఐసీసీ వార్షిక సమావేశం ఈ నెల 19 నుంచి 22 మధ్య కొలంబోలో జరగనుంది. చైర్మన్ ఎన్నికకు సంబంధించిన టైమ్ లైన్ ను అధికారికంగా రూపొందించాలని భావిస్తున్నారు.
జై షా ఐసీసీ చైర్మన్ అయితే సంస్థ ప్రధాన కార్యాలయాన్ని దుబాయ్ నుంచి ముంబైకి మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. కొలంబో సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశం లేదు. అమెరికా, వెస్టిండీస్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ నిర్వహణపై విమర్శలు వచ్చాయి. ఐసీసీలో కీలక మార్పులు తెచ్చేందుకు జై షా ఆసక్తి చూపుతున్నట్లు భావిస్తున్నారు.