కంగారూ గడ్డపై ఒకే ఒక్క భారతీయుడు.. కపిల్ దేవ్ తర్వాత ఇతడే

అందుకే భారత ఫాస్ట్ బౌలర్లు ఎవరూ కంగారూ గడ్డపై రాణించిన దాఖలాలు లేవు.. ఒక్క కపిల్ దేవ్ తప్ప.. అయితే, ఇప్పుడు మాత్రం ఆ రికార్డును బద్దలుకొట్టాడు ఓ మొనగాడు.

Update: 2024-12-18 09:30 GMT

పేస్ బౌన్స్ స్వింగ్ కలగలిసిన ఆస్ట్రేలియా పిచ్ లపై బౌలింగ్ అంటే మామూలు మాటలు కాదు.. ఎంత పదునుగా బంతులు వేసినా, చివరకు ఒక్క లూజ్ బాలు చాలు.. బ్యాట్స్ మెన్ చెలరేగిపోయేందుకు అవకాశం దక్కినట్లే. అందుకే భారత ఫాస్ట్ బౌలర్లు ఎవరూ కంగారూ గడ్డపై రాణించిన దాఖలాలు లేవు.. ఒక్క కపిల్ దేవ్ తప్ప.. అయితే, ఇప్పుడు మాత్రం ఆ రికార్డును బద్దలుకొట్టాడు ఓ మొనగాడు.

ఒకే ఒక్క‌డు..

వైవిధ్యమైన బౌలింగ్ శైలితో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఆస్ట్రేలియాలో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌ గా అతడు చరిత్రకెక్కాడు. బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరుగతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌ లో ల‌బుషేన్‌ ను ఔట్ చేశాడు. దీంతో కంగారూ నేలపై బుమ్రా తీసిన వికెట్ల సంఖ్య 52కి చేరింది. క‌పిల్ రికార్డు (51)ను అధిగమించాడు. అయితే, కపిల్ 11 టెస్టుల్లో 51 వికెట్లు తీయగా.. బుమ్రా 10 టెస్టుల్లోనే ఆ మార్క్ ను చేరాడు.

ఇక లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (49), తాజాగా రిటైర్మెంట్ ప్రకటించి అశ్విన్ (40), మాజీ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ (35).. బుమ్రా, కపిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

బుమ్రా.. నేను గూగుల్ చేశా..: పిచాయ్

బుమ్రా ఎంతటి వైవిధ్యమైన పేస్ బౌలరో అందరికీ తెలిసిందే. అయితే, అతడిలో కొంత బ్యాటింగ్ సామర్థ్యమూ ఉంది. ఇంగ్లండ్ లో గతంలో పర్యటించినప్పుడు బుమ్రా ఒకే ఓవర్ లో 35 ప‌రుగులు సాధించాడు. ఇది 2022లో జరిగింది. ఇది ప్ర‌పంచ రికార్డు కూడా. ఆస్ట్రేలియాతో తాజా మూడో టెస్టులో బుమ్రా టీమ్ ఇండియాకు ఫాలో ఆన్ తప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాలో రెండో ఇన్నింగ్స్ లో వికెట్లు పడిన విధానం చూస్తే.. బుమ్రా (38 బంతుల్లో 10 నాటౌట్) ఇన్నింగ్స్ కు ఉన్న విలువ తెలుస్తుంది. సహచర పేసర్ ఆకాశ్ దీప్ (27)తో కలిసి బుమ్రా భారత్ ను ఫాలో ఆన్ తప్పించాడు. అయితే ,ఈ ఇన్నింగ్స్ కు ముందు బుమ్రా ఆస్ట్రేలియా మీడియాతో మాట్లాడాడు. మూడో రోజు ఆట తర్వాత గ‌బ్బాలో బ్యాటింగ్ ప‌రిస్థితుల గురించి ప్రశ్న రాగా.. ‘‘మీరు నా బ్యాటింగ్ సామ‌ర్థ్యాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. టెస్టుల్లో ఒకే ఓవ‌ర్‌ లో అత్య‌ధిక ప‌రుగులు చేసింది ఎవ‌రో గూగుల్ చేయండి.’’ అని చెప్పాడు. అతడు ఫ‌న్నీగా చెప్పినా అది వైర‌ల్‌ అయింది. కొందరు బుమ్రా 35 పరుగులు సాధించిన ఓవర్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

అన్నిటికి మించిన హైలైట్ ఏమంటే.. క్రికెట్ అంటే ఎంతో ఇష్ట‌ప‌డే గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ తాజాగా బుమ్రా వ్యాఖ్యలపై స్పందించాడు. బుమ్రా బ్యాటింగ్ గురించి తాను గూగుల్ చేసిన‌ట్లు చెప్పారు. అంతేకాదు.. ఆసీస్ కెప్టెన్ క‌మిన్స్ వంటి పేసర్ బౌలింగ్‌ లో సిక్స్ కొట్టినవారికి బ్యాటింగ్ ఎలా చేయాలో చాలా బాగా తెలుసని కూడా వ్యాఖ్యానించారు. మూడో టెస్టులో భార‌త్‌ ను ఫాలోఆన్ గండం త‌ప్పించ‌న వైనాన్ని పేర్కొన్నారు.

గూగుల్ ఫిదా..

తన బ్యాటింగ్ రికార్డులు తెలుసుకోవాలంటే గూగుల్‌ చేయండి అంటూ బుమ్రా చేసిన వ్యాఖ్య‌లతో గూగుల్ కూడా ఫిదా అయినట్లుంది. గూగుల్ ఇండియా సైతం బుమ్రా వీడియోను పోస్ట్ చేస్తూ మేము.. జ‌స్సీ భాయ్‌ని మాత్ర‌మే న‌మ్ముతాం అని రాసుకొచ్చింది.

Tags:    

Similar News