అదిగదిగో ఒలింపిక్స్.. 8 మందితో పతకాలు తెచ్చే తెలుగోళ్లెవ్వరు..?
వన్డే, టి20 ప్రపంచ కప్ లు ముగిశాయి. ఫుట్ బాల్ ప్రపంచ కప్ కూడా ఏడాదిన్నర కిందట అయిపోయింది.
వన్డే, టి20 ప్రపంచ కప్ లు ముగిశాయి. ఫుట్ బాల్ ప్రపంచ కప్ కూడా ఏడాదిన్నర కిందట అయిపోయింది. కామన్వెల్త్, ఆసియా క్రీడలూ పూర్తయ్యాయి. వీటికంటే పెద్దదైన విశ్వ సంబరం ఒకటుంది.. అదే ఒలిపింక్స్. ఫ్యాషన్ రాజధాని పారిస్ ఈ నెల 26 నుంచి జరిగి ఒలిపింక్స్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. 111 మందితో కూడిన భారత ఆటగాళ్లలో 8 మంది తెలుగు వారు ఉన్నారు. వీరిలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. మరి వీరిలో పతకాలు తెచ్చేది ఎందరు?
సింధు నుంచి శ్రీజ వరకు..
పారిస్ ఒలింపిక్స్ బరిలో ఉన్న తెలుగు తేజాలు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), బొమ్మదేవర ధీరజ్ (ఆర్చరీ), జ్యోతి యర్రాజి, జ్యోతిక శ్రీ (అథ్లెటిక్స్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్), ఇషా సింగ్ (షూటింగ్). సింధు ఇప్పటికే 2016 రియో ఒలింపిక్స్ లో రజతం, 2020 (2021) టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచింది.
నిరుపేదరాలు జ్యోతి
భారత అథ్లెటిక్స్ లో ఎందరో పేద కుటుంబాల నుంచి వచ్చినవారు ఉన్నారు. ఇటీవల బాగా వినిపిస్తున్న పేరు జ్యోతి యర్రాజీ. ఏపీలోని విశాఖపట్నం ఈమె సొంత ఊరు. ఈ ఒలింపిక్స్ లో 100 మీటర్ల హర్డిల్స్ లో భారత ఆశాకిరణం జ్యోతి అంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు.. ఒలింపిక్స్ 100 మీ. హర్డిల్స్ లో పోటీపడుతున్న తొలి భారత అథ్లెట్ జ్యోతినే కావడం విశేషం. వరల్డ్ ర్యాంకింగ్ కోటా ద్వారా పారిస్ బెర్తు పొందిన జ్యోతికి ఇవే తొలి ఒలింపిక్స్. ఈమె తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ ఏజెన్సీలో గార్డు. తల్లి ఆసుపత్రి, ఇళ్లలో పనులు చేస్తుంటారు. 24 ఏళ్ల జ్యోతి 100మీ. హర్డిల్స్ లో జాతీయ రికార్డు (12.78 సెకన్లు) గ్రహీత. గత ఏడాది ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల్లో రజతం, ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్ లో కాంస్యం ఆమె ఖాతాలో ఉన్నాయి. మూడుసార్లు జాతీయ చాంపియన్ కూడా...
తణుకు క్రీడా తార
24 ఏళ్ల దండి జ్యోతిక శ్రీ.. ఏపీలోని తణుకు పట్టణానికి చెందిన అమ్మాయి. మహిళల 4x400మీ. రిలే జట్టులో సభ్యురాలు. తొలిసారి ఒలింపిక్స్ లో పాల్గొంటోంది. ఆమె తండ్రి శ్రీనివాసరావు గతంలో వెయిట్ లిఫ్టర్. ఇక జ్యోతిక వ్యక్తిగత విభాగంలో 400 మీటర్ల పరుగు.. మేజర్ టోర్నీల్లో దేశం తరఫున 4x400మీ. రిలే జట్టులో సభ్యురాలు. 400 మీ. పరుగులో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన రేసును 51.53 సెకన్లలో పూర్తి చేసింది. ఆమె రెండుసార్లు జాతీయ చాంపియన్. గత ఏడాది ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో కాంస్యం నెగ్గిన భారత మహిళల 400 మీ. రిలే జట్టులో జ్యోతికది ప్రధాన పాత్ర.
తెలంగాణ తాఖత్.. నిఖత్
తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ ప్రపంచ చాంపియన్ అనే సంగతి తెలిసిందే. 28 ఏళ్ల నిఖత్ రెండుసార్లు ఈ ఘనత అందుకున్నారు. మేరీ కోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు వరల్డ్ చాంపియన్ అయిన భారత బాక్సర్ నిఖత్ కావడం విశేషం. తండ్రి జమీల్ అహ్మద్ ప్రోత్సాహంతో రింగ్ లో అడుగుపెట్టిన నిఖత్ తొలి కామన్వెల్త్ క్రీడల్లోనే స్వర్ణం నెగ్గింది. 2022 బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం, 2023 ఆసియా క్రీడల్లో కాంస్యం కొల్లగొట్టింది. ఆసియా క్రీడల పతకంతోనే పారిస్ ఒలింపిక్స్ బెర్తు పొందింది. ఈమెకూ ఇవే తొలి ఒలింపిక్స్.
మహిళల 50 కేజీల విభాగంలో బరిలో దిగనుంది.
టేబుల్ టెన్నిస్ మెరిక శ్రీజ..
చురుకైన ఆట అయిన టేబుల్ టెన్నిస్ లో అంతే చురుకైన అమ్మాయి హైదరాబాద్ కు చెందిన ఆకుల శ్రీజ. భారత మహిళల అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ ప్లేయర్. రెండేళ్ల నుంచి నిలకడగా, అద్భుతంగా ఆడుతోంది. ప్రపంచ ర్యాంకింగ్స్ టాప్-25లో చోటు దక్కించుకున్నారు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో శరత్ కమల్ తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ లో స్వర్ణం సాధించింది శ్రీజ. ఒలింపిక్స్ లో భారత్ టీటీలో ఒక్క పతకాన్నీ నెగ్గలేదు. మరిప్పుడు ఆ లోటును 25 ఏళ్ల శ్రీజ తీరుస్తుందా? లేదా? అనేది చూడాలి.
ఇషా గురి కుదురుతుందా?
భారత్ లో ప్రస్తుతం షూటింగ్ సంచలనం 19 ఏళ్ల హైదరాబాదీ ఇషా సింగ్. గత ఏడాది ఆసియా క్రీడల్లో నాలుగు పతకాలు కొల్లగొట్టింది. 13 ఏళ్లకే జాతీయ సీనియర్ చాంపియన్. నేషనల్ చాంపియన్ షిప్ సీనియర్ కేటగిరీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ గోల్డ్ మెడల్ విన్నర్. సీనియర్ కేటగిరీ ప్రపంచ చాంపియన్ షిప్ లో రెండు స్వర్ణాలు గెలవడం ఇషా ప్రతిభకు నిదర్శనం. ఈమె తొలిసారి ఒలింపిక్స్ లో పాల్గొంటోంది.
పరిచయం అక్కర్లేని పీవీ సింధు
ఒలింపిక్ స్వర్ణం, ఆల్ ఇంగ్లండ్ సింగిల్స్ టైటిల్ మినహా బ్యాడ్మింటన్ లోని అన్ని ప్రముఖ ట్రోఫీలను గెలిచింది సింధు. 2016లో 21 ఏళ్ల వయస్సులోనే ఒలింపిక్ పతకం సాధించింది. బ్యాడ్మింటన్ లో ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్ సింధు. 2019లో ప్రపంచ చాంపియన్ షిప్, 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం కూడా నెగ్గింది. కామన్వెల్త్ స్వర్ణం పలు సూపర్ సిరీస్ టోర్నీల టైటిళ్లు సింధు ఖాతాలో ఉన్నాయి.
కొంతకాలంగా వెనుకబడినా.. పారిస్ ఒలింపిక్స్ కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది.
అమలాపురం సాయిరాజ్
ఏపీలోని అమలాపురంనకు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి. 23 ఏళ్ల సాయి.. చిరాగ్ శెట్టితో కలిసి బ్యాడ్మింటన్ డబుల్స్ లో భారత్ తరఫున చరిత్రాత్మక విజయాలు సాధించాడు. నిరుడు ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గాడు. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్యం అందుకున్నాడు. ఈ జోడీ బరిలోకి దిగిందంటే పతకం ఖాయం అనిపిస్తోంది. డబుల్స్ లో వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని అందుకున్న తొలి భారత జోడీ వీరే. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ టైటిళ్లను గెలిచి పారిస్ ఒలింపిక్స్ పై గురిపెట్టారు.
విజయవాడ ధీరజ్..
విజయవాడకు చెందిన 22 ఏళ్ల ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ తొలిసారి ఒలింపిక్స్ లో ఆడుతున్నాడు. 12 నెలల్లో 10 అంతర్జాతీయ పతకాలు సాధించాడితడు. చెరుకూరి వోల్గా అకాడమీలో శిక్షణ పొందిన తర్వాత, 2017లో ఏఎస్‌ఐలో చేరాడు ధీరజ్. 2023, 2024 వరల్డ్ కప్ టోర్నీల్లో కాంస్యాలు సాధించాడు. ఇప్పుడు భారత నంబర్ వన్ రికర్వ్ ఆర్చర్. మరి ఇదే ఫామ్ లో ఒలింపిక్ ఆర్చరీలో దేశానికి తొలి పతకం తెస్తాడేమో చూడాలి.