రెచ్చిపోయిన సన్‌ రైజర్స్‌... బెంగళూరుతో మ్యాచ్ లో రికార్డ్స్ ఇవే!

ఈ సందర్భంగా మైదానంలోకి దిగిన సన్ రైజర్స్ ఆటగాళ్ల బంతి పడటం ఆలస్యం.. బౌండరీ వైపు కెమెరాల చూపు అన్నట్లుగా చెలరేగిపోయారు.

Update: 2024-04-16 04:07 GMT

ఈ సీజన్ లో సన్ రైజర్స్ అన్ని విభాగాల్ల్లోనూ నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల ముంబై పై 277 పరుగులతో విధ్వంసం సృష్టించిన హైదరాబాద్ బ్యాటర్లు.. వారి రికార్డును వారే తిరగరాస్తూ 287 భారీస్కోరు సాధించారు. ఈ సందర్భంగా మైదానంలోకి దిగిన సన్ రైజర్స్ ఆటగాళ్ల బంతి పడటం ఆలస్యం.. బౌండరీ వైపు కెమెరాల చూపు అన్నట్లుగా చెలరేగిపోయారు.

అవును.. 2024 మార్చి 27న ముంబయి బౌలింగ్‌ ను ఊచకోత కోస్తూ ఏకంగా 277 పరుగులు చేసి ఐపీఎల్‌ అత్యధిక స్కోరు రికార్డును తిరగరాసిన హైదరాబాద్‌.. ఈసారి సరికొత్త రికార్డును నెలకొల్పింది. బెంగళూరు బౌలింగ్‌ ను ట్రావిస్‌ హెడ్‌ ఊచకోత కోస్తే.. మిగతా బ్యాటర్లూ ఎవరి ప్రతాపం వారు చూపించారు. అలాని బెంగళూరు బ్యాటర్లేమీ తక్కువ తినలేదు. వారి బాదుడు వారు బాదారు! అయినా విజయం సన్ రైజర్స్ ని వరించింది.

సోమవారం చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరబాద్. సన్ రైజర్స్ బ్యాటర్స్ లో ట్రావిస్‌ హెడ్‌ 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 102 పరుగులతో విధ్వంసక శతకం సాధిస్తే... క్లాసెన్‌ 31 బంతుల్లో 2 ఫోర్లు 7 సిక్సర్లతో 67 పరుగులు సాధించారు.

ఇదే సమయంలో... సమద్‌ 10 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సలతో 37, అభిషేక్‌ శర్మ 22 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్ లతో 34, మార్క్రమ్‌ 17 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్ లతో 32 కూడా రెచ్చిపోయారు. బంతి పడటం ఆలస్యం బౌండరీకి తరలించాలని ఫిక్సయినట్లుగా వీర బాదుడు బాదారు. ఇలా సన్ రైజర్స్ బ్యాటర్ల సిక్స్ ల వర్షంతో చినస్వామి స్టేడియం తడిసి ముద్దయ్యింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా దూకుడుగా ఆడింది. ఇందులో భాగంగా... 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. ఈ క్రమంలో... కెప్టెన్ డూప్లెసిస్ 28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 62 పరుగులు, విరాట్ కొహ్లీ 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ లతో 42 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా మిడిల్ ఆర్డర్ అది కాపాడటంలో విఫలమయ్యారు.

అయితే.. ఫినిషర్ గా పేరున్న దినేశ్‌ కార్తీక్‌ 35 బంతుల్లో 5 ఫోర్లు 7 సిక్స్ ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఫలితంగా... ఈ సంచలన ఇన్నింగ్స్‌ తో ఆర్సీబీకి గౌరవప్రదమైన ఓటమిని మిగిల్చాడు. ఒకానొక సమయంలో జట్టును గట్టెక్కించి సరికొత్త రికార్డ్ సృష్టిస్తాడని అనిపించినా... సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కమిన్స్‌ (3/43), మార్కండే (2/46) ఆ జట్టును దెబ్బ తీశారు.

రికార్డులే రికార్డులు!:

ఐపీఎల్‌ లో ఓ ఇన్నింగ్స్‌ లో అత్యధిక సిక్సర్ల రికార్డులో ఆర్సీబీ (21)ని తాజాగా సన్‌ రైజర్స్‌ 22) దాటేసింది.

ఐపీఎల్‌ లో సన్‌ రైజర్స్‌ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ 39 బంతుల్లో సాధించాడు హెడ్. ఐపీఎల్‌ లో ఇది నాలుగో వేగవంతమైన సెంచరీ.

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ సాధించిన 287 పరుగులు.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరుగా నిలిచింది.

Tags:    

Similar News