ఆశ్చర్యం.. 42 ఏళ్ల వయసులో ఐపీఎల్ వేలంలోకి ఇంగ్లిష్ క్రికెటర్
ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి కూడా ఈ లీగ్ లో ఆడనే లేదు.
స్వదేశంలో పొట్టి ఫార్మాట్ ప్రారంభమైనప్పుడు యువకుడిగా ఉన్న అతడు.. అసలు ఆ ఫార్మాట్ లో రెగ్యులర్ ప్లేయర్ కానే కాదు.. పదేళ్ల కిందట అతడు చివరి టి20 ఆడాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి కూడా ఈ లీగ్ లో ఆడనే లేదు. కానీ, 22 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ తర్వాత.. 700 పైగా వికెట్లు తీశాక.. రిటైర్మెంట్ కూడా ప్రకటించాక.. 42 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడతానంటూ వస్తున్నాడు. అత్యంత పోటీ ఉండే.. 20 ఏళ్ల వయసు కుర్రాళ్లకే అవకాశాలు దక్కని లీగ్ లో.. అత్యంత సీనియర్ క్రికెటర్ ఆడబోతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
కెప్టెన్ ఆడనంటున్నాడు..
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మంచి పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ లో మరికొన్ని జట్లకూ ఆడాడు. అయితే, వచ్చే సీజన్ కు మాత్రం స్టోక్స్ కు అందుబాటులో ఉండడం లేదు. ఈ నెల 24, 25 తేదీల్లో రియాద్ లో నిర్వహించే మెగా వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే అతడు పేరు నమోదు చేసుకోలేదు. కానీ, ఇంగ్లండ్ కే చెందిన దిగ్గజ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మాత్రం తాను ఐపీఎల్ ఆడతానంటున్నాడు. అండర్సన్ 2008 నుంచి భారత లీగ్ లో పాల్గొనకపోవడం గమనార్హం. ఇప్పుడు కాకపోయిన 2015 వరకైనా అతడు టి20లకు తగ్గ బౌలర్ గానే ఉన్నాడు. కానీ, ఏనాడూ ఐపీఎల్ వైపు చూడలేదు. దేశం తరఫున ఆడేందుకే ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ ఏడాది టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్త లీగ్ లు దేంట్లోనూ పాల్గొనని అండర్సన్.. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం కనీస ధర రూ.1.25 కోట్లకు తన పేరును నమోదు చేసుకున్నాడు. అండర్సన్ చివరగా 2009లో అంతర్జాతీయ, 2014లో దేశీయ టి20 ఆడడం గమనార్హం. అలాంటివాడు ఇప్పుడు వేలానికి రిజస్టర్ చేసుకోవడంపై అందరూ చర్చించుకుంటున్నారు. అండర్సన్ ను తీసుకొనేందుకు ఎవరూ ముందుకురారని అన్ సోల్డ్ గా మిగులుతాడని భావిస్తున్నారు.
42 ఏళ్ల వయసులో అరంగేట్రం?
అండర్సన్ వేలంలో కనీస ధరకు దక్కించుకుని ఏ జట్టయినా ఆడిస్తే అది విశేషమే. లీగ్ లో ఆడిన మాజీ ఆటగాళ్లు రిటైరయ్యి ఆయా ఫ్రాంచైజీలకు మెంటార్లుగా వ్యవహరిస్తున్న వయసులో అండర్సన్ అరంగేట్రం చేసినట్లు అవుతుంది.