కనిపించని కపిల్ - ధోని... మహ్మద్ సిరాజ్ కన్నీళ్లు!
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసింది. వరుసగా 10 మ్యాచ్ లు గెలిచిన టీం ఇండియా ఫైనల్ లో ఆసిస్ చేతిలో ఓడిపోయింది. కోట్లాది కళ్లు కన్నీళ్లతో నిండిపోయాయి.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసింది. వరుసగా 10 మ్యాచ్ లు గెలిచిన టీం ఇండియా ఫైనల్ లో ఆసిస్ చేతిలో ఓడిపోయింది. కోట్లాది కళ్లు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆ సంగతి అలా ఉంటే... ఈ ఫైనల్ మ్యాచ్ లో భారతదేశంలో క్రికెట్ కు ఈస్థాయి క్రేజ్ రావడానికి బలమైన పునాది వేసిన వ్యక్తి, అసలు ప్రపంచ కప్ గురించి పెద్దగా అవగాహన లేనిరోజుల్లోనే భారత్ కు ప్రపంచ కప్ అందించిన వ్యక్తి. ఆయనకు ఘోర అవమానం జరిగింది!
అవును... భారత క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ అనే వ్యక్తి ఓ మహోన్నత శిఖరం. 1983 ముందు వరకు అత్యంత సాధారణమైన క్రికెట్ టీం గా ఉన్న భారత్ ను ప్రపంచకప్ విజేతగా నిలిపిన యోధుడు కపిల్ దేవ్! తన ప్రతిభతో భారత్ కు ప్రపంచ క్రికెట్ పటంలో సమున్నత స్థానం కల్పించిన సిసలైన నాయకుడు. ఆల్ రౌండర్ అనే పదానికి అప్పట్లోనే అసలైన అర్ధం చెప్పిన ధీరుడు. అలాంటి దిగ్గజ క్రికెటర్ కు వరల్డ్ కప్ ఫైనల్ చూసేందుకు ఆహ్వానం లభించలేదు.
ఈ విషయాన్ని కపిల్ దేవ్ స్వయంగా వెల్లడించారు. వరల్డ్ కప్ ఫైనల్ కోసం తనను ఎవరూ పిలవలేదని.. అందుకే వెళ్లలేదని కపిల్ దేవ్ తెలిపాడు. తనతో పాటు 1983 వరల్డ్ కప్ గెలిచిన టీం మొత్తం ఫైనల్ మ్యాచ్ చూడాలని కోరుకున్నానని.. అయితే ఆహ్వానం అందలేదని అన్నారు. ఇప్పుడు ఈ విషయం అతిపెద్ద చర్చనీయాంశం అయ్యింది. దీనివెనుకున్న అదృశ్య శక్తులు ఏవి అనే ప్రశ్న ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తుంది.
“వరల్డ్ కప్ అనేది అతి పెద్ద ఈవెంట్. ఈ ప్రపంచకప్ నిర్వహణ బాధ్యతలతో బిజీగా ఉండి నన్ను పిలవడం మర్చిపోయినట్లున్నారు” అని కపిల్ దేవ్ అన్నారు. అయితే ఎక్కడా ఆయన బీసీసీఐ పేరును మాత్రం ప్రస్తావించలేదు. అయితే పరోక్షంగా బీసీసీఐపై కపిల్ దేవ్ వ్యాఖ్యలు చేశారనేది సుస్పష్టం అవుతుందనే కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు బీసీసీఐ ని ఒక ఆటాడుకుంటున్నారు.
మరోపక్క కారణం ఏదైనా మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ ప్రపంచ కప్ ఫైనల్ ఈవెంట్ లో కనిపించలేదు. దీంతో... ఈ విషయం కూడా ప్రముఖంగా చర్చనీయాంశం అవుతుంది. ఆయా దేశాలకు ప్రపంచకప్ లు అందించిన కెప్టెన్లు గుర్తున్నప్పుడు... కపిల్ ని మరిచిపోవడం క్షమించరాని నేరమే అనేది ప్రముఖంగా వినిపిస్తున్న మాట.
దీంతో ఇది పూర్తిగా ముంబై డామినేషన్ నడిచింది అనే మరో విమర్శ కూడా తెరపైకి వచ్చింది. ప్రధానంగా సచిన్ టెండూల్కర్ ఆధిపత్యంతో పాటు... రవిశాస్త్రి, మంజ్రేకర్, సునీల్ గవాస్కర్ వంటి ముంబైకి చెందిన కీలక మాజీ క్రికెట్ వ్యక్తులను ప్రామాణిక వ్యాఖ్యాతలుగా నింపడం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
ఇదె సమయంలో... చండీగఢ్ కు చెందిన కపిల్ దేవ్, జార్ఖండ్ కు చెందిన ధోనీ ముంబైకి చెందినవారు కానందున వారి విజయాలను పట్టించుకోకపోవడానికి మరో కారణం అనే కామెంట్లూ వినిపిస్తుండటం గమనార్హం. ఏది ఏమైనా... దేశ ఈవెంట్ ను పార్టీ ఈవెంట్ గానో, వ్యక్తిగత ఈవెంట్ గానో, కుటుంబ ఈ వెంట్ గానో జరిపాలనుకునే ఆలోచనలు నిర్వాహకులకు ఉంటే... ప్రకృతి హర్షించదని మరికొంతమంది చెబుతుండటం కొసమెరుపు!
మహ్మద్ సిరాజ్ కన్నీళ్లు:
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ 2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్ పై ఘన విజయం సాధించిచిన అనంతరం.. టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కన్నీళ్లతో సిరాజ్ భావోద్వేగ చిత్రం విస్తృతంగా ప్రసారం చేయబడింది. దీంతో ఇది ఆటగాళ్ల లోతైన అభిరుచి, నిబద్ధతను ప్రతిబింబిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!