అమ్మో కివీసా.. అయితే సెమీస్ సవాలే?
ఐసీసీ టోర్నీల్లో అత్యంత నిలకడ.. అందులోనూ భారత్ వంటి జట్టు ఎదురైతే మరింత పట్టుదల.. ఈ రికార్డును బట్టే ఆ జట్టేదే తేలిగ్గా చెప్పేయొచ్చు.
వరుసగా ఐదోసారి సెమీఫైనల్స్ కు.. మొత్తం 13 ప్రపంచ కప్ లలో 8 సార్లు సెమీఫైనల్స్ కు.. గత రెండు ప్రపంచ కప్ లలోనూ రన్నరప్.. ఇదీ ఆ జట్టు రికార్డు. ద్వైపాక్షిక సిరీస్ లలో ఎలా ఆడినా..
ఐసీసీ టోర్నీల్లో అత్యంత నిలకడ.. అందులోనూ భారత్ వంటి జట్టు ఎదురైతే మరింత పట్టుదల.. ఈ రికార్డును బట్టే ఆ జట్టేదే తేలిగ్గా చెప్పేయొచ్చు. ఇక టీమిండియాను ఇప్పటికే పలుసార్లు ఆ జట్టు నాకౌట్ చేసింది. ఇక కప్ మనదే అనుకుంటున్న దశలో దెబ్బకొట్టింది. అలాంటి జట్టుతో ప్రపంచ కప్ లో టీమిండియా మరోసారి సెమీఫైనల్ ఆడబోతోంది.
నాటి సెమీఫైనల్ గుర్తుందిగా?
ఇంగ్లండ్ లో జరిగిన 2019 ప్రపంచ కప్ లో టీమిండియా లీగ్ దశను అద్భుతంగా ముగించింది. ఇంగ్లండ్ మినహా అన్ని జట్లపైనా గెలిచింది. సెమీఫైనల్స్ లో మాత్రం దెబ్బపడింది. ఫైనల్ కు చేరడం ఖాయం అనుకున్న సమయంలో మన జట్టును న్యూజిలాండ్ ఓడించింది. వాస్తవానికి అప్పటికి భారత జట్టు ఉన్న ఫామ్ ప్రకారం.. న్యూజిలాండ్ ను తేలిగ్గా ఓడించాలి. మ్యాచ్ అలానే మొదలైంది కూడా. వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్ మరుసటి రోజు కొనసాగింది. తొలుత న్యూజిలాండ్ 239 పరుగుల మోస్తరు స్కోరు మాత్రమే చేయగలిగింది. అయితే, టీమిండియా టాపార్డర్ లోని రోహిత్, రాహుల్, కోహ్లి లను ఒక్క పరుగుకే ఔట్ చేసి ముందే దెబ్బకొట్టింది. జడేజా (77), ధోనీ (50) పోరాడినా.. 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఓటమి కంటే.. గెలుపు ముంగిట ధోనీ రనౌట్ అయిన విధానం అభిమానులను చాలాకాలం కలచివేసింది.
గతంలోనూ ఇంతే..
న్యూజిలాండ్.. గతంలోనూ పలుసార్లు టీమిండియాను దెబ్బకొట్దింది. 2000 చాంపియన్స్ ట్రోఫీలోనూ ఇంతే. నాడు మొదట బ్యాటింగ్ కు దిగి 264 పరుగులు చేసిన సౌరభ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టు.. 132 పరుగులకే కివీస్ ఐదు వికెట్లను పడగొట్టింది. కానీ, ఆల్ రౌండర్లు కెయిర్స్న్, హారిస్ ఆ జట్టును గెలిపించారు. అంతెందుకు.. న్యూజిలాండ్ టెస్టు ఫార్మాట్ లోనూ భారత జట్టుకు పలుసార్లు షాకిచ్చింది. 2020 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో 8 వికెట్లతో ఓడించింది.
ప్రమాదకర ప్రత్యర్థి
న్యూజిలాండ్ ఎప్పుడూ గట్టి జట్టే. ఆల్ రౌండ్ ప్రదర్శన దాని బలం. చురుకైన ఫీల్డింగ్ తో ఫలితాలను తారుమారు చేయగలదు. 2019 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో ధోనీ వంటి అద్భుత రన్నర్ ను మార్టిన్ గప్టిల్ అద్భుతమైన డైరెక్ట్ హిట్ తో రనౌట్ చేసిన సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కాగా, ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ ప్రమాదకర ప్రత్యర్థి. ముఖ్యంగా భారత్ విషయంలో. అందుకే.. ఆ జట్టుతో నాకౌట్ మ్యాచ్ అంటే అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
కివీస్ కు ఈసారి పెద్ద బలం భారత సంతతి రచిన్ రవీంద్ర. కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయంతో ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో వచ్చిన అతడు మూడు సెంచరీలు సహా 500 పైగా పరుగులు చేశాడు. మరోవైపు కివీస్ కు ఇప్పుడు విలియమ్సన్ కూడా అందుబాటులోకి వచ్చాడు. కాన్వే రూపంలో అత్యుత్తమ ఓపెనర్ ఉన్నాడు. కాబట్టి, టీమిండియా బహుపరాక్.
కొసమెరుపు: టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. నాలుగో స్థానంలో పాకిస్థాన్ గనుక వచ్చి ఉంటే.. ఇరు జట్ల మధ్య మ్యాచ్ కోల్ కతాకు మార్చాల్సి ఉండేది. ఆ అవసరం లేకుండానే ముంబైలో తొలి సెమీఫైనల్ జరగనుంది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ తో పోలిస్తే ముంబై వాంఖడే చిన్న మైదానం. కెప్టెన్ రోహిత్ శర్మ సొంత మైదానం. సూర్యకుమార్ యాదవ్ కూ సొంతగడ్డ. పేసర్ బుమ్రాకు ఈ పిచ్ కొట్టినపిండి. మరి వీరంతా చెలరేగి టీమిండియాను ఫైనల్ చేరుస్తారా? లేదా?