ఒక ఆటగాడి కోసం రూ.2719 కోట్లు... నాట్ ఇంట్రస్టెడ్!
ప్రస్తుతం ప్రపంచ ఫుట్ బాల్ లో అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాడు
ప్రస్తుతం ప్రపంచ ఫుట్ బాల్ లో అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాడు ఎవరంటే.. ఠక్కున వినిపించే పేరు కిలియన్ ఎంబాపె. ఈ ఏడాది జూన్ లో జరిగిన పారిస్ సెయింట్ జర్మన్ జట్టు స్ట్రైకర్ కిలియన్ ఎంబాపె రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి "ఫ్రెంచ్ గోల్డెన్ బూట్" దక్కించుకున్నాడు. ఇలాంటి ఆటగాడికి రికార్డ్ స్థాయి ధర పలికింది.
అవును... ప్రస్తుతం ప్రపంచ ఫుట్ బాల్ లో అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాడిగా పేరున్న కిలియన్ ఎంబాపె... నిరుడు ప్రపంచకప్ లో జట్టును గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. ఆ టోర్నీలో అత్యధికంగా ఎనిమిది గోల్స్ సాధించాడు. ఇదే సమయంలో క్లబ్ ఫుట్ బాల్ లోనూ పారిస్ సెయింట్ జర్మైన్ (పీ.ఎస్.జీ) జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు.
ఈ సమయంలో ఇతడి కోసం చాలా ప్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇతడి కోసం ఎంతైనా డబ్బులు రికార్డ్ స్థాయిలో వెచ్చించడానికి ఎదురుచూస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో 2024లో పీ.ఎస్.జీ.తో ఎంబాపె ఒప్పందం పూర్తవుతుందనే విషయం మరోసారి వార్తల్లోకి వచ్చింది. దీంతో ఆ క్లబ్ ను వదలాలని అతడు చూస్తున్నాడని తెలుస్తుంది.
అయితే పారిస్ సెయింట్ జర్మైన్ (పీ.ఎస్.జీ) మాత్రం అతని ఒప్పందాన్ని పొడిగించాలని.. లేదా, ఖాళీగా వదిలేయడం కంటే ఈ లోపే అత్యధిక ధరకు వేరే క్లబ్ కు అమ్మేయాలని చూస్తోందని సమాచారం. ఇందులో భాగంగా... సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్ క్లబ్ అతడి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుందని తెల్సింది. ఈ ఆటగాడిని దక్కించుకునే విషయంలో ఆ క్లబ్ తగ్గేదేలే అన్నట్లుగా నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... అతని కోసం ఏకంగా ప్రపంచ రికార్డు మొత్తం దాదాపు 259 మిలియన్ల పౌండ్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.2719 కోట్లు) చెల్లించేందుకు సిద్ధమైంది. దీంతో ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్న పారిస్ సెయింట్ జర్మైన్... ఎంబాపెతో మాట్లాడేందుకు ఆ సౌదీ అరేబియా క్లబ్ కు అనుమతినిచ్చింది.
అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఇంతపెద్ద మొత్తంలో చెల్లించేందుకు ఆ క్లబ్ సిద్ధంగా ఉన్నప్పటికీ... ఆ సౌదీ లీగ్ లో ఆడేందుకు ఎంబాపె ఆసక్తితో లేడని తెలిసింది. ఇదే సమయంలో వచ్చే ఏడాది అతను రియల్ మాడ్రిడ్ తరపున ఆడేందుకు ఇప్పటికే లోలోపల ఒప్పందం కుదుర్చుకున్నాడని సమాచారం.