బూమ్ బూమ్ స్కై... ఉత్కంఠపోరులో ముంబై గెలుపు!
ఈ గ్యాప్ లో ఎన్నో ట్విస్టులు, మరెన్నో జలక్కులు. మరి ఈ మ్యాచ్ ఆధ్యాంతం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం
ఒక్క మ్యాచ్ ఎన్నో రకాల మలుపులు.. చివరికి ముంబైకి దక్కిన ఫలితం. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా... పంజాబ్ - ముంబై మధ్య జరిగిన మ్యాచ్ సెకంద్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవ్వగానే వార్ వన్ సైడ్ అనిపించినా.. మధ్యలో పంజాబ్ వైపు మొగ్గినట్లు కనిపించినా.. అనూహ్యంగా విజయం ముంబై ఖాతాలో పడింది. ఈ గ్యాప్ లో ఎన్నో ట్విస్టులు, మరెన్నో జలక్కులు. మరి ఈ మ్యాచ్ ఆధ్యాంతం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం...!
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు.. ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ ఇన్నింగ్స్ హైలైట్ అని చెప్పాలి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి.. ఇషాన్ కిషన్ (8) వికెట్ ను త్వరగానే కోల్పోయింది. ఆ తర్వాత సూర్య – రోహిత్ లు దూకుడుగా ఆడారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి ముంబై స్కోరు ఒక వికెట్ నష్టానికి 54 పరుగులకు చేరుకుంది.
ఆ తర్వాత రోహిత్ దూకుడు కాస్త తగ్గినా.. సూర్య దూకుడు కొనసాగించడంతో ముంబై 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఆ తర్వాత రోహిత్ వికెట్ ను కోల్పోయింది. ఆ దశలో చెలరేగి ఆడిన తిలక్ ఇన్నింగ్స్ కు మళ్లీ ఊపు తెచ్చాడు. ఈ క్రమంలో ఆఖరి ఆరు ఓవర్లలో ముంబై 77 పరుగులు రాబట్టుకుంది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది.
ముంబై బ్యాటర్స్ లో సూర్యకుమార్ (78: 53 బంతుల్లో 7×4, 3×6), రోహిత్ శర్మ (36: 25 బంతుల్లో 2×4, 3×6), తిలక్ వర్మ (34 నాటౌట్: 18 బంతుల్లో 2×4, 2×6), టిమ్ డేవిడ్ (14: 7 బంతుల్లో 2×4, 1×6) రాణించారు.
అనంతరం బ్యాటింగ్ దిగిన పంజాబ్ ను ముంబై సీమర్లు నడ్డి విరిచారు! అవును... 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ బుమ్రా, కొయెట్జీ పేస్ కు హడలెత్తి 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో కొయెట్జీ.. ప్రభ్ సిమ్రన్ ను ఔట్ చేస్తే.. బుమ్రా రెండో ఓవర్లో రొసో (1), సామ్ కరన్ (6)ను పెవిలియన్ కు పంపాడు. కొయెట్జీ నెక్స్ట్ ఓవర్లో లివింగ్ స్టన్ ను వెనక్కి పంపి పంజాబ్ ను చావు దెబ్బతీశాడు.
ఇదే క్రమంలో ఏడో ఓవర్లో హర్ ప్రీత్ ఔటవ్వడంతో 5 వికెట్ల నష్టానికి 49 పరుగులతో పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో శశాంక్, అశుతోష్ విధ్వంసక బ్యాటింగ్ తో ఒక్కసారిగా ఆటను రసవత్తంగా మార్చారు. ఏడో వికెట్ కు 34 పరుగులు జోడించాక శశాంక్ ఔటైనా.. హర్ ప్రీత్ బ్రార్ (21) సహాయంతో అశుతోష్ విధ్వంసాన్ని కొనసాగించడంతో ముంబైకి కంగారు తప్పలేదు. దీంతో 16 ఓవర్లలో పంజాబ్ స్కోరు 7 వికెట్లకు 165.
ఈ సమయంలో ఆఖరి నాలుగు ఓవర్ల లో కేవలం 28 పరుగులు చేయాల్సిన స్థితిలో పంజాబ్ హాట్ ఫేవరెట్ గా నిలిచింది. అక్కడే మలుపు స్టార్ట్ అయ్యింది. బుమ్రాను బ్యాటర్లు జాగ్రత్తగా ఆడడంతో 17వ ఓవర్లో మూడు పరుగులే వచ్చాయి. ఆ తర్వాత కొయెట్జీ వేసిన ఓవర్ తొలి బంతికే అశుతోష్ ఔట్ కావడంతో ముంబై మళ్లీ పోటీలోకి వచ్చింది. ఫలితంగా ఛేదనలో పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది.
పంజాబ్ బ్యాటర్స్ లో అశుతోష్ శర్మ (61: 28 బంతుల్లో 2×4, 7×6) అద్భుత పోరాటపటిమను ప్రదర్శించాడు. శశాంక్ (41: 25 బంతుల్లో 2×4, 3×6) రాణించాడు. ఇక ముంబై బౌలర్లలో బుమ్రా (3/21), కొయెట్జీ (3/32) లు కలిసి పంజాబ్ ను భారీ దెబ్బతీశారు.