ప్రేమ నగరి పారిస్ లో మను బాకర్-నీరజ్ చోప్రా మధ్య సమ్ థింగ్ నథింగ్

పారిస్ లో వరుసగా రెండో పతకం తెచ్చిన నీరజ్, ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలతో మను మెరిశారు.

Update: 2024-08-13 09:29 GMT

ఒకరు రజత పతకంతో పరువు నిలిపారు.. మరొకరు రెండు పతకాలతో రికార్డు నెలకొల్పారు.. వీరే లేకుంటే పారిస్ ఒలింపిక్స్ లో మనకు మరీ మూడు పతకాలు మాత్రమే వచ్చేవి. దీన్నిబట్టే ఆ ఇద్దరు అథ్లెట్ల గొప్పదనాన్ని తెలుసుకోవచ్చు. వారే షూటర్ మను బాకర్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. అసలు ఆశలు లేని షూటింగ్ లో రెండు కాంస్యాలు తీసుకొచ్చి మను బాకర్ ఈ ఒలింపిక్స్ లో నయా స్టార్ గా నిలిచింది. స్వర్ణం తెస్తాడనుకున్న నీరజ్.. త్రుటిలో అవకాశం కోల్పోయాడు. కానీ, తన ప్రత్యేకత నిలుపుకొన్నాడు. పాకిస్థాన్ త్రోయర్ నదీమ్ జీవిత కాలంలో ఒక్కసారే విసరగలిగే త్రోతో స్వర్ణం ఎగరేసుకుపోయాడు. ఇక ఒలింపిక్స్ ముగిశాక వీరిద్దరే స్టార్ లుగా మిగిలారు. అయితే, అనూహ్యంగా ఇద్దరూ ముచ్చటించుకుంటున్న సందర్భంలో వీడియోలకు చిక్కి చర్చనీయాంశమయ్యారు.

అతడికి రెండు.. ఆమెకు రెండు..

పారిస్ లో వరుసగా రెండో పతకం తెచ్చిన నీరజ్, ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలతో మను మెరిశారు. ఈ ఇద్దరూ సోమవారం ఒలింపిక్స్‌ ముగిశాక సన్నిహితంగా మెలగడం మీడియాకు పెద్ద పాయింట్ అయింది. అందులోనూ సిగ్గుపడుతూ సంభాషించుకోవడం మరింత మసాలా పాయింట్ గా మారింది. ఈ తర్వాత నీరజ్ తో మను బాకర్ తల్లి కూడా మాట్లాడడం.. నీరజ్ నుంచి ఒట్టు తీసుకున్నట్లు కనిపించడంతో సోషల్ మీడియాలో ఎవరికి వారు తమకు తోచినది చెప్పుకొన్నారు. నీరజ్-మను ప్రేమలో ఉన్నారని.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారంటూ ఊహాగానాలు వచ్చాయి. కొందరైతే.. తన కూతురును పెళ్లి చేసుకోవాలంటూ నీరజ్ ను మను తల్లి అడిగినట్లుగా అభివర్ణించారు. అసలు ఏం జరిగింది? అన్నది తెలియకున్నా.. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు చెప్పుకొన్నారు.

పతక వీరులకు ఇదేనా గౌరవం?

పారిస్ ఒలింపిక్స్ కు 117 మందితో వెళ్లిన భారత్ కు దక్కింది 6 పతకాలే. అంటే పదిశాతం మంది కూడా పతకాలు తేలేకపోయారు. ఇక వచ్చిన ఆరింటిలోనూ మూడు నీరజ్, మనులవే. ఏకైక రజతం నీరజ్ దే. అలాంటి క్రీడాకారులు కేవలం స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటే దానికి విపరీతార్థాలు తీయడం ఎంతవరకు సమంజసం? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరు మేటి ఆటగాళ్ల మధ్యన ఆరోగ్యకర సంభాషణ ఉండదా? అని ప్రశ్నిస్తున్నారు. సంచలనం కోసం ఏదేదో ఊహించుకుంటారా? అంటూ తప్పుబడుతున్నారు. ఏదేమైనా ప్రపంచ వేదికపై భారత్ పరువు నిలిపిన క్రీడాకారులను ఈ విధంగా చర్చనీయం చేయడం సరికాదనే భావన వ్యక్తమవుతోంది.

ఇద్దరిదీ హరియాణనే..

మను, నీరజ్ ఇద్దరిదీ హరియాణనే. గొప్ప అథ్లెట్లయిన వీరిద్దరి భవిష్యత్ గురించి ఎవరేం ఊహించుకున్నా.. వచ్చే ఒలింపిక్స్ వరకు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. మనుకు మరీ 22 ఏళ్లు కూడా లేవు. కనీసం రెండు ఒలింపిక్స్ లో పాల్గొనే వయసుంది. నీరజ్ కూడా 30 లోపే. ఇక ఊహాగానాలపై మను తండ్రి రామ్ కిషన్ స్పందించారు. తన కూతురు ఇంకా చిన్నపిల్లే అని.. పెళ్లి వయసు రాలేదని చెప్పుకొచ్చారు. నీరజ్ ను తన భార్య ఓ బిడ్డలా భావిస్తోందన్నారు. ఇక నీరజ్ సమీవ బంధువు ఒకరు కూడా ఈ ఊహాగానాలపై నోరు విప్పారు. అతడు పతకం తెచ్చినప్పుడు దేశానికి తెలిసింది.. పెళ్లి విషయం కూడా అంతే అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News