సన్‌ రైజర్స్ హైదరాబాద్ కి కొత్త కోచ్... లారాకు థాంక్స్!

ఐపీఎల్ - 2024 సీజన్‌ కి ముందు టైటిల్ గెలవలేకపోయిన ఫ్రాంఛైజీలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

Update: 2023-08-08 00:30 GMT

ఐపీఎల్.. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు క్రికెట్ అభిమానులు. వినోదానికి వినోదం, డబ్బుకు డబ్బు... ఈ ఐపీఎల్ పేరు చెప్పి జరిగే సందడి అంతా ఇంతా కాదు. ఇక బెట్టింగ్ రాయళ్ల సంగతి చెప్పే పనేలేదని అంటుంటారు! ఈ సమయంలో ఐపీఎల్ - 2023లో డల్ అయిన కొన్ని టీం లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

అవును... ఐపీఎల్ - 2024 సీజన్‌ కి ముందు టైటిల్ గెలవలేకపోయిన ఫ్రాంఛైజీలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా కోచ్ లను మార్చే పనిలో పడ్డాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త కోచ్‌ గా ఆండీ ఫ్లవర్ బాధ్యతలు తీసుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌ గా జస్టిన్ లాంగర్ బాధ్యతలు తీసుకున్నాడు.

ఇదే సమయంలో తాజాగా సన్‌ రైజర్స్ హైదరాబాద్ కూడా హెడ్ కోచ్‌ ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆన్ లైన్ వేదికగా ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రకారం... న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, మాజీ ఆల్‌ రౌండర్ డేనియల్ వెట్టోరీని హెడ్ కోచ్‌ గా నియమించింది.. బ్రియాన్ లారాకి వీడ్కోలు తెలిపింది.

డానియల్ వెట్టోరీకి స్వాగతం పలికిన ఆరెంజ్ ఆర్మీ.. ఇదే సమయంలో... "బ్రియాన్ లారాతో రెండేళ్ల అనుబంధం ముగిసింది. సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ కి మీరు చేసిన సేవలకు థ్యాంక్యూ.." అని రాసుకొచ్చింది!

అయితే ఐపీఎల్ లో కోచ్ గా బాధ్యతలు తీసుకోవడం వెట్టోరీకి ఇదే ఫస్ట్ టైం కాదు. డేనియల్ వెట్టోరీ ఇంతకుముందు 2014 నుంచి 2018 వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి హెడ్ కోచ్‌ గా వ్యవహరించాడు. 2016లో డేనియల్ వెట్టోరీ కోచింగ్‌ లోనే రాయల్ ఛాలెంజర్స్ ఫైనల్‌ కి చేరింది.

అదేవిధంగా... "యాషెస్ సిరీస్ - 2023" సిరీస్ సమయంలో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌ కి అసిస్టెంట్ కోచ్‌ గానూ వ్యవహరించాడు డేనియల్ వెట్టోరీ. గత సీజన్‌ లో బ్రియాన్ లారా కోచింగ్‌ లో ఆడిన సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టు... భారీ అంచనాలతో ఐపీఎల్ - 2023 సీజన్‌ ని ఆరంభించి 14 మ్యాచుల్లో 4 విజయాలు మాత్రమే అందుకుంది.

కాగా... 1997 నుంచి 2015 వరకూ అంతర్జాతీయ క్రికెట్‌ లో కొనసాగిన డేనియల్ వెట్టోరీ... 113 టెస్టులు, 295 వన్డే మ్యాచులు ఆడి 6784 పరుగులు చేశాడు! ఇందులో 6 టెస్టు సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే బౌలింగ్‌ లో 671 వికెట్లు పడగొట్టాడు. ఇదే సమయంలో నాలుగేళ్ల పాటు న్యూజిలాండ్‌ కి కెప్టెన్‌ గా వ్యవహరించాడు.

Tags:    

Similar News