కుర్రాడు కాదు.. దిగ్గజమూ లేడు.. యూఎస్ ఓపెన్ టెన్నిస్ లో సంచలనాలు

వింబుల్డన్ జరిగే పచ్చిక కోర్టు కాదు.. ఫ్రెంచ్ ఓపెన్ జరిగే ఎర్రమట్టి కోర్టూ కాదు.. ఇక టోర్నీ విషయానికి వస్తే.. వరుసగా సంచలనాలు నమోదవుతున్నాయి.

Update: 2024-08-31 09:42 GMT

మొన్నటికి మొన్న అతడిని భవిష్యత్ సూపర్ స్టార్ అంటూ అందరూ పొగిడారు.. నిన్నటికి నిన్న ఇతడిని 25వ టైటిల్ కొట్టేస్తాడంటూ ఆకాశానికి ఎత్తేశారు.. కానీ, తీరాచూస్తే ఇద్దరూ ఔటయ్యారు.. అదికూడా అనామకుల చేతిలో ఓడిపోయారు.. ఇదీ ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ పరిస్థితి. నాలుగు గ్రాండ్ స్లామ్ లలో చివరిదైన ఈ టోర్నీ కాస్త భిన్నమైనది. వింబుల్డన్ జరిగే పచ్చిక కోర్టు కాదు.. ఫ్రెంచ్ ఓపెన్ జరిగే ఎర్రమట్టి కోర్టూ కాదు.. ఇక టోర్నీ విషయానికి వస్తే.. వరుసగా సంచలనాలు నమోదవుతున్నాయి.

అల్కరాజ్ పోయాడనుకుంటే..

సమకాలీన టెన్నిస్ లో మేటి ఆటగాడిగా కార్లోస్ అల్కరాజ్‌ పేరు చెబుతున్నారు. 22 ఏళ్ల ఈ కుర్రాడు మూడో ర్యాంకర్‌ యూఎస్ ఓపెన్ బరిలో దిగాడు. వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన అల్కరాజ్.. యూఎస్ ఓపెన్ నూ కైవసం చేసుకుంటాడని అందరూ భావించారు. వరుసగా 15 గ్రాండ్‌ స్లామ్‌ మ్యాచ్‌ లలో నెగ్గిన అతడి జోరు కూడా అలాగే ఉంది. యూఎస్‌ ఓపెన్ లో అల్కరాజ్ గెలుపు ఓటముల రికార్డు 16-2. కానీ.. ఈ స్పెయిన్‌ కుర్రాడిని రెండో రౌండ్ లోనే మట్టికరిపించాడు 74వ ర్యాంకర్‌ బొటిక్‌ వాండ్‌. నెదర్లాండ్స్‌ కు చెందిన ఇతడు 6-1, 7-5, 6-4తో అల్కరాజ్ ను వరుస సెట్లలో ఇంటికి పంపాడు. ఈ సీజన్ లో బొటిక్ 29 మ్యాచ్‌ లు ఆడి పదకొండు మాత్రమే గెలిచాడు. కానీ.. అల్కరాజ్ తో పోటీ అనగానే చెలరేగాడు. టైటిల్ ఫేవరెట్ అయిన అల్కరాజ్ కు చేదు అనుభవం మిగిల్చాడు.

25వది అందనిది..

ప్రపంచ టెన్నిస్ లో 24 గ్రాండ్ స్లామ్ లు గెలిచిన మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేసిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్‌ కూ యూఎస్ ఓపెన్ లో చేదు అనుభవమే ఎదురైంది. మూడో రౌండ్‌ లో ఆస్ట్రేలియా ఆటగాడు, 28వ సీడ్‌ అలెక్సీ పాప్రియన్‌ 6-4, 6-4, 2-6, 6-4 తేడాతో జకోవిచ్‌ను ఓడించాడు. 18 ఏళ్లలో జకో యూఎస్‌ ఓపెన్‌ నాలుగో రౌండ్‌ కు చేరకుండా నిష్క్రమించడం ఇదే తొలిసారి. వాస్తవానికి ఈ మ్యాచ్ లో తన సహజసిద్ధమైన రీతిలో తొలి రెండు సెట్లను కోల్పోయాడు జకోవిచ్‌. మూడో సెట్‌ లో గెలిచి మ్యాచ్ లోకి వచ్చాడు. కానీ, పుంజుకున్న పాప్రియన్ నాలుగో సెట్‌ ను, మ్యాచ్ ను నెగ్గాడు. ఈ పోటీ 3 గంటల 19 నిమిషాలు సాగడం గమనార్హం. ఇటీవలనే జకోవిచ్ తొలిసారిగా ఒలింపిక్స్ బంగారు పతకం సాధించాడు. యూఎస్ ఓపెన్ లో అల్కరాజ్ ఓటమితో 25 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల (అత్యధికం) రికార్డును అందుకుంటాడని భావిస్తే.. అనూహ్యంగా పరాజయం పాలయ్యాడు. ఈ ఏడాది అత్యంత చెత్తగా ఆడిన మ్యాచ్ ఇదేనని అతడు తెలిపాడు.

Tags:    

Similar News