152 పతకాలున్న ఆ కుర్రాడికి కాలేజీ సీటు రాకపోవటమా?
హైదరాబాద్ కు చెందిన ఒక యువ రోలర్ స్కేటర్ ఎదుర్కొంటున్న సమస్యను వింటే అయ్యో పాపం అనిపించటమే కాదు.. ఈ తరహా వ్యవస్థల మీద ఆగ్రహం రావటం ఖాయం.
ప్రపంచ క్రీడా పండుగ పారిస్ లో ఘనంగా సాగుతోంది. పతకాల వేటలో మనోళ్లు గట్టిగానే పోరాడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఉన్న మనం.. పతకాల వేటలో మాత్రం జాబితాలో ఎక్కడో ఉండటం తెలిసిందే. దీనికి కారణం క్రీడలకు.. క్రీడాకారులకు మనమిచ్చే గౌరవ మర్యాదలే. ఆటలంటే ఒక్క క్రికెట్ అన్నట్లుగా మారిన మన దేశంలో.. మిగిలిన క్రీడల్లో రాణించిన వారికి ఎలాంటి ఆదరవు లేని దరిద్రం మన సొంతం. హైదరాబాద్ కు చెందిన ఒక యువ రోలర్ స్కేటర్ ఎదుర్కొంటున్న సమస్యను వింటే అయ్యో పాపం అనిపించటమే కాదు.. ఈ తరహా వ్యవస్థల మీద ఆగ్రహం రావటం ఖాయం.
జాతీయ, అంతర్జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీల్లో 18 ఏళ్ల పడిగ తేజేశ్ అనే కుర్రాడు ఇప్పటివరకు 152పతకాలు సాధించాడు. ఇందులో ఐదు అంతర్జాతీయ పతకాలు ఉంటే.. 26 జాతీయ స్థాయి పోటీల్లో నెగ్గిన పతకాలు ఉన్నాయి. గత ఏడాది చైనాలో జరిగిన ఆసియా చాంపియన్ షిప్ సీనియర్ విభాగంలో రజతం సాధించాడు. అంతటి ప్రతిభ ఉన్న కుర్రాడు ఇంజినీరింగ్ చేసేందుకు అవసరమైన కాలేజీ విషయంలో అతను ఎదుర్కొంటున్న కష్టం తెలిస్తే అయ్యో అనాల్సిందే.
ఇంతకూ అతనికి వచ్చిన సమస్య ఏమంటే.. క్రీడా సంఘాల మధ్యనున్న కుమ్ములాటలు.. అంతర్గత రాజకీయాల కారణంగా కొన్ని సంఘాలకు రాష్ట్ర క్రీడా ప్రాథికార సంస్థ (శాట్జ్) ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు లేకపోవటంతో వారికి అన్యాయం జరుగుతోంది.
తేజేశ్ విషయానికే వస్తే జీవో 2 ప్రకారం ఇతనికి ఉన్న పతకాల ఆధారంగా ఎప్ సెట్ కౌన్సెలింగ్ లో ప్రాధాన్య క్రమంలో 35వ స్థానంలో ఉండాలి. కానీ.. అసోసియేషన్ కు గుర్తింపు లేని కారణంగా తేజేశ్ స్పోర్ట్స్ కోటాను కోల్పోవాల్సి వస్తోంది. వాస్తవానికి జీవో నంబరు 2 ప్రకారం ఎంబీబీఎస్.. బీడీఎస్ మినహా ఇంజనీరింగ్.. అగ్రికల్చర్.. ఐఐఐటీ.. ఐసెట్.. ఈసెట్.. లాసెట్ ఇలా అన్ని ప్రొఫెషనల్ కోర్సుల్లో 0.5 శాతం స్పోర్ట్స్ కోటా కింద సీట్లు కేటాయించాల్సి ఉంటుంది.
కానీ.. క్రీడా సంఘాల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా తేజేశ్ లాంటి ప్రతిభావంతులైన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. 2019 నుంచి రోలర్ స్కేటింగ్ కు గుర్తింపు లేకపోతే.. ఈ విషయంపై క్రీడాకారులకు అవగాహన కల్పించాల్సి ఉందని.. అంతే తప్పించి యువకుల భవిష్యత్తును దెబ్బ తీయకూడదని చెబుతున్నారు. ప్రస్తుతం క్రీడా మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. ఇలాంటి ప్రతిభావంతులకు అన్యాయం జరగకుండా సీఎం స్పందించాలని కోరుతున్నారు.