భళా పారాలింపియన్లు.. పారిస్ లో భారత్ పరువు నిలిపారు

2021 నాటి టోక్యో ఒలింపిక్స్ తో పోల్చుకుంటే ఈసారి మన క్రీడాకారులు రాణించలేకపోయారు. ప్రజలను నిరుత్సాహపరిచారు.

Update: 2024-09-09 10:30 GMT

మొత్తం 117 మంది అథ్లెట్లు.. ఇందులో మేటి క్రీడాకారులు.. కనీసం పదికిపైగా పతకాలు వస్తాయని ఆశ.. కానీ.. అంచనాలు తప్పాయి.. ఒక్క స్వర్ణమూ రాలేదు.. ఒకే ఒక రజతం.. అది కూడా గత పోటీల స్వర్ణ పతక విజేత తెచ్చింది.. మిగతావన్నీ కాంస్య పతకాలే.. అందులో రెండు ఒకే అమ్మాయి తెచ్చినవి. ఇదీ ఇటీవలి పారిస్ ఒలింపిక్స్ లో భారత ప్రదర్శన. 2021 నాటి టోక్యో ఒలింపిక్స్ తో పోల్చుకుంటే ఈసారి మన క్రీడాకారులు రాణించలేకపోయారు. ప్రజలను నిరుత్సాహపరిచారు.

అంచనాలకు మించి..

రెగ్యులర్ గా జరిగేవాటిని సమ్మర్ ఒలింపిక్స్ అంటారు.. ఆ తర్వాత దివ్యాంగుల కోసం నిర్వహించేవాటిని పారాలింపిక్స్ అంటారు. ఇందులో దివ్యాంగులు ఎవరికీ తక్కువ కాదని చాటిచెప్పే ఉద్దేశం ఉంది. ఈసారి పారిస్ పారాలింపిక్స్ లో 25 పతకాలు సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, దానికి మించిన ప్రదర్శన చేసింది. ఏకంగా 29 పతకాలు సాధించింది. అదిరే ముగింపు మాత్రం జావెలిన్‌ త్రోలోనే. నాలుగు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తు మాత్రమే ఉండే నవ్‌దీప్‌ సింగ్‌ జావెలి త్రోలో స్వర్ణం సాధించాడు. 200 మీటర్ల పరుగులో సిమ్రన్‌ కాంస్యం నెగ్గింది.

అక్కడలా.. ఇక్కడిలా..

సమ్మర్ ఒలింపిక్స్ లో భారత్ కు 1 రజతం, 5 కాంస్యాలు వచ్చాయి. మన దేశం పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలిచిం. ఇది పాకిస్థాన్ కంటే వెనక కావడం గమనార్హం. ఇక పారాలింపిక్స్ లో భారత్ ఏడు స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు సాధించింది. అంటే.. మొత్తం 29 పతకాలు అన్నమాట. కాగా, ఇది పారాలింపిక్స్‌ చరిత్రలోనే భారత్ కు ఉత్తమ ప్రదర్శన. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ లోనే నాలుగు స్వర్ణాలు నెగ్గింది. ఇందులోనే 17 పతకాలు దక్కాయి.

అక్కడ స్వర్ణం చేజారింది.. ఇక్కడ దక్కింది

పారిస్ సమ్మర్ ఒలింపిక్స్ లో రెజ్లర్ వినేశ్ ఫొగట్ 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరి.. వంద గ్రాముల అధిక బరువు కారణంగా డిస్ క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. వినేశ్ జోరు చూస్తే స్వర్ణం సాధించేలా కనిపించింది. అయితే, ఇప్పుడు పారాలింపిక్స్ లో పురుషుల ఎఫ్‌41 జావెలిన్‌త్రోలో నవ్‌ దీప్‌ సింగ్‌ అనూహ్యంగా స్వర్ణం నెగ్గాడు. మరుగుజ్జు విభాగంలో పోటీపడిన అతడికి అదృష్టం కలిసొచ్చింది. ఫైనల్లో జావెలిన్‌ ను మూడో ప్రయత్నంలో ఉత్తమంగా 47.32 మీటర్ల దూరం విసిరిన నవ్‌ దీప్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఇరాన్‌ అథ్లెట్‌ సదెగ్‌ సయా (47.64 మీ) టాప్ లో నిలిచాడు. గెలుపు తర్వాత అతడు వివాదాస్పద జెండాను ప్రదర్శిస్తూ, అనుచితంగా ప్రవర్తించడంతో డిస్ క్వాలిఫై చేశారు. ఒలింపిక్ పోటీల సందర్భంగా ఆటగాళ్లు రాజకీయ వ్యాఖ్యలు, సంజ్ఞలు చేయడం నిషిద్ధం కావడంతో సదెగ్‌ పై వెంటనే చర్యలు తీసుకున్నారు. దీంతో రెండో స్థానంలో ఉన్న నవ్‌ దీప్‌ కు స్వర్ణం దక్కింది. కాగా, టోక్యోలో మాదిరిగానే చైనా (220) అత్యధిక పతకాలు సాధించింది. ఇందులో 94 స్వర్ణాలున్నాయి. బ్రిటన్‌ 49 గోల్డ్ మెడల్స్ సహా 124 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. అమెరికా (36 స్వర్ణాలు సహా 105) మూడో స్థానం సాధించింది. పారాలింపిక్స్‌ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత్‌ (29).. 18వ స్థానంతో పోటీలను ముగించింది. టోక్యోలో భారత్ 19 పతకాలు సాధించింది.

Tags:    

Similar News