చదరంగంలోనయా ఆనంద్.. ప్రజ్ఞానంద.. ప్రపంచ కప్ గెలుస్తాడా?
చెస్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడు. 12 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ ఘనత కూడా సాధించాడు
ఆనంద్ శకం ముగిసింది. హరిక్రిష్ణ తరం అయిపోయింది.. హంపి పెళ్లయిపోయింది. హారిక పేరు ఎక్కడా వినిపించడం లేదు.. భారత చదరంగం వెనకడుగు వేసిందా? మరిక ప్రపంచ స్థాయి ఆటగాళ్లు రారా? రష్యన్లను ఢీకొట్టి అమెరికన్లకు చెక్ పెట్ చైనీయులను పడగొట్టిన భారత చెస్ ప్రాభవం కొడిగట్టినట్టేనా? ఇవీ కొన్నాళ్లుగా ఎదురవుతున్న ప్రశ్నలు. వీటికి సమాధానంగా తానున్నానంటూ వచ్చాడో 18 ఏళ్ల కుర్రాడు. అతడే చెన్నైకు చెందిన ప్రజ్ఞానంద. 10 ఏళ్ల 10 నెలలకే ఇంటర్నేషనల్ మాస్టర్ అతడు.
చెస్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడు. 12 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ ఘనత కూడా సాధించాడు. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన కార్ల్ సన్ ను 16 ఏళ్ల వయసులోనే ఓడించాడు మనోడు. అంతేకాదు ఏడాది వ్యవధిలో ఇంకో రెండుసార్లు అతడిపై పైచేయి సాధించాడు. మరో విశేషం ఏమంటే.. కేవలం 12 ఏళ్ల 10 నెలల వయసులోనే ప్రజ్ఞానంద గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఇండియాలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడు అతడే.
తాజాగా జరుగుతున్న ప్రపంచ కప్ లో కరువానా లాంటి మేటి ఆటగాడిని మట్టికరిపించాడు. కార్ల్ సన్ తో తుదిపోరులో తలపడుతున్నాడు. ప్రజ్ఞానంద దిగ్గజ క్రీడాకారుడు కాస్పరోవ్‌ను సైతం మెప్పించాడు. బాల్యం నుంచి స్థానిక టోర్నీలైనా.. అంతర్జాతీయ స్థాయిలో తలపడ్డా.. తన వెంట తల్లి నాగలక్ష్మి ఉండాల్సిందే. మధ్య తరగతి మహిళ అయినప్పటికీ పిల్లాడికి ఆమె ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. కాగా, వీరిది తెలుగు మూలాలున్న కుటుంబం. ప్రజ్ఞానంద తండ్రి రమేశ్ బాబు తెలుగువారే. కాకపోతే చెన్నైలో స్థిరపడ్డారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులు తెలుగు మాట్లాడారు. వారి ఇంట్లో పెద్దవాళ్లు తెలుగులోనే సంభాషించుకుంటారు. కాగా, ప్రజ్ఞానంద, అతడి సోదరి వైశాలికి తెలుగు తెలుస్తుంది కానీ మాట్లాడలేరట.
కాగా, ఫిడె చెస్ ప్రపంచ కప్ లో చక్కటి ప్రదర్శనతో ప్రజ్ఞానంద ఫైనల్ కు చేరాడు. ప్రపంచ నంబర్ వన్ కార్ల్ సన్ తో తలపడుతున్నాడు. మంగళవారం తొలి రౌండ్ ఆడాడు. దీనిని డ్రా చేసుకున్నాడు. తొలి రౌండ్ లో ఇద్దరూ పాయింట్లు పంచుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు కార్ల్ సన్ ను ఓడించిన.. సెమీఫైనల్లో కరువానా లాంటి మేటి క్రీడాకారుడిపై నెగ్గిన ప్రజ్ఞానంద.. తుది పోరులో ఉత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. కార్ల్ సన్ ను నిలువరించి 35 ఎత్తుల్లో గేమ్ ను డ్రాగా ముగించాడు. కాగా, తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానందకు చివరకు కార్ల్ సన్ నే డ్రా ప్రతిపాదన చేశాడంటే మనోడి దూకుడు ఎలా ఉందో తెలుసుకోవచ్చు.
నేడు తేలుతుందా? రేపటికా?
ప్రపంచ కప్ ఫైనల్స్ బుధవారం కూడా జరగనున్నాయి. రెండో గేమ్ బుధవారం (నేడు) ఉంది. తొలి గేమ్ డ్రా అయిన నేపథ్యంలో ఇది కూడా డ్రా అయితే విజేతను నిర్ణయించడానికి టై బ్రేక్ నిర్వహిస్తారు. అంటే.. రెండో గేమ్ లో ఎవరు గెలిస్తే వారే విజేత. లేదంటే గెలుపెవరిదో గురువారం తెలుస్తుంది. మంగళవారం రాత్రి జరిగిన గేమ్ లో తానెక్కడా ఇబ్బంది పడలేదని.. రెండో గేమ్ కూడా హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్నట్లు ప్రజ్ఞానంద చెప్పాడు. కాగా, సెమీస్ లోనే (టై బ్రేక్) కఠినమైన మ్యాచ్ ఆడిన ప్రజ్ఞానందకు కాస్త విశ్రాంతి అవసరమైంది. రెండో గేమ్ ను అతడు తాజాగా ప్రారంభించే చాన్సుంది.
చరిత్రలో నిలుస్తాడా..?
ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకనుంచి ఒక లెక్క.. ఇదీ ప్రజ్ఞానంద గురించి చెప్పాలంటే.. పదేళ్లుగా రాజ్యమేలుతున్న కార్ల్ సన్ ను అలవోకగా ఓడించాడతడు. కార్ల్ సన్ ధాటికి ఆనంద్ సహా ఎందరో దిగ్గజాలు వెనుకబడ్డారు. కానీ, అలాంటివాడినే ప్రజ్ఞానంద మట్టికరిపించాడు. అంతేకాదు.. ప్రపంచ ఛాంపియన్ షిప్ లలో వరుసగా టైటిళ్లు కొట్టి మొహం మొత్తిన కార్ల్ సన్ తనకు పోటీ లేని టోర్నీలో ఆడను అంటూ తప్పుకొన్నాడు. అలాంటివాడిని ఏడాదిలో మూడుసార్లు ఓడించాడు ప్రజ్ఞానంద. మరి నేటి మ్యాచ్ తోనే మనోడు ప్రపంచ చాంపియన్ గా ఆవిర్భవిస్తాడని ఆశిద్దాం.