చెస్ వరల్డ్ కప్ లో ప్రజ్ఞానంద ప్రపంచ రికార్డు
2005లో ప్రపంచకప్‌లో నాకౌట్ ఫార్మాట్ ప్రవేశపెట్టిన తర్వాత ఫైనల్ చేరిన తొలి భారత ఆటగాడు ప్రజ్ఞానంద కావడం విశేషం.
అజర్ బైజాన్ లోని బాకులో జరుగుతున్న ఎఫ్ఐడిఈ చెస్ వరల్డ్ కప్ లో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ప్రపంచ మూడో ర్యాంకు ఆటగాడు, అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాను ప్రజ్ఞానంద సెమీఫైనల్ లో ఓడించి ఫైనల్ కు చేరుకున్నాడు. తద్వారా ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరుకున్న అతి పిన్న వయస్కుడి(18 ఏళ్లు)గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్ లో ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ తో ప్రజ్ఞానంద తలపడనున్నాడు. ప్రపంచ చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టిన రెండో భారత ఆటగాడిగా ఈ యువ సంచనలం నిలిచాడు.
హోరాహోరీగా సాగిన సెమీస్‌లో ప్రజ్ఞానంద 3.5-2.5 తేడాతో కరువానాపై ఉత్కంఠభరిత విజయం సాధించాడు. ఈ విజయంతో 2024 క్యాండిడేట్ టోర్నీలో ఈ యువ సంచలనం చోటు ఖాయం చేసుకున్నాడు. బాబి ఫిషర్, కార్ల్‌సన్ తర్వాత ఆ పోటీల్లో తలపడే మూడో పిన్న వయస్సు ఆటగాడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. 2005లో ప్రపంచకప్‌లో నాకౌట్ ఫార్మాట్ ప్రవేశపెట్టిన తర్వాత ఫైనల్ చేరిన తొలి భారత ఆటగాడు ప్రజ్ఞానంద కావడం విశేషం. అంతకుముందు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగిన ప్రపంచకప్ లలో విశ్వనాథన్ ఆనంద్ 2000, 2002లో టైటిల్ నెగ్గాడు.
ఇక, నార్వే చెందిన కార్ల సేన్ ఇప్పటికే ఐదు సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్ లో కార్ల్ సేన్ ఎత్తులకు పై ఎత్తులు వేసి టైటిల్ ను ప్రజ్ఞానంద గెలుచుకుంటే అది మరో కొత్త ప్రపంచ రికార్డు అవుతుంది. ఈ క్రమంలోనే ఈ యువ చెస్ చాంపియన్ కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. తన హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోందని, ఈ యువ ప్రతిభావంతుడు మరిన్ని ఎత్తులు అవరోధిస్తాడని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆకాంక్షించారు. 100 కోట్లకు పైగా భారతీయులు నీ వెంట ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజ్ఞానంద టైటిల్ గెలవాలని ప్రియాంక గాంధీ కూడా ఆకాంక్షించారు.