విశ్వ క్రీడల వేదికలో తెలుగు.. పారిస్ ఒలింపక్స్ లో తళుక్కు
చైయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘన కీర్తి కలవాడా.. అని గొప్ప పాట.
చైయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘన కీర్తి కలవాడా.. అని గొప్ప పాట. తెలుగు భాష గొప్పదనాన్ని చాటడమే కాదు.. ఆ భాషను వీలున్నచోటల్లా మాట్లాడాలి. భాషాభిమానం ఉండడంలో తప్పులేదని ఎవరైనా చెబుతారు. దురభిమానం ఉండకూడదనే బోధిస్తుంటారు. ఉదాహరణకు తమిళనాడు, కర్ణాటకలను చూడండి.. తమిళం, కన్నడలకు వారు ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తమిళులైతే మరీను.. రాష్ట్రంలో ఆఫీసులు, దుకాణాల పేర్లు తమిళంలోనే ఉండి తీరాలి. ఇక కర్ణాటకలోనూ కొన్నేళ్లుగా భాషాభిమానం బాగా పెరుగుతోంది. ఆ మేరకు ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి.
విశ్వ వేదికపై
ప్రస్తుతం పారిస్ లో ఒలింపిక్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వందేళ్ల తర్వాత ఆతిథ్యం.. క్రీడాకారుల్లో లింగ సమానత్వం.. ఐఫిల్ టవర్ ఇనుమును పతకాలకు వాడడం.. ఇలా ప్రత్యేకతలు దీని సొంతం. ఇక భారత్ నుంచి 117 మందితో కూడిన క్రీడాకారుల టీమ్ పారిస్ వెళ్లింది. వీరిలో 11 మంది తెలుగువారు ఉండడం విశేషం. అంటే మొత్తం టీమ్ లో 10 శాతం తెలుగువారే అన్నమాట. ఇక వీరిలో బ్యాడ్మింటన్ స్టార్, రెండుసార్లు పతక విజేత పీవీ సింధు నుంచి కోనసీమ కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ వరకు ఉన్నారు. టేబుల్ టెన్నిస్ లో ఆకుల శ్రీజ.. మేటి బాక్సర్ గా ఎదుగుతున్న నిఖత్ జరీన్ వంటివారిపై పతక ఆశలున్నాయి. ఆర్చరీలో పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్, సెమీస్ పోటీలు జరుగున్నాయి. ఇందులో తరుణ్‌దీప్ రాజ్, ప్రవీణ్ జాదవ్ తో కలిసి తెలుగు ఆర్చరీ ఆటగాడు బొమ్మదేవర ధీరజ్ బరిలో దిగుతోన్నాడు. సెమీస్ దాటితే ఇండియాకు పతకం ఖాయం అవుతుంది.
తెలుగు పలుకిలా..
పారిస్ ఒలింపిక్స్ లో ఆదివారం భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్రణయ్ జర్మనీ ఆటగాడు రోత్ ఫాబియాన్ ను ఓడించాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్బంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అదేమంటే.. ప్రణయ్ కు దిగ్గజ బ్యాడ్మింటన్ కోచ్, ఆటగాడు తెలుగువాడైన పుల్లెల గోపీచంద్ తెలుగులో సూచనలు చేశాడు. ‘షటిల్ పైకి వచ్చిందనుకో.. కిందకు కొట్టు.. ఈ రేంజ్ లో వచ్చిందనుకో’ అంటూ గోపీ చెబుతుండగా ప్రణయ్ శ్రద్ధగా వినడం లైవ్ లో కనిపించింది. ఒలింపిక్స్ లో తెలుగు వినడం బాగుందని.. ఇదే ఊపులో ప్రణయ్ స్వర్ణం సాధించాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అని చెబుతున్నారు. కాగా, గోపీచంద్ భారత పురుషుల గొప్ప బ్యాడ్మింటన్ ప్లేయర్ మాత్రమే గాక.. మేటి కోచ్ అనే సంగతి తెలిసిందే. గోపీ శిక్షణలోనే సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి గొప్ప ప్లేయర్లు పుట్టుకొచ్చారు. స్వయంగా గోపీ.. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టైటిల్ కొట్టారు. గోపీచంద్ అకాడమీని స్థాపించి వర్థమాన క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు.