ఫ్రాంచైజీ పంచాయితీ.. పంజాబ్ కింగ్స్ కు ఏమైంది?
మరి.. ప్రీతీ జింటా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు? దాని వెనుకున్న కారణం ఏమిటి? అన్నది బయటకు రావాల్సి ఉంది.
ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన పంజాబ్ కింగ్స్ లో ఏం జరుగుతోంది? ఈ ఫ్రాంఛైజీకి ఫేస్ గా ఉండే బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతిజింటా ఇప్పుడు హర్యానా హైకోర్టును ఆశ్రయించటం ఆసక్తికరంగా మారింది. మంచి విలువ ఉన్న పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీలో సహ యజమానల మధ్య నెలకొన్న పంచాయితీనే తాజా పరిణామాలకు కారణంగా చెబుతున్నారు. పంజాబ్ కింగ్స్ లో తనకున్న వాటాను వేరే వారికి విక్రయించే విషయంలో భాగస్వాముల మధ్య నెలకొన్న విభేదాలు కోర్టు వరకు వెళ్లినట్లుగా చెబుతున్నారు.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో బాలీవుడ్ నటి ప్రీతీ జింటా తో పాటు పారిశ్రామికవేత్తలు మోహిత్ బర్మన్.. నెస్ వాడియాలు ప్రధాన వాటాదారులన్న సంగతి తెలిసిందే. అయితే.. తన షేర్లను ఇతరులకు అమ్మేందుకు మోహిత్ బర్మన్ రెఢీ అయినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు సాగుతున్న వేళ.. దాన్ని అడ్డుకునేందుకు ప్రీతి జింటా రంగంలోకి హైకోర్టును ఆశ్రయించినట్లు చెబుతున్నారు.
ఫ్రాంఛైజీ పెట్టుకున్న నిబంధనల ప్రకారం వాటాల్ని ఎవరైనా అమ్మేయాలనుకుంటే తొలుత తమలోని వారిని సంప్రదించి.. దానికి భాగస్వాములు సిద్దంగా లేకుంటే మాత్రమే బయట వారికి అమ్మే వీలు ఉంటుంది. అయితే.. బర్మన్ మాత్రం తాము పెట్టుకున్న నిబంధనలకు భిన్నంగా బయటి వారికి వాటా అమ్మే ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన స్పందిస్తూ తాను ఎలాంటి షేర్లను అమ్మట్లేదని స్పష్టం చేశారు. మరి.. ప్రీతీ జింటా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు? దాని వెనుకున్న కారణం ఏమిటి? అన్నది బయటకు రావాల్సి ఉంది. ఈ వ్యవహారంపై పంజాబ్ కింగ్స్ ఫ్ఱాంఛైజీ తరఫు ఎవరూ రియాక్టుకాకపోవటం గమనార్హం.