ఆర్సీబీ విక్టరీ... విరాట్ ఊచకోతకు డీకే మెరుపుల సహకారం!

ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా చినస్వామి స్టేడియంలో పంజాబ్ తో బెంగళూరు తలపడింది.

Update: 2024-03-26 04:07 GMT

ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా చినస్వామి స్టేడియంలో పంజాబ్ తో బెంగళూరు తలపడింది. ఈ క్రమంలో.. టాస్ గెలిచి బెంగళూరు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో బ్యాటింగ్ కు దిగారు. చినస్వామి స్టేడియం మొత్తం హౌస్ ఫుల్ & కలర్ ఫుల్ గా నిండిపోయి ఉంది.

శుభారంభం లేదు!:

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ కింగ్స్ కు శుభారంభం దక్కలేదనే చెప్పాలి. ఓపెనర్ బెయిర్‌ స్టో (8) మూడో ఓవర్లోనే ఔట్‌ కాగా.. మరో ఓపెనర్‌ ధావన్‌ తొలి 21 బంతుల్లో 21 పరుగులే చేశాడు. మరోపక్క ప్రభ్‌ సిమ్రన్‌ కూడా తొలి 9 బంతుల్లో 10 పరుగులే సాధించాడు. ఇలా 6 ఓవర్లు (పవర్ ప్లే) ముగిసే సరికి పంజాబ్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 40 పరుగులు మాత్రమే!

పంజాబ్ శ్రేణుల్లో ఉత్సాహం... కాసేపే!:

పవర్ ప్లే తర్వాత ప్రభ్ సిమ్రన్ రెండు సికలు, ధావన్ ఒక సిక్స్, ఫోరు బాదడంతో పంజాబ్ శ్రేణుల్లో కాస్త సందడి కనిపించింది. అయితే ఈ ఆనందం ఎక్కువ సేపు ఉండనివ్వకుండా సిమ్రన్ దూకుడుకు మ్యాక్స్ వెల్ కళ్లెం వేశాడు. అనంతరం లివింగ్ స్టన్ (17) ఫుల్ ఫాం లో ఉన్నట్లు కనిపించినా.. జోసెఫ్ దెబ్బకు పెవిలియన్ చేరాడు.

మ్యాక్స్ వెల్ వన్స్ ఎగైన్!:

అప్పటికే ప్రభ్ సిమ్రన్ వికెట్ తీసుకుని పంజాబ్ శ్రేణుల్లో నిరుత్సాహం నింపిన మ్యాక్స్ వెల్... కెప్టెన్ శిఖర్ ధావన్ ని కూడా వెనక్కి పంపాడు. దీంతో పంజాబ్ 13 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ఇది పీకల్లోతు కష్టాల్లో మునిగిపోవడంతోనే సమానం!!

ఆదుకున్న సామ్‌ కరన్ – జితేశ్ శర్మ:

పీకల్లోతు కష్టల్లో ఉన్న పంజాబ్ ను ఒక దశలో జితేశ్ శర్మ, సామ్‌ కరన్ ఆదుకున్నారు. కాస్త దూకుడుగా ఆడిన జితేంద్ర శర్మ 27 (20 బంతుల్లో 1 ఫొర్, 2 సిక్స్లు), సామ్‌ కరన్ 23 (17 బంతుల్లో 3 ఫోర్లు) కాస్త గౌరవప్రధమైన స్కోరుకు చేరుకునే విషయంలో కీలక భూమిక పోషించారు. ఈ జంట 32 బంతుల్లో 52 పరుగులు జోడించింది.

శశాంక్ సింగ్ అదరహో!:

ఇన్నింగ్స్ ఇలా సాగుతున్న దశలో 18వ ఓవర్లో సామ్‌ కరన్‌ ను యశ్ దయాల్ ఔట్ చేయడం.. తర్వాత ఓవర్ లో జితేశ్ శర్మను సిరాజ్ ఔట్ చేయడంతో 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన పంజాబ్ 154 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆఖరి ఓవర్ లో శశాంక్ సింగ్ మోత మోగించేశాడు.

ఇందులో భాగంగా... ఆఖరి ఓవర్ లో రెండు సిక్స్ లు ఒక ఫోరు బాదాడు. దీంతో పంజాబ్ స్కోరు 170 దాటింది. ఈ మెరుపులతో శశాంక్ సింగ్ 8 బంతుల్లోనే 1 ఫోరు, 2 సిక్స్ ల సాయంతో 21 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 176!

కొహ్లీకి లైఫ్ ఇచ్చారు... పెద్ద నేరమే చేశారు!:

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టులో ఖాతా అయినా తెరవకముందే కొహ్లీకి లైఫ్ వచ్చింది. బెయిర్‌ స్టో క్యాచ్‌ వదిలేయడంతో కొహ్లీ గోల్డెన్ డక్ అవ్వకుండా బతికిపోయాడు. దీంతో... ఆ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. సామ్‌ కరన్‌ వేసిన మొదటి ఓవర్లోనే 4 ఫోర్లు బాదాడు. దీంతో తొలి ఓవర్ ముగిసే సరికి బెంగళూరు స్కోరు 16కి చేరింది.

డూప్లెసిస్ వెనుదిరిగినా కొహ్లీ తగ్గలే!

ఒకపక్క కొహ్లీ దంచికొడుతున్న వేళ.. మరోపక్క ఇంకో ఓపెనర్ డూప్లెసిస్ (3)ను రబాడ త్వరగానే వెనక్కి పంపించేశాడు. అయినా కొహ్లీ తన ఆటను అదే ఊపుతో కొనసాగించాడు. ఈసారి అర్ష్‌ దీప్‌ బౌలింగ్‌ లో మూడు ఫోర్లు కొట్టాడు.

గ్రీన్ మిస్ పటీదార్ ఫిక్స్!:

డూప్లెసిస్ అవుట్ అవ్వడంతో క్రీజ్ లోకి వచ్చిన గ్రీన్ (3) ని కూడా రబాడా వెనక్కింపంపాడు. అనంతరం రజిత్ పటీదార్ తో కలిసి కొహ్లీ ఇన్నింగ్స్ ని నడిపించాడు. కొహ్లీ దూకుడుకు పటీదార్ స్లోగా సహకారం అందించాడు. ఇలా సాగుతున్న ఇన్నింగ్స్ 10 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి ఆర్సీకీ స్కోరు 85 పరుగులకు చేరుకుంది.

హర్ ప్రీత్ వరుస దెబ్బలు!:

సాఫీగా సాగిపోతున్న ఆర్సీబీ ఇన్నింగ్స్ లో హర్ ప్రీత్ రాళ్లు వేశాడు. వరుసగా బెంగళూరు బ్యాటర్స్ ని వెనక్కి పంపాడు. ఇందులో భాగంగా... 10.3 ఓవర్లో పటీదార్ ని వెనక్కి పంపిన హర్ ప్రీత్.. 12.1 ఓవర్లో మ్యాక్స్ వెల్ ను ఫెవిలియన్ కు పంపాడు. దీంతో 13 ఓవర్లకు బెంగళూరు స్కోరు 4 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.

కీలక దశలో విరాట్ అవుట్:

ఆర్సీబీని విరాట్ ఎలాగైనా గట్టేక్కించేస్తాడు అనుకుంటున్న దశలో.. 16 ఓవర్ చివరి బంతికి హర్షల్ పటేల్ దెబ్బకొట్టాడు. కొహ్లీ వికెట్ తీసుకున్నాడు. దీంతో... విరాట్‌ కోహ్లి - 77 (49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లు) ఇన్నింగ్స్ ముగిసింది. అప్పటికి 4 ఓవర్లలో ఆర్సీబీకి 47 పరుగులు అవసరం. ఇదే సమయంలో... 16.2 ఓవర్లో అంజు రావత్ కూడా అవుట్ అయిపోవడంతో ఆర్సీబీపై మరింత ఒత్తిడి పెరిగిన పరిస్థితి!

డీకే - ద ఫినిషర్ ఎంట్రీ!:

ఈ సమయంలో ఆర్సీబీ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్న డీకే రంగంలోకి దిగాడు. వచ్చీ రాగానే మొదటి రెండు బంతుల్లో నూ 6 పరుగులు సాధించాడు. మరోపక్క మహిపాల్ లోమ్రార్ (8బంతుల్లో 17) దూకుడు కొనసాగిస్తున్నాడు. ఈ సమయంలో ఫినిషర్ బ్యాట్ ఝులిపించాడు. ఇందులో భాగంగా... 10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు సాధించి, ఇంకో నాలుగు బంతులు మిగిలి ఉండగానే పని పూర్తి చేశాడు.

Tags:    

Similar News