ఒలింపిక్ రన్నర్ పై పెట్రోల్ పోసి నిప్పు.. మాజీ ప్రియుడి ఘాతుకం

ఆఫ్రికా దేశం ఉగాండాలో ఘోరం జరిగింది.. అత్యంత పేదరికంలో మగ్గే ఆ దేశం నుంచి అత్యున్నతమైన ఒలింపిక్స్ స్థాయికి ఎదిగిన అథ్లెట్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది.

Update: 2024-09-06 20:30 GMT

ఆఫ్రికా దేశం ఉగాండాలో ఘోరం జరిగింది.. అత్యంత పేదరికంలో మగ్గే ఆ దేశం నుంచి అత్యున్నతమైన ఒలింపిక్స్ స్థాయికి ఎదిగిన అథ్లెట్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. అది కూడా ప్రేమికుడి చేతిలో కావడం విషాదం. కాగా, పారిస్ ఒలింపిక్స్ లో ఉగాండాకు ఒక బంగారు, మరో రజతం దక్కాయి. పతకాల పట్టికలో 55వ స్థానంతో ముగించింది. 24 మంది టీమ్ తో ఒలింపిక్స్ కు వెళ్లిన ఉగాండాకు పురుషుల 10 వేల మీటర్ల పరుగులో జోషువా చెప్టేగి బంగారు పతకం అందించాడు. మహిళల 3 వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్ లో పెరుట్ చెముటాయ్ రజతం నెగ్గింది. ఈ రెండే ఆ దేశానికి వచ్చిన పతకాలు.

మారథాన్ లో పాల్గొని మరణశయ్యపై

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న ఉగాండా మారథాన్ రన్నర్ రెబక్కా చెప్టెగీపై ఆమె మాజీ ప్రియుడు దాడి చేశాడు. గతంలో ప్రేమించుకున్న వీరిద్దరూ అభిప్రాయ భేదాలతో విడిపోయారు. అయితే, కక్షతో మాజీ ప్రియుడు దురాగతానికి తెగించాడు. రెబెక్కా చెప్టెగీని అంతం చేయాలని చూశాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో 75 శాతం గాయాలయ్యాయి.

ఏమాత్రం అవకాశం ఉన్నా..

శరీరంపై కాలిన గాయాలు 40 శాతం దాటితే ఎవరైనా ప్రాణాలతో ఉండడం కష్టం. రెబెక్కా విషయంలో అదే జరిగింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో ఉగాండా ఒలింపిక్ సంఘం స్పందించింది. రెబెక్కా మాజీ ప్రియుడి దురాగతాన్ని ఖండించింది. గొప్ప అథ్లెట్ ను కోల్పోయామని ప్రకటించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఉగాండా ప్రజలు కోరుతున్నారు. కాగా, ఇటీవలి పారిస్ ఒలింపిక్స్ లో ఉగాండాకు స్వర్ణం సాధించిపెట్టాడు 27ఏళ్ల జోషువా చెప్టెగి. ఇప్పుడు హతమైన యువ అథ్లెట్ పేరు రెబెక్కా చెప్టెగీ. వీరిద్దరూ ఏమైనా బంధువులేమో అనేది చూడాలి.

Tags:    

Similar News