రోహిత్.. కోహ్లి.. బోత్ ఆర్ నాట్ సేమ్.. ఒకరి కెరీరే మరికొన్నాళ్లు..

దీనికంటే ముందు వచ్చే ఇంగ్లండ్ వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫీతో భవితవ్యం తేలిపోతుందనే అంచనాలు వస్తున్నాయి.

Update: 2025-01-18 10:30 GMT

వరుస వైఫల్యాలు.. జట్టు ఓటములు.. సిరీస్ లు కోల్పోవడాలతో దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల అంతర్జాతీయ కెరీర్ పై విపరీతమైన చర్చ నడుస్తోంది. వీరిద్దరూ టి20 ప్రపంచ కప్ విజయం అనంతరం ఒకేసారి పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. ఇప్పుడు వారి టెస్టు కెరీర్ పైనా నీలి నీడలు కమ్ముకున్నాయి. దీనికి కారణం.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ లలో వైఫల్యాలు. దీనికంటే ముందు వచ్చే ఇంగ్లండ్ వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫీతో భవితవ్యం తేలిపోతుందనే అంచనాలు వస్తున్నాయి.

కొన్నాళ్ల కిందటి వరకు రోహిత్ ఫిట్ నెస్ పైనే చర్చ జరిగేది. అతడు పరుగులు సాధిస్తుండడం, జట్టు గెలుస్తుండడంతో పట్టించుకోలేదు. ఇప్పుడు బ్యాట్స్ మన్ గానే కాక కెప్టెన్ గానూ విఫలం అవుతుండడంతో రోహిత్ సంగతేమిటి? అని ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో రోహిత్‌ కు రాబోయే ఐదు నెలలు అత్యంత కీలకం అంటున్నాడు టీమ్ ఇండియా మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్తా.

కాగా, రోహిత్ అంతలా కాకున్నా కోహ్లీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఆస్ట్రేలియాలో ఒకప్పుడు వందల కొద్దీ పరుగులు చేసిన అతడు ఇటీవలి సిరీస్ లో కేవలం ఒక్క సెంచరీనే కొట్టగలిగాడు. అంతకుముందు న్యూజిలాండ్ పైనా విఫలమయ్యాడు. అయితే, రోహిత్‌- కోహ్లిని పోల్చలేం అంటున్నాడు దీప్ దాస్ గుప్తా. సచిన్-ద్రవిడ్ భిన్నమైన ఆటగాళ్లు అని.. వారిద్దరూ కలిసి ఆడారని.. ఒకే తరానికి చెందినవారిని

పోల్చడం సరికాదని చెప్పాడు. ప్రతి ఆటగాడిని వ్యక్తిగతంగానే విశ్లేషించాలని సూచించాడు.

అయితే, రోహిత్‌ శర్మకు వచ్చే ఐదు నెలల కాలం అత్యంత కీలకంగా దీప్ దాస్ పేర్కొన్నాడు. జూన్ వరకు టెస్టులు లేవు కాబట్టి టి20లు, వన్డేలతో పాటు దేశవాళీలోనూ ఆడితే ఫామ్‌ అందుకోవచ్చని అంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్ ఫిట్‌ నెస్‌ తో పాటు చాంపియన్స్‌ ట్రోఫీలో ప్రదర్శన కీలకంగా మారుతుందని చెప్పుకొచ్చాడు. తద్వారా ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్‌ కు రోహిత్ ను ఎంపిక చేయడంపై సెలక్టర్లు ఒక నిర్ణయానికి వస్తారని పేర్కొన్నాడు.

ఫిట్‌ నెస్‌ లో మెరుగ్గా ఉండే కోహ్లి.. కొన్ని బలహీనతతో ఇబ్బంది పడుతున్నాడని.. వాటిని అధిగమిస్తే మాత్రం అతడికి తిరుగుండదని దీప్ దాస్ వివరించాడు.

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అయిన దీప్ దాస్ గుప్తా చివరకు చెప్పొచ్చేది ఏమంటే.. రోహిత్ కంటే కోహ్లి కెరీర్ ఇంకా మిగిలి ఉందని.

Tags:    

Similar News