ఆల్ టైం రికార్డ్ బద్దలు కొట్టిన రోహిత్... గంగూలీ, సచిన్ తోకలిపి 7 రికార్డులు ఫట్!
అవును... తాజాగా నెదర్లాండ్స్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీం ఇండియా 160 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ లో లీగ్ దశలో టీం ఇండియా ఆడుకుంటూ పోతుంది. ప్రత్యర్ధి ఎవరనేది ఏమాత్రం పట్టింపులేకుండా.. చిన్న టీం పెద్ద టీం అనే తారతమ్యాలేమీ లేకుండా దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ఆడిన 9 మ్యాచ్ ల్లోనూ గెలిచి లీగ్ దశలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టుగా నిలిచింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో నిలిచింది. సెమీస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది! ఈ క్రమంలో తాజాగా జరిగిన నెదర్లాండ్స్ మ్యాచ్ లో 7 రికార్డులు బ్రేక్ చేసింది.
అవును... తాజాగా నెదర్లాండ్స్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీం ఇండియా 160 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 410/4 భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్ లో ఐదుగురు భారత బ్యాటర్లు వరుసగా అర్ధ సెంచరీలు చేయడం విశేషం. ఆ తర్వాత ఛేదనలో తడబడిన నెదర్లాండ్స్ 250 పరుగులకే ఆలౌటైంది.
ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 7 రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో భాగంగా... మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ 9 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ ఇప్పటివరకు 503 పరుగులు చేశాడు. దీంతో ఒక వన్డే ప్రపంచకప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ గా నిలిచాడు. ఫలితంగా... 2003 ప్రపంచకప్ లో 465 పరుగులు చేసిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు.
ఇదే సమయంలో సచిన్ రికార్డునూ సమం చేశాడు రోహిత్. రెండు ప్రపంచ కప్ ఎడిషన్ లో 500కు పైగా పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ తో కలిసి మొదటి స్థానంలో ఉన్నాడు. సచిన్ 1996, 2003 ఎడిషన్ లలో 500కు పైగా పరుగులు సాధించాడు. ఇదె క్రమంలో రోహిత్ 2019 ప్రపంచకప్ లో 500కు పైగా పరుగులు సాధించాడు. తాజా వరల్డ్ కప్ లోనూ అదే పని చేశాడు!
ఇదే క్రమంలో సిక్సుల విషయంలోనూ హిట్ మ్యాన్ రికార్డ్ సాధించాడు. ఇందులో భాగంగా... ఈ ప్రపంచకప్ లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 24 సిక్సులు కొట్టాడు. దీంతో ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సిక్సులు కొట్టిన కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు సుమా... వన్డే ఫార్మాట్ లో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సులు (60) కొట్టిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. దీంతో 2015లో ఏబీ డివిల్లియర్స్ రికార్డు (58) ను బ్రేక్ చేశాడు.
అదేవిధంగా... వన్డేల్లో కెప్టెన్ గా 100 ఫోర్లను రోహిత్ శర్మ పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకూ 104 ఫోర్లు బాదాడు. ఇదే క్రమంలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్ గా రోహిత్ శర్మ 14 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ విధంగా ఈ వరల్డ్ కప్ లీగ్ తో ఇచ్చిన బెస్ట్ ఫెర్మార్మెన్స్ తో పలు రికార్డులు క్రియేట్ చేశాడు రో"హిట్ మ్యాన్"!