సచిన్‌ రికార్డు బద్దలు.. కింగ్‌ కోహ్లీ 50వ సెంచరీ!

సచిన్‌ 452 ఇన్నింగ్స్‌ ల్లో 49 సెంచరీలు సాధిస్తే విరాట్‌ 279 ఇన్నింగ్స్‌ ల్లోనే 50 సెంచరీలు సాధించాడు.

Update: 2023-11-15 12:14 GMT

రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ మరోసారి రికార్డుల దుమ్ము దులిపాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్సమన్‌ గా చరిత్ర సృష్టించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్‌ లో న్యూజిలాండ్‌ పై విరాట్‌ 50వ సెంచరీ సాధించాడు. తద్వారా సచిన్‌ టెండూల్కర్‌ 49 సెంచరీల రికార్డు బద్దలైంది. సచిన్‌ 452 ఇన్నింగ్స్‌ ల్లో 49 సెంచరీలు సాధిస్తే విరాట్‌ 279 ఇన్నింగ్స్‌ ల్లోనే 50 సెంచరీలు సాధించాడు. తద్వారా 50 సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌ గా అవతరించాడు.

న్యూజిలాండ్‌ తో సెమీ ఫైనల్లో విరాట్‌ 106 బంతుల్లో శతకాన్ని సాధించాడు. లీగ్‌ దశలో దక్షిణాఫ్రికాపై విరాట్‌ తన 49వ సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే. అది కూడా తన పుట్టిన రోజు నాడు తనకిష్టమైన కోల్‌ కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో చేశాడు. విరాట్‌ మొత్తం తన వన్డే కెరీర్‌ లో 291 మ్యాచుల్లో 13,774 పరుగులు చేశాడు. మొత్తం 50 సెంచరీలు, 72 అర్ధ సెంచరీలు సాధించాడు.

కింగ్‌ కోహ్లీ శివమెత్తడంతో భారత్‌ భారీ స్కోరు దిశగా సాగిపోతోంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, గిల్‌ లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్‌ 47 పరుగులు, గిల్‌ 79 పరుగులు చేశారు. గిల్‌ రిటైర్డ్‌ హర్ట్‌ గా వెనుదిరిగాడు. కడపటి వార్తలందేసరికి 46.3 ఓవర్లలో భారత్‌ 1 వికెట్‌ నష్టానికి 352 పరుగులు చేసింది. ఓవైపు విరాట్, మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ న్యూజిలాండ్‌ బౌలర్ల భరతం పట్టారు. విరాట్‌ 113 బంతుల్లో 117 పరుగులు చేసి ఔటయ్యాడు.

కాగా ఇదే మ్యాచులో విరాట్‌ మరో రెండు రికార్డులు బద్దలు కొట్టాడు. ఒక వరల్డ్‌ కప్‌ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్సమన్‌ గా సచిన్‌ టెండ్కూలర్‌ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్‌ చేశాడు. సచిన్‌ 2003 వరల్డ్‌ కప్‌ లో 673 పరుగులు చేయగా దాన్ని విరాట్‌ బద్దలు కొట్టాడు.

అలాగే ఒక వరల్డ్‌ కప్‌ లో వరుసగా 50కి పైగా పరుగులు సచిన్‌ ఏడుసార్లు చేయగా ఆ రికార్డును కూడా విరాట్‌ బ్రేక్‌ చేశాడు. విరాట్‌ కోహ్లీ న్యూజిలాండ్‌ తో సెమీ ఫైనల్‌ లో వరుసగా 50కి పైగా స్కోర్లను 8 సార్లు చేశాడు. దీంతో సచిన్‌ రికార్డు బద్దలయింది.

Tags:    

Similar News