వీడియో... కేఎల్ రాహుల్ - లక్నో ఓనర్ మధ్య అసలేం జరిగింది..?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక పక్క ఎలక్షన్ ఫీవర్ తో పాటు మరోపక్క ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక పక్క ఎలక్షన్ ఫీవర్ తో పాటు మరోపక్క ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రకరకాల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సరికొత్త రికార్డులు నెలకొల్పబడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ - లక్నో సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన ఒక పరిణామం చోటు చేసుకుంది.
అవును... ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా... బుధవారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ కింగ్స్ బాగా ఇబ్బంది పడింది. ఫలితంగా... నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులే చేసింది. లక్నో బ్యాటర్స్ లో కెప్టెన్ కేఎల్ రాహుల్ 33 బంతుల్లో 29 పరుగులు చేశాడు. పూరన్ నాటౌట్ 48, బదోని నాటౌట్ 55 పరుగులతో ఆదుకున్నారు.
ఇక ఛేజింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఓపెనర్లు వికెట్ పోకుండానే టార్గెట్ ఫినీష్ చేశారు. కేవలం 9.4 ఓవర్లలోనే 167 పరుగులు చేశారు. సన్ రైజర్స్ ఓపెనర్లలో ట్రావిస్ హెడ్ (89 నాటౌట్: 30 బంతుల్లో 8×4, 8×6).. అభిషేక్ శర్మ (75 నాటౌట్: 28 బంతుల్లో 8×4, 6×6) ఉప్పెనలా విరుచుకుపడిపోయారు. బంతి పడటం ఆలస్యం.. బౌండరీ లైన్స్ వైపే అటు ప్రేక్షకుల చూపు, ఇటు కెమెరాల కళ్లు అప్రయత్నంగా తిరిగిపోయేవి.
ఇలా వరుసగా రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన లక్నో.. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో మైనస్ నెట్ రన్ రేట్ తో లక్నో సూపర్ కింగ్స్ 6వ స్థానంలో ఉంది. ఈ సమయంలో ఆ జట్టు యజమానికి - కెప్టెన్ కేఎల్ రాహుల్ కి మధ్య ఒక చర్చ జరిగినట్లుగా ఒక వీడియో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియోలో... మ్యాచ్ అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్ పై లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లు.. ఈ సమయంలో రాహుల్ సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు! మరోపక్క... ఇది ఏఐ కాలం అని చెబుతూ.. యానిమేటెడ్ వీడియో అనే వెర్షన్ కూడా వినిపిస్తుంది!
అయితే... ఈ వీడియోకి చూసిన పలువురు నెటిజన్లు మాత్రం లిప్ రీడింగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కెప్టెన్ పై యజమాని నిప్పులు చెరుగుతున్నారని అంటున్నారు! అయితే అసలు అక్కడ వారిద్దరి మధ్యా ఏ విషయంపై చర్చ జరిగింది.. కనిపిస్తున్న, వినిపిస్తున్న విషయాల్లో వాస్తవ శాతం ఎంతనేది తెలియాలంటే... ఆ ఇద్దరిలో ఒకరైనా స్పందించాలి.. అప్పటివరకూ ఎవరి క్రియేటివిటీ వారిది!!