గంభీర్ పై అఫ్రిదీ కీలక వ్యాఖ్యలు... ఫైనల్ గా పొగడ్తలు!
గంభీర్ మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడనే విషయం తెలిసిందే. ముఖ్యంగా పాక్ తో మ్యాచ్ అంటే ఫైర్ ఫైర్ అంటుంటాడు!
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ గురించి క్రికెట్ తో పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సెహ్వాగ్ తో కలిసి ఓపెనింగ్ కి దిగిన సమయంలో వీరి ఫెర్మార్మెన్స్ అద్భుతమనే చెప్పాలి. అయితే గంభీర్ మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడనే విషయం తెలిసిందే. ముఖ్యంగా పాక్ తో మ్యాచ్ అంటే ఫైర్ ఫైర్ అంటుంటాడు!
ఆ క్రమంలో చాలా మంది క్రీడాకారులతో ఫైట్ కి దిగాడు! అందులో ముఖ్యంగా పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రీది తో గొడవకు దిగిన వీడియో ఇప్పటికీ వైరల్ అవుతుంటుంది. ఈ సమయంలో గౌతం గంభీర్ పై షాహిద్ అఫ్రిది స్పందించారు. ఈ సందర్భంగా గంభీర్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు.
అవును... టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ను ఉద్దేశించి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ కాస్త తేడా అని.. అతని వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుందని అన్నాడు. అతను ఇప్పటికీ మారలేదని తెలిపాడు. దీనికి ఉదాహరణగా... ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా విరాట్ కోహ్లీతో జరిగిన గొడవను గుర్తుచేశాడు!
ఈ సమయంలో తాను తన ఒక్కడితో మాత్రమే గొడవలు పడలేదని తెలిపిన అఫ్రిదీ... చాలా మందితో గంభీర్ వాగ్వాదానికి దిగాడని అన్నారు. అయితే ఇప్పుడు గంభీర్ గొడవల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. ఇలా అప్పటివరకూ గంభీర్ కోపంపై మాట్లాడిన అఫ్రిది... అనంతరం గంభీర్ ఆట గురించి స్పందించాడు.
అతని వ్యక్తిత్వం ఎలా ఉన్నా గౌతం గంభీర్ చాలా అద్భుతమైన ఆటగాడు.. అతని బ్యాటింగ్ టైమింగ్ చూడముచ్చటగా ఉంటుంది.. అతని బ్యాటింగ్ ను తాను ఎంతగానో ఆస్వాదిస్తాను.. టీమిండియాలో చాలా తక్కువ మందికి గంభీర్ లాంటి బ్యాటింగ్ టైమింగ్ ఉంటుంది.. అని అఫ్రిది కొనియాడాడు.
కాగా... టీమిండియా తరుపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచులు ఆడిన గౌతం గంభీర్.. మూడు ఫార్మాట్లలో కలిపి 20 సెంచరీలతో 10 వేలకు పైగా పరుగులు చేశాడు. రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం రాజకీయాల్లోకి వెళ్లిన గంభీర్.. బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు.