ఓరి ‘‘నరైనో’’.. నీ విలువ మామూలుది కాదు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2012లో ఆ జట్టు ఫైనల్ చేరింది.. కప్ కూడా కొట్టింది.

Update: 2024-05-27 10:30 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2012లో ఆ జట్టు ఫైనల్ చేరింది.. కప్ కూడా కొట్టింది. అప్పట్లో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచింది అతడే..

2018లో ఆ జట్టు ఫైనల్స్ కు చేరినా.. కప్ కొట్టడంలో విఫలమైంది. కానీ, ఆ సీజన్ లో అతడు చెలరేగాడు. అటు బంతితో, ఇటు బ్యాట్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

2024లోనూ ఆ జట్టు ఫైనల్ చేరింది. ఈసారి టైటిల్ సాధించింది. ఇందులోనూ అతడు అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు. మరోసారి బంతి, బ్యాట్ తో మాయ చేశాడు. అతడే కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ సునీల్‌ నరైన్‌.

ఈ ఐపీఎల్ సీజన్ లో నరైన్ ఫామ్ మామూలుగా లేదు. బ్యాట్ తో 488 పరుగులు చేసిన అతడు బంతితో 17 వికెట్లు పడగొట్టాడు. ఓ సెంచరీ కూడా కొట్టాడు. మెరుపు ఇన్నింగ్స్ లు సరేసరి. వాస్తవానికి 36 ఏళ్ల నరైన్ కొన్నాళ్లుగా సరిగా ఫామ్ లో లేడు. ఐపీఎల్ లో తప్ప అతడిని ఎక్కడా బ్యాట్స్ మన్ గా చూడరు. దీంతోపాటు ఐపీఎల్ లో కొన్ని సీజన్లుగా నరైన్ రాణించడం లేదు. ఈసారి కూడా ఏం ఆడతాడులే అనుకుంటే.. చెలరేగిపోయాడు.

గుర్తించింది గంభీర్

నరైన్ వెస్టిండీస్ జాతీయ జట్టుకూ ఆడడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 17 లీగ్ లలో ఆడే నరైన్.. వెస్టిండీస్ తరఫున 2019లోనే చివరి టి20 ఆడాడు. టెస్టుల్లో 2013 నుంచి, వన్డేల్లో 2016 నుంచి వెస్టిండీస్ కు ప్రాతినిధ్యం వహించడం లేదు. అలాంటి నరైన్ ను 2012 ఐపీఎల్ సీజన్ లో కోల్ కతా అప్పటి కెప్టెన్ గంభీర్ అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. 2018 సీజన్ లో అయితే గంభీర్ ఏకంగా నరైన్ ను ఓపెనర్ గా పంపి సంచలనం రేపాడు. కానీ, గంభీర్ కోల్ కతా నుంచి తప్పుకొన్నాక నరైన్ కు ప్రాధాన్యం తగ్గింది. అయితే, ఈ సీజన్ లో గంభీర్ కోల్ కతాకు మెంటార్ గా రావడంతో నరైన్ కు ప్రాధాన్యం పెరిగింది. మరోసారి ఓపెనర్ గా వచ్చిన అతడు దాదాపు 500 పరుగులు చేశాడు.

ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు

కోల్ కతా తొలిసారి చాంపియన్ గా నిలిచిన 2012లో నరైన్ బౌలర్ గా మాత్రమే సేవలందించాడు. మిస్టరీ స్పిన్నర్ గా అతడు వెలుగులోకి వచ్చింది అప్పుడే. ఆ సీజన్ లో 24 వికెట్లు పడగొట్టాడు. ఇక 2018లో ఓపెనర్ అవతారం ఎత్తి 357 పరుగులతో పాటు 17 వికెట్లు తీశాడు. ఇప్పుడు 488 పరుగులు, 17 వికెట్లతో మూడోసారి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా నిలిచాడు. ఐపీఎల్ లో ఈ ఘనత అందుకున్న తొలి క్రికెటర్ అతడే కావడం విశేషం.

కొసమెరుపు: నరైన్ ను వెస్టిండీస్ తరఫున టి20 ప్రపంచ కప్ ఆడాలని అతడి కోల్ కతా సహచరుడు, ఒకప్పుడు వెస్టిండీస్ కూ ఆడిన ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ కోరాడు. కానీ, నరైన్ మాత్రం ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదు.

Tags:    

Similar News