అమెరికానా? జింబాబ్వేనా? క్రికెట్ మ్యాచ్ ఫీజు రూ.20 వేలే..
అమెరికా అంటే కలల దేశం.. ప్రపంచమంతా డామినేషన్ సాగించే డాలర్ రాజ్యం.. ఎక్కడెక్కడినుంచో అమెరికా వెళ్తూ తమ కలలను నెరవేర్చుకుంటూ ఉంటారు యువత
అమెరికా అంటే కలల దేశం.. ప్రపంచమంతా డామినేషన్ సాగించే డాలర్ రాజ్యం.. ఎక్కడెక్కడినుంచో అమెరికా వెళ్తూ తమ కలలను నెరవేర్చుకుంటూ ఉంటారు యువత. అసలు ఆ గడ్డపై కాలుపెట్టడమే తమ లక్ష్యంగా కొన్ని కోట్ల మంది జీవిస్తుంటారు. అలాంటి అమెరికాలో ఇప్పటివరకు క్రికెట్ ఫీవర్ పెద్దగా లేదు. బాస్కెట్ బాల్, బేస్ బాల్, ఆఖరికి ఫుట్ బాల్ క్రేజ్ ఉన్నప్పటికీ క్రికెట్ మోజు మాత్రం ఏర్పడలేదు. అలాంటిచోట ఇప్పుడిప్పుడే క్రికెట్ పై ఆసక్తి కలుగుతోంది.
పాక్ ను ఓడించి పెను సంచలనం
అమెరికా పక్కనున్న కెనడా, ఆఖరికి నెదర్లాండ్స్ కూడా ప్రపంచ కప్ లు ఆడాయి కానీ, అగ్రరాజ్యం మాత్రం ఇప్పటివరకు ఒక్క ప్రపంచ కప్ లోనూ పాల్గొనలేదు. అలాంటి దేశం సొంతగడ్డపై ఈసారి టి20 ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇస్తోంది. కరీబియన్ దీవులతో కలిసి ప్రపంచ కప్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ లో మాజీ చాంపియన్ పాకిస్థాన్ ను అమెరికా ఓడించి పెను సంచలనం రేపింది.
ఆరుగురు భారత సంతతి వారే
అమెరికా క్రికెట్ జట్టులో ఆరుగురు భారత సంతతి ఆటగాళ్లే కావడం గమనార్హం. కొందరు పాకిస్థాన్ వారూ ఉన్నారు. కాగా, తన కనుసైగలతో ప్రపంచాన్ని శాసించే అమెరికా క్రికెట్ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఎంతో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. మ్యాచ్ కు ఒక్కొక్క ఆటగాడికి వచ్చేది రూ.20 వేలు మాత్రమే. వాస్తవానికి ప్రపంచంలో ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉండే దేశం జింబాబ్వే. అలాంటి దేశ ఆటగాళ్లకూ ఇంత తక్కువ మ్యాచ్ ఫీజు ఉండదేమో?
టీమిండియా క్రికెటర్లతో పోలిస్తే..
టీమిండియా క్రికెటర్లకు ఏడాదికి గ్రేడ్ ను బట్టి రూ.7 కోట్ల నుంచి రూ.కోటి వరకు కాంట్రాక్టు ఉంది. ఇక మ్యాచ్ ఫీజులు వేరే. టి20ల్లో అయితే మ్యాచ్ ఫీజు రూ.3 లక్షలు. అంటే.. అమెరికా క్రికెటర్ మ్యాచ్ ఫీజుకు 15 రెట్లు అన్నమాట.