ఐపీఎల్.. ప్రపంచ "కప్పులో ముంచుతుందా? తేల్చుతుందా"?

ఐపీఎల్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పది మ్యాచ్ లలో చేసింది 260 పరుగులే.

Update: 2024-05-08 15:30 GMT

వరుసగా రెండుసార్లు టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ లో పరాజయం.. టి20 ప్రపంచ కప్ లలో సెమీస్ నుంచే ఔట్.. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ తుది మెట్టుపై బోల్తా.. అసలు క్రికెట్ లో ఏ ఫార్మాట్ లోనైనా ప్రపంచ విజేతగా నిలిచి 13 ఏళ్లు దాటిపోయింది. ఈ మధ్యలో ముగ్గురు కెప్టెన్లు మారారు. మరికొందరు తాత్కాలికంగా కెప్టెన్లూ అయ్యారు. కానీ, టీమిండియా మాత్రం చాంపియన్ గా నిలవడం లేదు. సరిగ్గా చెప్పాలంటే 2013 చాంపియన్స్ ట్రోఫీ అనంతరం మనకు చెప్పుకోదగ్గ ప్రపంచ టైటిలే లేదు. పది ఐపీఎల్ సీజన్లు కూడా అయిపోయాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టాప్ బ్యాటర్లు అయ్యారు. కానీ, ప్రపంచ కప్ ఎక్కడ? అలాంటి సమయంలో ఇప్పుడు టి20 ప్రపంచ కప్ వచ్చేస్తోంది. సరిగ్గా 22 రోజుల్లో కరీబియన్ దీవులు, అమెరికా వేదికగా మెగా టోర్నీ జరగనుంది. అయితే, దీనికిముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తీరిక లేకుండా ఆడుతున్నారు భారత క్రికెటర్లు. మరి ఇది.. మంచి చేస్తుందా? ప్రపంచ కప్ లో ముంచేస్తుందా?

అటు సిరీస్ లు.. ఇటు మెగా లీగ్

నవంబరు 19 వరకు వన్డే ప్రపంచ కప్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టి20 సిరీస్.. వెంటనే ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సుదీర్ఘ సమరం.. ఆపై కొన్ని రోజులకే ఐపీఎల్.. ఇటునుంచి ఇటే టి20 ప్రపంచ కప్ నకు. ఇదీ టీమిండియా క్రికెటర్ల ఇటీవలి, భవిష్యత్ షెడ్యూల్. దాదాపు ఐపీఎల్ లో ప్రదర్శన ఆధారంగానే టీ20 ప్రపంచ కప్ టీమ్ ను ఎంపిక చేశారని చెప్పొచ్చు. అయితే, ఇదే లీగ్ ప్రభావం ప్రపంచ కప్ సాధనపై పడుతుందా? అనే అనుమానాలు వస్తున్నాయి.

కెప్టెన్ ఫ్లాప్.. గాయాలు హిట్

ఐపీఎల్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పది మ్యాచ్ లలో చేసింది 260 పరుగులే. రోహిత్ స్థాయికి ఏమాత్రం తగని ప్రదర్శన ఇది. కోహ్లి నిలకడగానే ఆడుతున్నా.. అతడి టి20 స్ట్రయిక్ రేట్ మీద ఎప్పుడూ విమర్శలే. వీరిద్దరూ దిగ్గజ బ్యాటర్లు అనడంలో సందేహం లేదు. కానీ, 35 ఏళ్లు దాటారు. ఏడాది కిందట పొట్టి ఫార్మాట్ కు పక్కనపెట్టి మళ్లీ ఇప్పుడు ఎంపిక చేశారు. ఇక ఆటగాళ్ల గాయాల సంగతి అందరికీ తెలిసిందే. ఫిట్ నెస్ సమస్యలు ప్రతి ఒక్కరికీ ఉండేవే అయినా.. అవి మరీ జట్టుకు దూరమయ్యేలా చేస్తేనే ప్రమాదం.

లీగ్ నుంచి ప్రపంచ కప్ నకు..

జూన్ 2న టి20 ప్రపంచ కప్ మొదలవనుంది. దీనికి వారం ముందు ఐపీఎల్ పూర్తవుతుంది. కోహ్లి, రోహిత్, జైశ్వాల్, సూర్యకుమార్, జడేజా సహా అందరూ 50 రోజుల ఇందులో పాల్గొంటున్నారు. అంటే విశ్రాంతి పెద్దగా లేకుండానే మెగా సమరానికి వెళ్తున్నారు. గాయంతో స్టార్ పేసర్ బుమ్రా ఏడాది పాటు జట్టుకు దూరమయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏడాది అందుబాటులో లేడు. వీరిద్దరూ ఇప్పుడు ప్రపంచ కప్ లో ఆడనున్నారు. బుమ్రా 2022 టి20 మెగా టోర్నీ ఆడలేదు. దీంతో షమీ, భువనేశ్వర్ లను నమ్ముకోవాల్సి వచ్చింది. వన్డే ప్రపంచ కప్ నకు ముందు జట్టులోకి తిరిగొచ్చాక బుమ్రా మూడు ఫార్మాట్లు ఆడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లోనూ అన్ని మ్యాచ్ లూ ఆడుతున్నాడు. ముంబై ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు లేకున్నా బుమ్రాను మాత్రం తుది జట్టులో కొనసాగిస్తూనే ఉన్నారు. అతడికి రెస్ట్ ఇవ్వడంపై చర్చే జరగలేదని ముంబై బ్యాటింగ్‌ కోచ్‌ పొలార్డ్‌ చెబుతున్నాడు.

వైస్ కెప్టెన్ అట్టర్ ఫ్లాప్

నిరుటి వరకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా విజయవంతమైన హార్దిక్ పాండ్యా ఈ ఏడాది ముంబై బాధ్యతలు తీసుకున్నాడు. కానీ, అతడు కెప్టెన్ గా, ఆటగాడిగా సూపర్ ఫ్లాప్. వన్డే ప్రపంచ కప్ నుంచి గాయంతో వైదొలగిన పాండ్యా మళ్లీ ఐపీఎల్ తోనే మైదానంలోకి వచ్చాడు. బ్యాటింగ్ పక్కనపెడితే ఫిట్ నెస్ ఇబ్బందుల్లోనూ

బౌలింగ్‌ చేస్తున్నాడు. హార్డ్ హిట్టర్ సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం లీగ్ కు ముందు గాయపడ్డాడు. ఐపీఎల్ మొదటి మ్యాచ్ లలో ఆడలేదు. పంత్ సంగతి కూడా ఇంతే.

ఇంత ఒత్తిడి అవసరమా?

జైశ్వాల్, కోహ్లి, రోహిత్, జడేజా, బుమ్రా, సిరాజ్, అక్షర్ పటేల్ వీరంతా మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నారు. పంత్, సూర్య, హార్దిక్ గాయాల నుంచి కోలుకుని వచ్చినవారు. ఇలాంటప్పుడు

తీవ్ర ఒత్తిడితో కూడిన ఐపీఎల్‌ లో వరుసగా మ్యాచ్‌ లు ఆడుతూ.. ప్రయాణాలు చేస్తూ అలిసిపోయి.. ఐపీఎల్ పూర్తయిన వారం రోజులకే వెస్టిండీస్‌-అమెరికాకు వెళ్లి టి20 ప్రపంచ కప్ లో పాల్గొననున్నారు. అయితే, ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్ ముంగిట ఇంత ఒత్తిడి అవసరమా? అనేది ప్రశ్న.

కొసమెరుపు: ఐపీఎల్ టీమిండియా ఆటగాళ్లకు చెడు చేస్తుందని చెప్పలేం. టి20లే కాబట్టి ఈ టచ్ ప్రపంచ కప్ నకూ పనికిరావొచ్చు. లేదా మొత్తానికే దెబ్బపడొచ్చు. చూద్దాం.. ఏం జరుగుతుందో? ముంచినా తేల్చినా ఐపీఎల్ దే భారం.

Tags:    

Similar News