ఆసియా జట్టులోకి తి'లక్'.. రాహుల్, అయ్యర్ కూడా
ప్రపంచ కప్ ప్రతిష్ఠాత్మక టోర్నీ ముంగిట ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరుగుతుంది. ఇక్కడ ఫామ్ చాటితే ప్రపంచ కప్ నకు ఎంపికవడం ఖాయం.
లక్ అంటే తి"లక్" వర్మదే. ఈ హైదరాబాదీ కుర్రాడి టైం నడుస్తోంది. కేవలం ఐదు మ్యాచ్ ల టి20ల అనుభవంతో వన్డే జట్టులోకి వచ్చేశాడు. అదికూడా ప్రపంచ కప్ నకు ముందు సన్నాహంగా భావిస్తున్న ఆసియా కప్ నకు ఎంపికయ్యాడు. ఈ నెల 30 నుంచి మొదలయ్యే ఈ కప్ నకు 17 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. శ్రీలంక, పాకిస్థాన్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అంతేగాక.. ప్రపంచ కప్ ప్రతిష్ఠాత్మక టోర్నీ ముంగిట ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరుగుతుంది. ఇక్కడ ఫామ్ చాటితే ప్రపంచ కప్ నకు ఎంపికవడం ఖాయం.
అదనంగా మరో ఆటగాడు..
ఆసియా కప్ నకు మొత్తం 17 మంది ఆటగాళ్లను బీసీసీఐ ప్రకటించి.. మరో ఆటగాడిని అదనంగా చేర్చింది. గాయాలతో
సుదీర్ఘ కాలంగా జట్టుకు దూరమైన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ లకు తిరిగి చోటు దక్కింది. ప్రతిభకు తోడు అనుభవం, గత జట్టులో ఉన్నవారు కావడంతో ఫిట్ నెస్ సాధించగానే నేరుగా ఎంపికకు పరిగణనలోకి తీసుకున్నారు. అయితే, ఆశ్చర్యం అంటే తెలుగు కుర్రాడు తిలక్ ఎంపికనే. కాగా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సారథ్యంలోని కమిటీ నిర్వహించిన సమావేశంలో ఈసారి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొన్నారు.
బుమ్రా, ప్రసిద్ధ్ కూడా
ప్రస్తుతం ఐర్లాండ్ తో మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ కు కెప్టెన్ అయిన బుమ్రాతో పాటు మరో పేసర్ ప్రసిద్ధ్ క్రిష్ణను కూడా ఆసియా కప్ జట్టులోకి తీసుకున్నారు. కాగా, వైస్ కెప్టెన్ బుమ్రానా? ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యానా? అన్న మీమాంసకు తెరదించుతూ.. హార్దిక్‌కే సెలక్టర్లు ఓటేశారు. అంటే ప్రపంచ కప్ నకూ హార్దిక్ సారథిగా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. కాగా, వచ్చే నెల 17 వరకు ఆసియా కప్ జరుగుతుంది. వచ్చే నెల పాకిస్థాన్ తో టీమిండియా తొలి మ్యాచ్ లో తలపడుతుంది. 4న నేపాల్ తో తొలిసారి ఆడుతుంది. ఈ మ్యాచ్ లు శ్రీలంకలోని పల్లెకెలెలో జరుగుతాయి. 6వ తేదీ నుంచి సూపర్ 4 మ్యాచ్ లు నిర్వహిస్తారు.
చాహల్ లేనట్టే?
మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కు ఆసియా కప్ జట్టులో చోటు దొరకలేదు. దీని అర్థం అతడు ప్రపంచ కప్ ప్రణాళికల్లో లేడని తెలుస్తోంది. వెస్టిండీస్ సిరీస్ లో భాగమైన చాహల్ వాస్తవానికి ప్రస్తుతం చక్కగా రాణిస్తున్నాడు. కానీ, అతడికి పోటీ ఎక్కువగా ఉంది. కుల్దీప్, జడేజా, అక్షర్ వంటి స్పిన్నర్ల కారణంగా చాహల్ కు స్థానం దక్కలేదు.
ఇదీ జట్టు..
రోహిత్ , కోహ్లి, గిల్, అయ్యర్, తిలక్, రాహుల్, ఇషాన్ కిషన్, పాండ్య, సూర్యకుమార్ యాదవ్ , జడేజా, శార్దూల్, కుల్దీప్, బుమ్రా, షమీ, సిరాజ్, ప్రసిద్ధ్, అక్షర్ పటేల్. కాగా, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ స్టాండ్ బై ఆటగాడిగా ఉండనున్నాడు.