బ్యాగీ గ్రీన్ టోపీ.. అందుకే అంత ప్రత్యేకం
అంతేకాదు.. ఏ ఆ జట్టును ఓడించిన జట్టుకు దేశాలకు అతీతంగా ప్రజలు అభిమానులవుతారు.
క్రికెట్ చాలా దేశాలు ఆడతాయి.. ఇంకా చాలా దేశాలు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయంగా ఎదుగుతున్నాయి.. కానీ, ఆ ఒక్క దేశం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే.. ఫుట్ బాల్ లో బ్రెజిల్ లా.. ఒలింపిక్స్ లో అమెరికాలా.. బ్యాడ్మింటన్ లో ఇండోనేసియాలా.. క్రికెట్ లో ఆ దేశానిదే ఆధిపత్యం. అంతేకాదు.. ఏ ఆ జట్టును ఓడించిన జట్టుకు దేశాలకు అతీతంగా ప్రజలు అభిమానులవుతారు. అలాంటి దేశ జట్టు ఆటగాడికి అరంగేట్రం సమయంలో ఇచ్చే ‘బ్యాగీ గ్రీన్ టోపీ’ అత్యంత ప్రత్యేకం. అసలు అలాంటి క్షణం కోసమే వేలమంది క్రికెటర్లు ఎదురుచూస్తారనడంలో సందేహమే లేదు.
ఆ టోపీతోనే కాదు.. మన దేశంతోనూ
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ టెస్టు, వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నాడు. బుధవారం నుంచి సొంత మైదానం సిడ్నీ వేదికగా పాకిస్థాన్ తో ఆడే మూడో టెస్టు అతడికి చివరిది కానుంది. అంటే ఆస్ట్రేలియా తరఫున సంప్రదాయ క్రికెట్ లో మరిక వార్నర్ కనిపించడు. వన్డేల్లో కొనసాగుతాడని భావించినా దానికీ వీడ్కోలు చెప్పేశాడు. ఈ నేపథ్యంలో చివరిసారిగా ఆస్ట్రేలియా టెస్టు క్యాప్ (బ్యాగీ గ్రీన్ క్యాప్)ను ధరించి చివరిసారిగా టెస్టు ఆడాలని భావోద్వేగంతో ఎదురుచూస్తున్న అతడికి అనూహ్య పరిస్థితి ఎదురైంది. డేవిడ్ వార్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ద్వారా భారతీయులందరికీ చాలా దగ్గరైన సంగతి తెలిసిందే.
దయచేసి నా టోపీ తిరిగివ్వండి
ఆస్ట్రేలియన్ క్రికెటర్ల జీవితంలో భాగమై ఉంటుంది బ్యాగీ గ్రీన్ టోపీ. సాధారణ ఆటగాళ్లకు దక్కని గౌరవంగా దీనిని వారు భావిస్తుంటారు. అలాంటి టోపీని మెల్‌బోర్న్ నుంచి సిడ్నీ వచ్చే క్రమంలో పోగొట్టుకున్నాడు వార్నర్. లగేజ్ నుంచి తన బ్యాక్ ప్యాక్ ను ఎవరో తీసుకున్నారని.. అందులో తన పిల్లల వస్తువులు ఉన్నాయని అన్నిటికంటే ముఖ్యంగా బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా ఉందని చెప్పుకొచ్చాడు. సెంటిమెంట్ గా భావించే ఆ బ్యాగీ గ్రీన్ టోపీని ధరించి చివరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. కావాలని ఎవరైనా బ్యాక్ ప్యాక్ తీసుకుంటే వారికి మరోటి ఇస్తానని తమను ఇబ్బందిపెట్టొద్దని కోరాడు. ఎయిర్ పోర్ట్, హోటల్ సిబ్బందిని అడిగినా.. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించినా బ్యాక్ ప్యాక్ జాడ దొరకలేదని తెలిపాడు. దయచేసి నా బ్యాగీ గ్రీన్ క్యాప్ తిరిగి ఇస్తే ఎంతో ఆనందిస్తానని వార్నర్ విజ్ఞప్తి చేశాడు.