తిలక్.. టి20ల్లో సెంచరీ కొట్టిన తొలి తెలుగోడు..అత్యంత చిన్న వయసులో

టి20ల్లో సెంచరీ చేసిన తొలి తెలుగు రాష్ట్రాల బ్యాట్స్ మన్ గా రికార్డులకు ఎక్కాడు.

Update: 2024-11-14 07:27 GMT

తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు ఎందరో క్రికెటర్లు భారత జట్టుకు ఆడారు. మొహమ్మద్ అజహరుద్దీన్ వంటి బ్యాట్స్ మన్ పదేళ్లు కెప్టెన్ గానూ చేశాడు. వీవీఎస్ లక్ష్మణ్ టెస్టు స్పెషలిస్ట్ గా గొప్ప పేరు సంపాదించాడు.. అంబటి రాయుడు ప్రతిభావంతుడైన క్రికెటర్ గా మనన్నలు పొందాడు. హనుమ విహారి కూడా మంచి క్రికెటర్ గా నిలిచాడు. అయితే, వీరంతా ఆధునిక క్రికెట్ అయిన టి20 ఫార్మాట్ లో లేరు. రాయుడు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున దుమ్మురేపినా.. అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది తక్కువే. కానీ, వీరిని మించి పేరు తెచ్చుకునేలా కనిపిస్తున్నాడు హైదరాబాదీ బ్యాటర్.

అత్యంత చిన్న వయసులో

దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు తిలక్ వర్మ. ఈ మ్యాచ్ లో అతడి ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తిలక్ గనుక లేకుంటే భారత్ ఓడిపోయేదే. సెంచరీ (107)తో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ కుర్రాడు.. టి20ల్లో సెంచరీ చేసిన తొలి తెలుగు రాష్ట్రాల బ్యాట్స్ మన్ గా రికార్డులకు ఎక్కాడు. అయితే, ఇంకో రికార్డును కూడా అతడు తన ఖాతాలో వేసుకున్నాడు. అదేమంటే.. అత్యంత చిన్న వయసులో టి20 సెంచరీ సాధించిన భారత క్రికెటర్. బుధవారం 22 ఏళ్ల 5 రోజుల వయసులో తిలక్ సెంచరీ కొట్టాడు.

అడిగి మరీ వెళ్లాడట..

వాస్తవానికి దక్షిణాఫ్రికా సిరీస్ లో భారత్ తరఫున అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా దిగుతున్నారు. వన్ డౌన్ లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వస్తున్నాడు. మూడో టి20లో మాత్రం సూర్య స్థానంలో తిలక్ వచ్చాడు. అయితే, తిలక్ అడిగి మరీ ఈ స్థానంలో బ్యాటింగ్ వెళ్లినట్లు తెలుస్తోంది. రెండో టీ20లో ఓటమి తర్వాత గెబేరాలో తిలక్.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గదికి వెళ్లి.. వచ్చే మ్యాచ్‌ లో వన్‌ డౌన్‌ లో దిగుతానని కోరాడు. ఈ విషయాన్ని సూర్యనే చెప్పాడు. ఆ స్థానంలో తప్పకుండా రాణిస్తాననే నమ్మకంతోనే తిలక్ దిగాడట. అడిగి మరీ చాన్స్‌ తీసుకున్నందుకు అతడిని కెప్టెన్ సూర్య ప్రశంసించాడు. తిలక్‌ సెంచరీ సాధించడం అతడికి జట్టులో చోటును దాదాపు ఖాయం చేసిందనే చెప్పాలి. కాగా, కొన్నాళ్లుగా తిలక్ టీమ్ ఇండియాలోకి వస్తూ పోతున్నాడు. మధ్యలో గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అయితే, దక్షిణాఫ్రికా సిరీస్ కు చోటు దక్కినా పెద్దగా ఆశల్లేవు. రియాన్ పరాగ్ దూరం కావడంతో తిలక్ కు చాన్స్ దక్కింది. ఇప్పుడు అతడు దానిని సద్వినియోగం చేసుకున్నాడు.

Tags:    

Similar News