OTT రంగంలో డిస్నీ ప్ల‌స్ హవా

ఇప్పుడు డిస్నీ+ ఆకట్టుకునే 52 మిలియన్ల చందాదారులతో భార‌త‌దేశంలో అగ్రస్థానంలో ఉంది.

Update: 2024-09-05 09:30 GMT

నేడు వినోదం అంటే థియేట‌ర్ కి వెళ్లి సినిమాలు చూడ‌టం వ‌ర‌కే ప‌రిమితం కాదు. థియేట్రిక‌ల్ రంగంతో పాటు బుల్లితెర రంగం, ఓటీటీ రంగం స‌మాంత‌రంగా ఎదుగుతున్నాయే కానీ వాటికి డిమాండ్ ఎంత‌మాత్రం త‌గ్గ‌డం లేదు. ఓటీటీలు ప్రారంభం భారీ పెట్టుబ‌డులు పెట్టాల్సి రావ‌డంతో రిట‌ర్నులు స‌రిపోల‌క విల‌విల‌లాడాయి. ఈ రంగంలో కార్పొరెట్ దిగ్గ‌జాలు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటివి వాటికి ఉన్న భారీ బ్యాక‌ప్ దృష్ట్యా నిల‌దొక్కుకున్నా ప్రాంతీయ ఓటీటీలు నిల‌దొక్కుకోవ‌డం క‌ష్టంగా మారింద‌న్న చ‌ర్చా సాగింది.

ఇదిలా ఉంటే, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కి ధీటుగా డిస్నీ ప్ల‌స్ కూడా ఓటీటీ రంగంలో అద్భుతంగా దూసుకెళుతోంది. ఇప్పుడు డిస్నీ+ ఆకట్టుకునే 52 మిలియన్ల చందాదారులతో భార‌త‌దేశంలో అగ్రస్థానంలో ఉంది. డిస్నీ క్లాసిక్స్, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలు, విస్తృత శ్రేణి ప్రాంతీయ కంటెంట్... సరసమైన చందా ధర సహా భారీ విజువ‌ల్ లైబ్రరీ అగ్ర స్థానాన్ని ప‌దిల‌ప‌రుచ‌కోవ‌డానికి స‌హ‌క‌రించింది.

డిస్నీ+ ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్మోగే పెద్ద బ్రాండ్ గ‌నుక అది అన్నివిధాలా దేశీ మార్కెట్ల‌లో క‌లిసొచ్చింది. అలాగే ఈరోస్ న‌వ్ 39.9 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో రెండవ స్థానంలో ఉంది. 2012లో ప్రారంభించిన ఈ ఓటీటీ సంస్థ ఈరోస్ మీడియా వరల్డ్‌లో భాగం. తక్కువ నెలవారీ ధర రూ. 49 కార‌ణంగా ఈరోస్ విస్త్ర‌త‌ సంఖ్యలో వీక్షకులను ఆకర్షించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో 22 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో మూడో స్థానంలో ఉంది. అమెజాన్ ఇటీవ‌ల‌ సబ్‌స్క్రైబర్ బేస్‌కు దోహదపడే అదనపు ప్రోత్సాహకాలు, తగ్గింపులను అందిస్తోంది. ఇక‌పోతే పోటీ రంగంలో కొత్త ఎత్తుడ‌ల‌తో ముందుకు సాగుతున్న నెట్ ఫ్లిక్స్ కి 5.5 మిలియ‌న్ల స‌బ్ స్క్రిప్ష‌న్లు ఉన్నాయి. డిస్నీ ప్ల‌స్ తో పోలిస్తే ఇది చాలా వెన‌క‌బడి ఉంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News