ఓటీటీలో సత్తా చాటుతున్న మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌

ఇటీవల కాలంలో మలయాళం నుంచి వచ్చిన అనేక సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ఓటీటీలో కాదు థియేటర్లలోనూ విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి.

Update: 2025-01-19 01:30 GMT

ఇటీవల కాలంలో మలయాళం నుంచి వచ్చిన అనేక సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ఓటీటీలో కాదు థియేటర్లలోనూ విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలో గతేడాది చివర్లో వచ్చిన మలయాళ బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ''రైఫిల్‌ క్లబ్‌''. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 19న కేరళలో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. లో-బడ్జెట్‌ తో నిర్మిస్తే దాదాపు రూ. 30 కోట్ల వరకూ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాంటి చిత్రాన్ని ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఓటీటీలో అందుబాటులో తీసుకొచ్చింది.

'రైఫిల్‌ క్లబ్‌' సినిమాలో ఓటీటీల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విజయ రాఘవన్‌, దిలీశ్‌ పోతన్‌, 'హృదయం' ఫేమ్ ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్, ఉన్నిమయ ప్రసాద్ వంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. 90స్ లో టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించిన వాణీ విశ్వనాథ్‌ కీలక పాత్రలో నటించింది. అలానే ఈ మధ్య కాలంలో యాక్టర్ గా అదరగొడుతున్న బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ కూడా ఈ సినిమాలో కనిపించారు. ఇది ఆయనకు మలయాళ డెబ్యూ మూవీ. దీనికి ఆశిక్‌ అబు దర్శకత్వం వహించారు. గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

కథేంటంటే: మంగళూరులో ఉండే అండర్‌ వరల్డ్‌ డాన్‌ దయానంద్‌ బారే (అనురాగ్ కశ్యప్‌) కుమారుడిని ఓ జంట అనుకోకుండా హోటల్ లో హత్య చేస్తుంది. అత్యంత క్రూరుడైన దయానంద్‌ కొడుకుని చంపామని తెలుసుకున్న ఈ జంట.. ప్రాణాలు కాపాడుకోడానికి కేరళ పారిపోతుంది. వయనాడ్‌ కొండల్లో ఉన్న ఉన్న ఓ రిమోట్ రైఫిల్‌ క్లబ్‌లో ఆశ్రయం పొందుతారు. గన్ ఫైరింగ్ లో నిపుణులైన ముగ్గురు వ్యక్తులు ఆ క్లబ్‌ను రన్‌ నడిపిస్తుంటారు. సినిమా హీరో షాజహాన్‌ తన రాబోయే చిత్రం కోసం వేట నేర్చుకోవడానికి అప్పటికే ఆ క్లబ్ లో చేరతాడు. ఇంతలో తన కొడుకును చంపిన వ్యక్తులు రైఫిల్‌ క్లబ్‌ రక్షణలో ఉన్నారని తెలుసుకున్న దయానంద్‌.. ప్రతీకారం తీర్చుకోడానికి తన గ్యాంగ్‌తో కలిసి కేరళ వెళ్తాడు. మరి దయానంద్‌ అక్కడికి వెళ్లిన తర్వాత ఏం చేశాడు? తమ క్లబ్ గౌరవాన్ని కాపాడుకోడానికి సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? డాన్ ను అడ్డుకునే క్రమంలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

రెగ్యులర్ యాక్షన్ థ్రిల్లర్స్ కు కాస్త భిన్నంగా డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్ త‌ర‌హాలో పూర్తిగా క‌ల్పిత క‌థతో దర్శకుడు ఆశిక్‌ అబు 'రైఫిల్‌ క్లబ్‌' చిత్రాన్ని తీర్చిదిద్దాడు. వెస్ట్రన్‌ స్టైల్‌ బ్యాక్ డ్రాప్, గన్‌ ఫైరింగ్‌ ఎపిసోడ్స్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడంతో పాటుగా మంచి వినోదాన్ని అందిస్తాయి. తెర నిండుగా అనేక పాత్రలు కనిపించినా.. ప్రతీ పాత్రకు తగినంత ప్రాధాన్య‌త‌ ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. సింపుల్ కథను ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ సినిమాని రూపొందించారు. పాత్రల పరిచయాలకు కాస్త సమయం తీసుకున్నా, కథలోకి వెళ్లిన తర్వాత ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. నైట్ ఎఫెక్ట్స్, రైఫిల్ ఫైట్ సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి.

నిజానికి హాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తాయి కానీ, మన దగ్గర వెస్ట్రన్‌ స్టైల్‌ సినిమాలు పెద్దగా రావు. కార్తీక్ సుబ్బరాజు లాంటి పలువురు దర్శకులు అప్పుడప్పుడు ఆ స్టైల్ మేకింగ్ ట్రై చేస్తుంటారు. ఇప్పుడు ఆశిక్‌ అబు తీసిన ''రైఫిల్‌ క్లబ్‌'' మూవీ ఆడియన్స్ కు కొత్త అనుభూతిని పంచుతుంది. ఈ తరహా సినిమాలను తెలుగులో తీస్తే జనాలు ఆదరిస్తారో లేదో తెలియదు కానీ.. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం బాగానే చూస్తున్నారు. మలయాళం, తెలుగుతో పాటుగా ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది కాబట్టి.. ఈ వీకెండ్ లో ఓటీటీలో చూడటానికి ఈ మూవీ బెస్ట్ సజెషన్ అని చెప్పాలి.

Tags:    

Similar News