OTT - రూట్ మారింది!

ఓటీటీలో భారీ వ్యూయర్ షిప్ రాదని చెబుతున్నట్లు సమాచారం. అందుకే తండేల్, గేమ్ ఛేంజర్ డీల్స్ లో మార్పులు చేర్పులు జరిగినట్లు తెలుస్తోంది.

Update: 2024-10-20 06:51 GMT

ప్రస్తుత రోజుల్లో ఓటీటీలకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు.. ఓటీటీల్లోకి ఎప్పుడు వస్తాయోనని సినీ ప్రియులు వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇంకా స్ట్రీమింగ్ అవ్వడమే లేటు.. చూసేస్తుంటారు. కొన్నిసార్లు ఓటీటీలోకి ఫలానా సినిమా ఎప్పుడు వస్తుందోనని కూడా.. సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తుంటారు. అలా ఓటీటీలకు ఇండియన్ మూవీ లవర్స్ బాగా అలవాటు పడిపోయారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

అయితే కరోనా మహమ్మారి ముందు వరకు ఒకెత్తు..ఆ తర్వాత మరో ఎత్తు అన్నట్లు ఉంది ఓటీటీల పరిస్థితి. మహమ్మారి విజృంభణ సమయంలో బయటకు వెళ్లలేక అంతా ఓటీటీల బాట పట్టారు. అదే అదనుగా తీసుకుని నిర్వాహకులు.. భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఊహించని రీతిలో డీల్స్ కుదుర్చుకుని పలు సినిమాలు, వెబ్ సిరీసులను స్ట్రీమింగ్ చేశారు. దీంతో అనేక మంది ఓటీటీలకు అట్రాక్ట్ అయ్యారు. నిర్వాహకులు కూడా యూజర్స్ కు తగ్గట్లే ప్లాన్స్ వేసుకున్నారు.

అదే సమయంలో ఓటీటీ నిర్వాహకులు.. భారీ మొత్తంలో చెల్లించి పలు సినిమాలను నేరుగా తమ ప్లాట్ ఫామ్స్ లోనే రిలీజ్ చేశారు. కొన్ని ప్రత్యేకంగా తెరకెక్కించి మరీ స్ట్రీమింగ్ చేశారు. దాంతోపాటు థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే స్ట్రీమింగ్ కు అనుమతులు ఇస్తే.. ఎక్కువ డబ్బులు ఇస్తామని మేకర్స్ కు ఓటీటీ వాళ్లు చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అనేక మంది మేకర్స్.. తమ సినిమాలను థియేట్రికల్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు ఓటీటీలు రూట్ మార్చేశాయని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. పరిస్థితులు మారిపోయాయని టాక్ వినిపిస్తోంది. మేకర్స్ డిమాండ్ చేస్తున్న డబ్బులను ఇవ్వడం లేదని తెలుస్తోంది. అసలు అన్ని సినిమాలను కొనుగోలు చేయడం లేదని సమాచారం. ఒకవేళ కొనుగోలు చేసినా డీల్ ను తక్కువకే ఖరారు చేస్తున్నారని వినికిడి. అదే సమయంలో కండీషన్స్ కూడా పెడుతున్నారట. దీంతో ఇప్పుడు నిర్మాతలకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని తెలుస్తోంది.

తాము చెప్పిన డేట్ కే సినిమాలు రిలీజ్ చేయాలని ఓటీటీలు ఒత్తిడి తెస్తున్నాయట. లేదంటే తక్కువ డబ్బులు ఇస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి చిత్రాలకు బాగా తక్కువ ధర ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాలను థియేటర్లలోనే ఎక్కువ మంది చూస్తారని.. ఓటీటీలో భారీ వ్యూయర్ షిప్ రాదని చెబుతున్నట్లు సమాచారం. అందుకే తండేల్, గేమ్ ఛేంజర్ డీల్స్ లో మార్పులు చేర్పులు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఓటీటీల కోసం ఇప్పుడు ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News