పాస్‌వర్డ్ షేరింగ్ కట్.. నెట్‌ఫ్లిక్స్ బాటలో ఇతర ఓటీటీలు!
నెట్ ఫ్లిక్స్ ఇటీవల తన వినియోగదారులను పెద్ద దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే
పాస్ వర్డ్ షేరింగ్ ఆప్షన్ ని తొలగించి నెట్ ఫ్లిక్స్ ఇటీవల తన వినియోగదారులను పెద్ద దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ప్రతికూల ఫలితం తప్పదని భావించినా తమ వ్యాపారం వృద్ధిలో ఉందని నెట్ ఫ్లిక్స్ ప్రచారం చేసుకుంటోంది. ఇంతలోనే సదరు కార్పొరెట్ దిగ్గజం బాటలో ఇతర ఓటీటీలు పాస్ వర్డ్ షేరింగ్ ఆప్షన్ ని తొలగించనున్నాయనేది తాజా షాకింగ్ వార్త.
వాల్ట్ డిస్నీ ఇండియన్ స్ట్రీమింగ్ సర్వీస్, డిస్నీ+ హాట్‌స్టార్ తమ ప్రీమియం వినియోగదారులలో పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిరోధించే లక్ష్యంతో కొత్త విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం సదరు ప్లాట్‌ఫారమ్‌లోని ప్రీమియం ఖాతా గరిష్టంగా 10 పరికరాల్లో లాగిన్‌లను అనుమతిస్తుంది. అయితే వెబ్‌సైట్ నాలుగు పరికరాల పరిమితిని పేర్కొంది. రాయిటర్స్ సోర్స్ ప్రకారం, ఈ ఏడాది చివర్లో నాలుగు పరికరాల లాగిన్ విధానాన్ని అమలు చేయాలని కంపెనీ యోచిస్తోంది కాబట్టి ఆ మేరకు వినియోగదారుకు పంచ్ పడనుందనేదానిపై క్లారిటీ వచ్చింది.
స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మేలో 100కి పైగా దేశాల్లోని సబ్‌స్క్రైబర్‌లకు తమ ఇంటి వెలుపల ఉన్న వ్యక్తులతో తమ సేవల్ని షేర్ చేసుకోవడానికి అదనపు రుసుము అవసరమని తెలియజేయడం ద్వారా ఇదే విధమైన చర్య తీసుకుంది. ఇంతలోనే డిస్నీ తన వినియోగదారుల మధ్య పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిరుత్సాహపరచాలని కొత్త పరిమితులతో షేరింగుకి ఆస్కారం లేకుండా ఎవరికి వారు విడివిడిగా సభ్యత్వాలను తీసుకునేలా ప్రోత్సహించాలని భావిస్తోంది.
డిస్నీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జియో సినిమా వంటి ప్లేయర్‌లు భారీ ప్రజాదరణను పొందడంతో స్ట్రీమింగ్ సేవలకు భారతదేశం కీలకమైన మార్కెట్‌గా అవతరించింది. 2027 నాటికి భారతీయ స్ట్రీమింగ్ రంగం 7 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా ఎదగగలదని మీడియా పార్టనర్స్ ఆసియా అంచనా వేసింది. ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్ మార్కెట్‌లో ఆధిపత్య స్థానంలో కొనసాగుతోంది. దాదాపు 50 మిలియన్ల వినియోగదారులతో వీక్షకుల వాటా పరంగా మార్కెట్ లీడర్‌గా నిలిచింది. జనవరి 2022 - మార్చి 2023 మధ్య కాలంలో, రీసెర్చ్ సంస్థ మీడియా పార్ట్‌నర్స్ ఆసియా నుండి వచ్చిన డేటా ప్రకారం... డిస్నీ హాట్‌స్టార్ భారతదేశంలో స్ట్రీమింగ్ మార్కెట్‌లో 38 శాతం వాటాను కలిగి ఉంది. ప్రత్యర్థులు నెట్‌ఫ్లిక్స్ .. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఒక్కొక్కటి 5 శాతం కలిగి ఉన్నాయి.
పాస్‌వర్డ్ షేరింగ్ ద్వారా సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించడానికి 4 డివైస్ లాగిన్ విధానాన్ని అమలు చేయాలనే నిర్ణయం ఉత్కంఠగా మారుతోంది. దీంతో లాగిన్ ఐడి- పాస్ వర్డ్ లేని వినియోగదారులు చివరికి చెల్లింపు కస్టమర్‌లుగా మారతారని ఆశిస్తున్నారు. భారతీయ మార్కెట్ లో ఓటీటీలకు పెరుగుతున్న ప్రాముఖ్యత .. ఆదాయ వృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉన్నందున డిస్నీ ఇప్పుడు పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టడంలో మరింత చురుకైన వైఖరిని అనుసరిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లలో కేవలం 5 శాతం మంది మాత్రమే ప్రస్తుతం నాలుగు పరికరాల లాగిన్ పరిమితిని మించిపోయారని గమనించాలి.
అయినప్పటికీ పాలసీని అమలు చేయడం ద్వారా నిజమైన అవసరార్థులకు సొంత ఖాతాలను కొనుగోలు చేయడానికి ప్రోత్సహించే ఆలోచన ఇది అని .. ఇది స్థిరమైన వృద్ధికి దారితీస్తుందని సేవల దుర్వినియోగం తగ్గుతుందని కంపెనీ విశ్వసిస్తోంది. పాలసీ మార్పుతో పాటు డిస్నీ తన ఇండియా డిజిటల్ అండ్ టీవీ వ్యాపారం కోసం జాయింట్ వెంచర్ భాగస్వామిని కనుగొనడానికి ప్రయత్నిస్తోంది. కంపెనీ తన వ్యాపార అవకాశాలను పెంచుకుంటూనే భారతీయ మార్కెట్ విస్తారమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి చురుకుగా వ్యూహరచన చేస్తోందని తాజా నిర్ణయం సూచిస్తోంది.