బీజేపీలోకి ఆ నలుగురు!
తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీలోకి వస్తే తమ భవితవ్యం, బీజేపీలో ప్రాధాన్యత గురించి వీళ్లు చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఎన్నికల ఏడాదిలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. చేరికలు, ప్రచారంతో ప్రధాన పార్టీలు హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా.. ఓ పార్టీలో టికెట్ దక్కదని భావించి.. టికెట్ హామీతో ఇతర పార్టీల్లోకి వెళ్లే నాయకుల ట్రెండు ఇప్పుడు సాగుతోంది.
తాజాగా మరో నలుగురు నేతలు బీజేపీలోకి చేరేలా కనిపిస్తున్నారు. ఇందులో ఓ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, డీసీసీబీ మాజీ ఛైర్మన్లు ఇద్దరున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డి, మెదక్ డీసీసీబీ మాజీ ఛైర్మన్ జైపాల్‌రెడ్డి, రంగారెడ్డి డీసీసీబీ మాజీ ఛైర్మన్ లక్ష్మారెడ్డి త్వరలోనే కాషాయ కండువా కప్పుకునేలా కనిపిస్తున్నారు.
ఈ నలుగురితో పాటు మరికొంత మంది నేతలు కలిసి.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీలోకి వస్తే తమ భవితవ్యం, బీజేపీలో ప్రాధాన్యత గురించి వీళ్లు చర్చించినట్లు తెలుస్తోంది. తాము అనుకున్న హామీలు దక్కితే ఈ నలుగురు త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
సీనియర్ నాయకుడు ఆకుల రాజేందర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో మల్కాజిగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న ఆయన.. పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదనే ఆవేదనలో ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు, విభేదాలు ఎక్కువయ్యాయి. దీంతో ఆ పార్టీలో ఉండలేక బీజేపీలోకి చేరిపోదామని రాజేందర్ అనుకుంటున్నారని సమాచారం.